ఏపీలో భారీ బడ్జెట్...పయ్యావుల వరాలు

బడ్జెట్ అంటేనే ఎన్నో ఆశలు. ఇది ప్రతీ ఇంటి నుంచి మొదలవుతుంది. ఎంత ఖర్చు ఎంత ఆదాయం. ఈ చిట్టా పద్దులె బడ్జెట్.;

Update: 2026-02-13 15:14 GMT

బడ్జెట్ అంటేనే ఎన్నో ఆశలు. ఇది ప్రతీ ఇంటి నుంచి మొదలవుతుంది. ఎంత ఖర్చు ఎంత ఆదాయం. ఈ చిట్టా పద్దులె బడ్జెట్. అంతే కాదు మిగులు తగులూ నడుమ ఆశలను తీర్చే అవకాశాలను చూడడమే బడ్జెట్. రాష్ట్ర బడ్జెట్ అయినా దేశ బడ్జెట్ అయినా వరాల కోసం ఎదురుచూస్తారు. తమకు ఏమిటి ఇస్తున్నారు. ఏ శుభ వార్తలు మోసుకుని వస్తున్నారు అని కూడా ఎంతో ఆసక్తిగా వేచి చూస్తూ ఉంటారు. కేంద్ర బడ్జెట్ లో అయితే మధ్య తరగతి అనుకున్న విధంగా ఊరట దక్కలేదు అన్న అసంతృప్తి ఉంది. ఇక ఏపీ బడ్జెట్ గురించి అయిదు కోట్ల మంది ప్రజలు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు.

పెద్ద నంబర్ తోనే :

ఇక ఏపీ బడ్జెట్ చూస్తే ఈసారి భారీ సైజ్ గానే ఉంటుందని చెబుతున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏకంగా మూడున్నర లక్షల కోట్ల రూపాయలతో ఒక సమగ్రమైన బడ్జెట్ నే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రూపొందించారు అని అంటున్నారు. ఏపీలోని వివిధ వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా అనేక కార్యక్రమాల్లో పాటు సంక్షేమం అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ ఈ బడ్జెట్ ఉంటుంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ బడ్జెట్ లో అనేక మెరుపులు కూడా ఉండొచ్చు అని కూడా అంతా ఆశిస్తున్నారు. గతసారి మూడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టారు, ఈసారి మరో యాభై లక్షల కోట్లు పెరుగుతోంది అంటే మరింతగా ప్రయోజనం చేకూరుతుంది అని అంటున్నారు.

ప్రాధాన్యత రంగాలకు :

పయ్యావుల కేశవ్ బడ్జెట్ లో ప్రాధాన్యత రంగాలకు పెద్ద పీట వేయబోతున్నారు అని అంటున్నారు. ముఖ్యంగా వ్యవసాయం రైతులకు ప్రాముఖ్యత లభించబోతోంది అని తెలుస్తోంది. అలాగే మహిళా సంక్షేమానికి కూడా అగ్ర తాంబూలం ఇవ్వబోతున్నారు అంటున్నారు ఇక సూపర్ సిక్స్ హామీలలో నాలుగింటిని ఇప్పటికే అమలు చేస్తున్నారు, వీటికి బడ్జెట్ లో నిధులు దండీగా కేటాయింపులు చేస్తారు అని అంటున్నారు.

బ్యాలెన్స్ చేస్తూ :

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక విషయం స్పష్టం అవుతోంది. అభివృద్ధి సంక్షేమం ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమాన్ని వీడేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. దాంతో పాటు గతానికి కంటే ఎక్కువగానే ఖర్చు చేస్తున్నారు. ఇపుడు కూడా 2026-27 బడ్జెట్ లో సంక్షేమానికి కీలకమైన ప్రాధ్యాత ఇవ్వబోతున్నారు అని అంటున్నారు. అదే సమయంలో అభివృద్ధి మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఫోకస్ పెడుతూ వస్తోంది. దాంతో అమరావతి రాజధాని పోలవరం కి ముందుగా ఖర్చు చేసే నిధులతో పాటు సాగు నీటి రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం, మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేయడం వంటివి ఈసారి బడ్జెట్ లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయని అంటున్నారు.

మంత్రివర్గం ఆమోదం :

ఇక 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ కి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం కోసం శనివారం ఉదయం పదిన్నరకు చంద్రబాబు అధ్యక్షతన సమావేశం అవుతుంది. ఆ తరువాత పదకొండు గంటల పదిహేను నిముషాలకు బడ్జెట్ ని ఆర్ధిక మంత్రి అసెంబ్లీలో ప్రవేశపెడతారు ఇక శాసనమండలిలో బడ్జెట్ ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రవేశపెడతారు అని అంటున్నారు వ్యవసాయ బడ్జెట్ ని మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశ పెడతారు అని అంటున్నారు. మొత్తం మీద పయ్యావుల ఆర్ధిక మంత్రిగా ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి రెండవ బడ్జెట్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News