బావ Vs బామ్మర్ది: లడ్డూ వివాదంపై బాలినేని హాట్ కామెంట్స్
ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న తిరుమల లడ్డూ ఇష్యూపై జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.;
ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్న తిరుమల లడ్డూ ఇష్యూపై జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లడ్డూ ప్రసాదంపై ఏం మాట్లాడినా భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని, ఆ విషయంలో తానేమీ ఎక్కువ మాట్లాడనంటూనే టీటీడీ మాజీ చైర్మన్ వైవీపై విమర్శలు గుప్పించారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని వైవీ స్వయంగా ఒప్పుకున్నారని, ఆయన విషయాన్ని దేవుడికే వదిలేయాలంటూ బాలినేని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాలినేని విమర్శలపై అంతే ఘాటుగా వైవీ స్పందించారు. తన బావపై ఎదురుదాడికి దిగారు. ఈ ఇద్దరి మధ్య డైలాగ్ వారు అటు ప్రకాశం జిల్లాతోపాటు రాష్ట్రంలో జనసేన, వైసీపీ కార్యకర్తల్లో విస్తృత చర్చకు దారితీసింది.
జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి తన బావమరిది, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డిపై తిరుమల లడ్డూ కల్తీ అంశానికి సంబంధించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరి మధ్య చాలా కాలం నుంచి రాజకీయంగా తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. ఇద్దరూ ఒకే కుటుంబ సభ్యులు అయినప్పటికీ సొంత ప్రాంతమైన ప్రకాశం జిల్లాలో బాలినేని ప్రాభవం తగ్గించేలా వైవీ వ్యవహరిస్తున్నారని ఆయనతో విభేదిస్తూ వస్తున్నారు. గతంలో ఇద్దరూ ఒకే పార్టీలో ఉండగా, బాలినేని గత ఎన్నికల తర్వాత జనసేనలో చేరారు. ఇద్దరూ వైసీపీలో ఉన్నప్పటి నుంచి ఉత్తర, దక్షిణ ధృవాలుగానే వ్యవహరిస్తూ వచ్చారు.
ఈ నేపథ్యంలో తిరుమల లడ్డూ ప్రసాదంపై నెలకొన్న రాజకీయ వివాదంపై బాలినేని తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ అంశాన్ని పదే పదే మాట్లాడి భక్తుల మనోభావాలు దెబ్బతీయడం కరెక్ట్ కాదని బాలినేని వ్యాఖ్యానించారు. కానీ కల్తీ జరిగిందని వైవీ అంగీకరించిన అంశాన్ని ప్రస్తావిస్తూ తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని వైవీ సుబ్బారెడ్డి స్వయంగా ఒప్పుకున్నారని అన్నారు. కల్తీ జరిగినప్పుడు ఛైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి దీనికి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
మరోవైపు బాలినేని వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి సైతం ఘాటుగా స్పందించారు. లడ్డూ కల్తీ జరిగిందని తాను అంగీకరించినట్లు బాలినేని చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. తాను ఎక్కడా కల్తీ జరిగిందని ఒప్పుకోలేదని, తన వ్యాఖ్యలను బాలినేని తప్పుగా వక్రీకరిస్తున్నారని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. నేను ఏ తప్పూ చేయలేదు.. కావాలంటే దేవుడి సాక్షిగా ప్రమాణం చేయడానికి కూడా సిద్ధం" అని ఆయన సవాల్ విసిరారు. తన హయాంలో నాణ్యమైన నెయ్యినే వాడామని స్పష్టం చేశారు.
బాలినేని కావాలనే తనపై బురద జల్లుతున్నారని, రాజకీయ ఉనికి కోసమే ఇటువంటి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై ఇప్పటికే సిట్ (SIT) విచారణ జరుగుతోందని, నిజానిజాలు బయటకు వస్తాయని, అప్పటివరకు ఓపిక పట్టాలని ఆయన సూచించారు. లడ్డూ వివాదంపై బాలినేని తొలిసారిగా మాట్లాడటంపై విస్తృత చర్చ జరుగుతోంది. వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత బాలినేని ఇంతవరకు గత ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై పెద్దగా స్పందించింది లేదు. కానీ, తొలిసారిగా తన బావమరిది వైవీపై వస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ ఆయన బాధ్యత వహించాలని డిమాండ్ చేయడంపై పెద్ద చర్చ జరుగుతోంది.