బాలయ్యపై జోకులు.. అసెంబ్లీలో నవ్వులు!!

నట సింహం నందమూరి బాలయ్యపై జోకులు అసెంబ్లీలో నవ్వులు పూయించాయి.;

Update: 2026-02-13 13:05 GMT

నట సింహం నందమూరి బాలయ్యపై జోకులు అసెంబ్లీలో నవ్వులు పూయించాయి. డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు, బీజేపీఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు మధ్య జరిగిన సంభాషణలో బాలయ్య పేరు తీసుకురావడం, ఆ సమయంలో పక్కనే ఉన్న బాలయ్య కూడా పగలపడి నవ్వడం ఆసక్తిరేపింది. ఏపీ అసెంబ్లీలో శుక్రవారం చోటుచేసుకున్న సరదా సంఘటన వైరల్ గా మారింది. ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీకి వెళ్లిన బాలయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ హాయిగా నవ్వుకుంటున్నారు. అభిమానులను నవ్విస్తున్నారు. రెండు రోజుల నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా, గవర్నర్ ప్రసంగానికి ధన్నవాదాలు తెలిపే తీర్మానంపై సభ్యులు మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడాల్సిన సమయం రాగా, సభాధ్యక్ష స్థానంలో డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు కూర్చొన్నారు. రఘురామ బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజును మాట్లాడాల్సిందిగా కోరగా, ఆయన తనకు అవకాశం ఇచ్చినందుకు గాను ధన్యవాదాలు తెలిపారు.

ఇక మాట్లాడేందుకు ఉపక్రమించిన సమయంలో తనకు ఎంత సమయం ఇస్తున్నారని ముందే అడిగి తెలుసుకున్నారు. కేవలం పది నిమిషాలలో ముగించాలని సభాధ్యక్షుడు రఘురామరాజు సూచించగా, విష్ణుకుమార్ రాజు చలోక్తి విసిరారు. ‘‘అధ్యక్ష.. నా పక్కన ఇంత పెద్ద హీరోను కూర్చో పెట్టుకున్నాను. అది చూసి కూడా మీరు పది నిమిషాలు అంటే ఎలా?’’ అంటూ నవ్వుతూ ప్రశ్నించారు. అంతేకాకుండా తన పక్కనే కూర్చున్న బాలయ్యను చూపించారు. దీనికి స్పందించిన రఘురామ కూడా నవ్వుతూ అందుకే పది నిమిషాలు ఇచ్చా లేదంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సభకు వచ్చేవరకు మాట్లాడమంటూ పర్మిషన్ ఇచ్చారు.

ఈ సమయంలో బాలయ్య సైతం కల్పించుకుని చేతులు ఊపుతూ సరదాగా ఏవో వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో నవ్వులు విరిశాయి. సభాధ్యక్ష స్థానంలో ఉన్న రఘురామతోపాటు బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు సైతం పెద్దగా నవ్వారు. ఈ అరుదైన దృశ్యం చూపరులను ఆకర్షిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. రఘురామ, విష్ణుకుమార్ రాజుకి మధ్య దశాబ్దాలుగా స్నేహం ఉంది. ఈ ఇద్దరు చదువుకున్న సమయం నుంచే స్నేహితులు. ఈ విషయాన్ని విష్ణు గతంలోనే వెల్లడించారు. ఆ చనువుతో ఇద్దరు ఏ అవకాశం వచ్చిన ఒకరిపై ఒకరు చలోక్తులు విసురుకుంటుంటారు. ఈ సన్నివేశాలు, ఇద్దరి మధ్య సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి.

Tags:    

Similar News