అమెరికాను పాక్ ఒత్తిడి చేస్తే.. మనం ఎందుకు చేయట్లేదు?
అంతర్జాతీయంగా ఒక పరిణామం చోటు చేసుకుంది. భారత్ - అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ కు సంబంధించి అగ్రరాజ్యం ఒక పోస్టు పెట్టింది.;
అంతర్జాతీయంగా ఒక పరిణామం చోటు చేసుకుంది. భారత్ - అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ కు సంబంధించి అగ్రరాజ్యం ఒక పోస్టు పెట్టింది. సోషల్ మీడియాలో పెట్టిన ఈ పోస్టు సంచలనంగా మారింది. దీనికి కారణం భారత్ తో కుదిరిన వాణిజ్య డీల్ కు సంబంధించిన సమాచారాన్ని.. భారత మ్యాప్ ను అమెరికా తన పోస్టులో పెట్టింది. దీనిపై దాయాది పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి కారణం.. అమెరికా పోస్టు చేసిన మ్యాప్ లో జమ్మూ కశ్మీర్ మొత్తం ప్రాంతాన్ని చూపించారు. పాకిస్థాన్ అక్రమిత కశ్మీర్ మాత్రమే కాదు చైనా అక్రమిత అక్సాయ్ చిన్ ను కూడా భారత భూభాగంగా చూపించింది.
దీని మీద ఎలాంటి వివాద గుర్తులు లేకుండా చూపించారు. దీనిపై పాకిస్థాన్ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. దీనికి కారణం లేకపోలేదు. గతానికి భిన్నంగా ఈ తరహా మ్యాప్ లను విడుల చేయటం అమెరికా సంప్రదాయ మ్యాప్ ప్రాక్టీస్ కు విరుద్ధంగా చెబుతున్నారు. యూఎస్ అధికారులను సంప్రదించిన పాక్.. ఆ మ్యాప్ సరైనది కాదని.. కశ్మీర్ వివాదాస్ప ప్రాంతంగా పేర్కొంటూ యూఎస్ అధికారులతో మాట్లాడినట్లుగా పాకిస్థాన్ విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి తాహర్ అండ్రాబీ వెల్లడించారు.
పాక్ అభ్యంతరాల్ని పరిగణలోకి తీసుకున్న అమెరికా.. ఆ మ్యాప్ ను తొలగించింది. ట్రేడ్ డీల్ ను మాత్రం యథాతధంగా ఉంచేశారు. దీనికి సంబంధించి అమెరికా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అదే సమయంలో భారత్ సైతం మౌనంగా ఉంది. చాలామందికి ఇక్కడ వచ్చే సందేహం ఏమంటే.. అమెరికాతో పాకిస్థాన్ మాట్లాడి.. ఒత్తిడి తీసుకొచ్చి మ్యాప్ ను తొలగించేలా చేయించినప్పుడు.. అదే తరహాలో భారత్ ఎందుకు చేయకూడదని. మ్యాప్ డిలీట్ చేసిన తర్వాత పాకిస్థాన్ లో పలువురు ఇది తమ దౌత్యపరమైన విజయంగా ప్రచారం చేసుకోవటం కనిపిస్తుంది.
ఈ వ్యవహారంలో భారత్ ఏ మాత్రం స్పందించకుండా మౌనంగా ఉండిపోయింది. దీనికి కారణం లేకపోలేదు. మ్యాప్ ను అడ్డుకోవటం.. పోస్టు చేసిన మ్యాప్ ను మళ్లీ పెట్టేలా ఒత్తిడి చేయటం లాంటివి అనవసరమైన అంశాలుగా చెబుతున్నారు. చిన్న విషయాలకు పెద్ద గొంతు వేసుకొని పడిపోకుండా.. అనవసర వివాదాల విషయాన్ని తాను పట్టించుకోనన్న సంకేతాల్ని పంపుతూ మౌనంగా ఉన్నట్లు చెబుతున్నారు. అడ్డుకోవటం వల్ల మిగిలిన అంశాలు పక్కకు వెళ్లి.. అనవసరమైన భావోద్వేగాలు పెరుగుతాయి. ఒత్తిడికి సంబంధించి అంశాల్ని తీసుకుంటే.. యూఎస్ తో సంబంధాల్ని దెబ్బ తినే కన్నా.. వదిలేయటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి అంశాల్లో పాకిస్థాన్ స్వల్పకాలిక విజయాలకు పరిమితం అవుతుంటే.. భారత్ మాత్రం దీర్ఘకాలిక ప్రయోజనాల్ని ఆశిస్తూ వ్యూహాత్మక మౌనాన్ని ప్రదర్శిస్తుందని చెప్పాలి.