ఓడిపోయినోళ్లు మాకెందుకు.. వైవీ సుబ్బారెడ్డి

Update: 2019-02-23 14:32 GMT
 టీడీపీ అధినేత - ఏపీ సీఎం చంద్రబాబును వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కడిగిపారేశారు. కుమార్తెను కలిసేందుకు లండన్ వెళ్లిన జగన్ మోహన్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ చంద్రబాబు - ఆయన పార్టీ నేతలపై సుబ్బారెడ్డి విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడానికి ఏ మాత్రం వెనుకాడరని పదేపదే నిరూపించుకుంటున్నారని అన్నారు. ఇలాంటి వదంతులు ఇంకా సృష్టించడానికి సాహసిస్తారని.. వైసీపీ శ్రేణులు - నాయకులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.  సీఎం గా ఈ ఐదేళ్లు  ప్రజల సొమ్ముతో ఇష్టం వచ్చినట్లు విదేశీ టూర్లు తిరిగి - జగన్ పై అర్ధరహితంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో భారీస్థాయిలో వైసీపీ సానుభూతి ఓటర్లను తొలగించిన వ్యక్తి చంద్రబాబేనని - ఆయన మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేరని సుబ్బారెడ్డి అన్నారు.
   
ప్రజలు చంద్రబాబు చెప్పే మాటలను నమ్మరని.. ఆయన ఓట్ల ఆశతో ఎన్నికల ముందు పెడుతున్న పథకాలతో ప్రజలెవరూ మోసపోరని సుబ్బారెడ్డి అన్నారు.  దేశంలో ఇంకెక్కడా లేనట్లుగా వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్ చేశారని చెప్పారు.
   
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా నేనే పోటీ చేస్తానని వైసీపీ మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. మాగుంట చేరికపై తమకు సమాచారం లేదని - గతంలో ఓడిపోయిన వాళ్లను గెలిపించుకోవాల్సిన అవసరం మాకు లేదని ఆయన చెప్పారు.  "మాగుంట వస్తే ఎమ్మెల్యే గానో... ఎమ్మెల్సీ గానో  అవకాశం ఇస్తాం....ఇక్కడ మగాళ్లు ఉన్నారు... మిగతా పార్టీనుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసేందుకు ఖాళీ లేదు " అని మాగుంట శ్రీనివాసులురెడ్డిని ఉద్దేశించి సీరియస్ కామెంట్లు చేశారు.
   
గతంలో కాంగ్రెస్ తరపున ఒంగోలు ఎంపీగా వ్యవహరించిన మాగుంట శ్రీనివాసులురెడ్డి... 2014లో టీడీపీ తరపున ఒంగోలు లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. వైవీ సుబ్బారెడ్డి... మాగుంటపై విజయం సాధించారు. అయితే కొద్ది రోజులుగా టీడీపీ అధినాయకత్వం తీరుపై అసంతృప్తితో ఉన్న మాగుంట... వైసీపీలో చేరి ఒంగోలు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ లండన్ నుంచి తిరిగొచ్చిన తరువాత మాగుంట ఆయనను కలిసి పార్టీలో చేరతారని వైసీపీలో చర్చ కూడా సాగుతోంది. కానీ, సుబ్బారెడ్డి స్పష్టత ఇవ్వడంతో ఆ ప్రచారానికి అడ్డుకట్ట పడింది.
   
మరోవైపు ప్రకాశం జిల్లాలో సుబ్బారెడ్డి నాయకత్వంలో వైసీపీ బాగా బలపడింది. అక్కడ తెలుగుదేశం పార్టీ ఇప్పటికే బలహీనపడగా.. పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో మరింతగా బలహీనపడుతోంది. త్వరలో ప్రకాశం టీడీపీ నుంచి వైసీపీలోకి భారీస్థాయిలో చేరికలు ఉంటాయని తెలుస్తోంది. ఈ ఉపద్రవాన్ని ఎదుర్కొనేందుకు చంద్రబాబు అన్ని ప్రయత్నాలూ చేసిచేసి ఇంక చేయడానికేమీ లేకపోవడంతో సుబ్బారెడ్డికి టిక్కెట్ రాదనేలా ఈ కొత్త ప్రచారం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మాగుంట వైసీపీలోకి వెళ్తారన్న ప్రచారం టీడీపీ వైపు నుంచే జరుగుతోందని ప్రకాశం జిల్లా రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.

Tags:    

Similar News