ఆ డబ్బులు తీసుకుని గట్టిగా విజిల్ వేయండి.. దళపతి విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
తమిళనాడు ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్ది రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.;
తమిళనాడు ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్ది రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార డీఎంకేని ఓడించాలనే కసితో పార్టీ పెట్టిన సినీ నటుడు, దళపతి విజయ్ పర్యటనలు తమిళ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. శుక్రవారం సేలంలో పర్యటించిన టీవీకే అధినేత విజయ్ అధికార డీఎంకేపైన ముఖ్యమంత్రి స్టాలిన్ పైన విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు డబ్బులు ఇస్తాయని, ఆ డబ్బు తీసుకుని గట్టిగా విజిల్ వేయండి అంటూ తన ఎన్నికల గుర్తును తనదైన స్టైల్ లో ప్రచారం చేసుకున్నారు విజయ్.
టీవీకే పార్టీని లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలను దళపతి విజయ్ గట్టిగా తిప్పికొడుతున్నారు. ప్రధానంగా తనకు అనుభవం లేదంటూ అధికార డీఎంకే చేస్తున్న ప్రచారానికి సరైన కౌంటర్ ఇచ్చారు. ‘‘మాకు దోచుకునే అనుభవం లేదు’’ అంటూ డీఎంకే విమర్శలను తిప్పికొట్టారు. వచ్చే ఎన్నికల్లో తాను సొంతంగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. డీఎంకే, అన్నా డీఎంకే మాదిరిగా మిత్రపక్షాలపై తాను ఆధారపడనని విజయ్ స్పష్టం చేశారు.
ఇదే సమయంలో డబ్బులు పెట్టి ఓట్లు కొనుగోలు చేసే పద్ధతికి ఫుల్ స్టాప్ పడాలని విజయ్ ఆకాంక్షించారు. ఓట్లను కొనుగోలు చేసే హక్కు ఎవరికీ లేదని తేల్చిచెప్పారు. డీఎంకే సంక్షేమ కార్యక్రమాలను ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఓటర్లను ఆకట్టుకోడానికి మహిళల అకౌంట్లలో రూ.5 వేలు డిపాజిట్ చేయాలని ప్రభుత్వం ప్రయత్నించడాన్ని విజయ్ తప్పుపట్టారు. ఈ సందర్భంగా ఎటువంటి ప్రలోభాలకు లొంగవద్దని ప్రజలను విజయ్ కోరారు. ఓట్లు కొనుగోలు ఆగిపోవాలి. నా ఓటు నా హక్కు. మన ఓట్లను ఎవరూ కొనలేరు అంటూ విజయ్ నినాదాలు చేశారు. అంతేకాకుండా ఎన్నికల సమయంలో రూ.2,000, రూ.3,000, రూ.5,000 ఇవ్వడానికి కొందరు ప్రయత్నిస్తారు. ఆ డబ్బు మీదే, నిరభ్యంతరంగా తీసుకోండి. తీసుకున్న తర్వాత వారి చెవి వద్ద గట్టిగా విజిల్ వేయండి అంటూ తన ఎన్నికల గుర్తును ప్రజలకు గుర్తు చేశారు.
ఈ సందర్భంగా విజయ్ భావోద్వేగంతో ప్రసంగించారు. తాను ఏ పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రాలేదని తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రజల కోసం మాత్రమే రాజకీయాల్లోకి వచ్చానని వివరించారు. తన రాజకీయ అనుభవంపై అనేక మంది ప్రశ్నిస్తున్నారు. నన్ను ప్రశ్నించేవారికి మోసం చేయడంలో అనుభవం ఉంది. మాకు అందులో కూడా అనుభవం లేదంటూ తన నిజాయితీని ఆవిష్కరించుకునే ప్రయత్నం చేశారు దళపతి. ఈ సందర్బంగా డీఎంకే-కాంగ్రెస్ పొత్తుపై గతంలో సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను విజయ్ ప్రస్తావించారు. దీంతో విజయ్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎవరితో పొత్తు పెట్టుకోనని చెబుతున్న విజయ్.. డీఎంకే కూటమిని విడగొట్టే వ్యూహంతో పనిచేస్తున్నారా? అనే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.