కోటి మంది కోసం వస్తున్నావా పెద్దన్న

Update: 2020-02-22 18:30 GMT
తొలిసారి భారత పర్యటనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వస్తున్నాడు. తన భార్య మెలానియా, కుమార్తె ఇవాంక, అల్లుడు జేర్డ్ కుష్నర్ తో కలిసి భారత్ లో పర్యటించనున్నాడు. అయితే భారత పర్యటనపై ట్రంప్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. తనకు అపూర్వ స్వాగతం పలుకుతూ.. ప్రపంచంలోనే తాను కీలక వ్యక్తిని కావడంతో కోటి మందితో తనకు భారతీయులు స్వాగతం పలకబోతున్నారని ముచ్చటపడుతున్నారు. అయితే ట్రంప్ తన పర్యటనపైనే గత నెల రోజులుగా మురిసిపోతున్నారు. అంతమంది.. ఇంతమంది అంటూ రోజుకో మాట చెబుతూ భారతీయులను, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి షాకిస్తున్నారు. తాజాగా ఆయనకు కోటి మందితో తనకు స్వాగతం పలుకబోతున్నారని ఎవరూ ప్రకటించకుండానే ఆయన తెలిపారు. ఈ మేరకు అమెరికాలో ట్రంప్ ప్రకటన చేయడంతో భారతదేశంలో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.

ఫిబ్రవరి 25వ తేదీన గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కలిసి ట్రంప్ దంపతులు భారీ రోడ్ షో చేపట్టనున్నారు. ఈ రోడ్ షోకు 70 లక్షల మంది తనకు స్వాగతం పలుకుతారని రెండు రోజుల కిందట ట్రంప్ ప్రకటించాడు. ఆ తర్వాత ఇప్పుడు కోటి అని చెబుతున్నారు. అంతమంది వస్తారని భారత ప్రధాని నరేంద్ర మోదీయే తనతో చెప్పారని కూడా ఆయన అమెరికాలో జరిగిన పలు కార్యక్రమాల్లో ట్రంప్ ప్రకటిస్తున్నారు. గురువారం అమెరికాలోని కొలరాడో సభలో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అహ్మదాబాద్‌లో నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియానికి వెళ్లే 22 కిలోమీటర్ల మార్గం పొడవునా కోటి మంది ప్రజలు తనకు తనకు స్వాగతం పలకుతారని సంబరంతో ప్రకటించారు. ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమం తనను చెడగొడుతుందని, కోటి మంది హాజరయ్యే కార్యక్రమం చూశాక అమెరికాలో 60 వేల మంది హాజరయ్యే సభలు తనను సంతృప్తిపర్చలేవని పేర్కొనడం విశేషం. ట్రంప్ వచ్చేది ప్రజల కోసమా.. లేదా భారత్ తో సత్సంబంధాల కోసమా అని సోషల్ మీడియాలతో పలువురు ప్రశ్నిస్తున్నారు. అమెరికాలో ఏం వెలగబెట్టలేవు గానీ.. భారత్ కు వచ్చి ఇక్కడ 70 లక్షలు, కోటి మంది అంటూ ఏమిటో ఆయన పిచ్చి ఆనందం అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అయినా ఎక్కడైనా కోటి మంది పాల్గొంటారా? దేశంలో ఒకేసారి కోటి మంది హాజరైతే ఇంకేమన్న ఉందా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మోదీ-ట్రంప్‌ రోడ్‌షోకు అంత మందిని తీసుకువస్తే బందోబస్తుతో పాటు చాలా ఇబ్బందులు ఎదుర్కొనవాల్సిందే. ఒక కోటి మంది ఒక నగరం, లేదా ఒక చిన్న రాష్ట్రమంతా జనాభా. అంతమందిని ఎక్కడ నిలుపుతారు.. ఎలా నియంత్రిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆశకైనా హద్దు ఉండాలని పేర్కొంటున్నారు. వీరి పర్యటనకు 1-2 లక్షల మంది హాజరవుతారని అహ్మదాబాద్ మునిసిపల్‌ కమిషనర్‌ చెప్పారు.
4

అయితే ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పిన సంఖ్యను తప్పుగా అర్థం చేసుకుని ఉంటారని తెలుస్తోంది. అమెరికాలో భారత్ మాదిరి అంకెలను గణించరు. అక్కడ వేలు, వంద వేలు, మిలియన్, బిలియన్, ట్రిలియన్ అంటారు. అయితే మోదీ చెప్పిన లక్ష మందిని ట్రంప్ మిలియన్ అని భావించి ఉండవచ్చు. మోదీ పది లక్షలంటే ట్రంప్ 10 మిలియన్ గా భ్రమ పడి ఉండవచ్చు. 10 మిలియన్ అంటే కోటి. అంటే కోటి జనాభా వస్తారని ఆయన పగటి కలలు కంటున్నారు. ఆయన ఇప్పటికైనా భ్రమలో నుంచి బయటకు రావాలని ట్రంప్ ను ఉద్దేశించి సోషల్ మీడియా సిటిజన్స్ సూచిస్తున్నారు.

Tags:    

Similar News