ఐఏఎస్ ఇంటిపై విజిలెన్స్ దాడి.. అవమానం తట్టుకోలేక కుమారుడి ఆత్మహత్య

Update: 2022-06-26 04:30 GMT
ఆయనో సీనియర్ ఐఏఎస్ అధికారి. అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో విజిలెన్స్ అధికారులు ఆయన మీద నిఘా వేశారు. తాజాగా ఆయన ఇంటిపై దాడి చేసి సోదాలు చేశారు. ఐఏఎస్ కుటుంబం.. ఎంతో పేరు ప్రతిష్టలున్నవారు కావడంతో ఈ దాడులను వారు జీర్ణించుకోలేకపోయారు.

ఇంట్లో విజిలెన్స్ అధికారులు సోదాలు చేస్తున్న సమయంలోనే మేడ మీద ఉన్న ఐఏఎస్ కుమారుడు రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  ఈ ఘటన కలకలం రేపుతోంది.

పంజాబ్ కు చెందిన సంజయ్ పొప్రీ సీనియర్ ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్నారు. చండీగఢ్ సెక్టర్ 11లో ఐఏఎస్ అధికారి కుటుంబంతో నివాసముంటున్నాడు. సంజయ్ పోప్రీకి కార్తీక్ పోప్రీ (26) అనే కుమారుడు ఉన్నాడు. సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ పోప్రీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో పంజాబ్ విజిలెన్స్ అధికారులు చండీగఢ్ లోని సెక్టార్ 11లోని ఆయన ఇంటిలో సోదాలు చేశారు. చాలా కాలంగా సంజ్ పోప్రీ మీద అధికారులు నిఘా వేశారని సమాచారం.

ఈ క్రమంలోనే ఇంటిలో సోదాలు చేస్తున్న సమయంలో సంజయ్ భార్య, కుమారుడు కార్తీక్ ఇంట్లోనే ఉన్నారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక సంజయ్ కుమారుడు సోదాలు చేస్తున్న సమయంలోనే మేడ మీదకు వెళ్లి రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

తన కుమారుడు కార్తీక్ ను పంజాబ్ పోలీసులు కాల్చి చంపేశారని అతడి తల్లి ప్రతిజ్ఞా చంఢీగఢ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజిలెన్స్ అధికారుల కారణంగా కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నాడని అతడి కుటుంబ సభ్యులు కేసు పెట్టారని ఓ సీనియర్ పోలీస్ అధికారి అంటున్నారు.

కాగా ఐఏఎస్ అధికారి సంజయ్ పోప్రీని విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేసి కోర్టుముందు హాజరు పరిచారు. కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నాడా? అసలు ఏం జరిగింది? అని పోలీసు అధికారులు ఆరాతీస్తున్నారు.
Tags:    

Similar News