'ప్లాస్మా థెరపీ'తో నో యూజ్ .. కీలక ప్రకటన చేసిన ICMR !

Update: 2020-09-10 05:00 GMT
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిపోయేలా చేస్తుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి  బారిన చాలా మంది పడ్డారు. ఈ నేపథ్యంలోనే  ఐసీఎంఆర్ తాజాగా ప్లాస్మా థెరపీ పై కీలక ప్రకటన ‌చేసింది.  కరోనా తీవ్రతను అడ్డుకోవడం, మరణాల రేటును తగ్గించటంలో  ప్లాస్మా థెరపీ తో ఎలాంటి ప్రయోజనం లేదని  ఐసీఎంఆర్‌ నిధులతో జరిగిన ప్రత్యేక అధ్యయనంలో వెల్లడైంది. ఏప్రిల్‌ 22 నుంచి జూలై 14 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 39 ఆస్పత్రుల్లో మోస్తరు ఇన్ఫెక్షన్‌ కలిగిన 464 మంది రోగులపై నిర్వహించిన ప్రయోగ పరీక్షల ఫలితాల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చినట్టు ఐసీఎంఆర్‌ ప్రకటించింది.

28 రోజుల వ్యవధిలో సాధారణ చికిత్స, ప్లాస్మా థెరపీ అందించిన వేర్వేరు రోగుల్లో ఇన్ఫెక్షన్‌ కట్టడి, మరణాల రేటు దాదాపు సమాన స్థాయిలోనే ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఈ నివేదికను ‘కొవిడ్‌-19 జాతీయ టాస్క్‌ఫోర్స్‌’ సమీక్షించి ఆమోదం తెలపడం గమనార్హం. ప్లాస్మా థెరపీ పై చైనా , నెదర్లాండ్స్ లోనూ అధ్యయనాలు జరిగి మధ్యలోనే ఆగిపోయానని వెల్లడించింది.

ఇకపోతే , దేశంలో  కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.  గడిచిన 24 గంటల్లో ఇండియాలో రికార్డ్ స్థాయిలో 95,735 కొత్త కేసులు నమోదయ్యాయి.  దీంతో ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 44,65,864కి చేరింది.  ఇందులో ప్రస్తుతం  9,19,018 కేసులు యాక్టివ్ గా ఉండగా, 34,71,784 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో 1172 మంది కరోనాతో మరణించారు.  దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 75,062కి చేరింది.
Tags:    

Similar News