అవమానం మాజీ అయ్యాక చెబుతారా సెల్జా?

Update: 2015-12-01 03:53 GMT
ఎవరైనా సరే.. ఏదైనా అన్యాయం ఎదురైనా.. అవమానానికి గురైనా వెనువెంటనే గళం విప్పుతారు. అంతేకానీ.. ఏళ్లకు ఏళ్లు గడిచిన తర్వాత తీరిగ్గా తమకు జరిగిన అవమానం గురించి ప్రస్తావించరు. కానీ.. మాజీ కేంద్రమంత్రి సెల్జా వ్యవహారం కాస్తంత చిత్రంగా కనిపించక మానదు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రిగా వ్యవహరించిన ఆమె.. అప్పట్లో గుజరాత్ లోని ద్వారకా దేవాలయానికి వెళ్లారు.

ఈ సందర్భంగా ఆలయంలో పూజారి తన కులాన్ని అడిగినట్లుగా ఆరోపించారు. తాను దళితురాలినని.. తనకు అవమానం జరిగిందని ఆమె వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి అవమానం ఎదురైందని వ్యాఖ్యానించారు. నిజమే.. కేంద్రమంత్రి అయినా.. సామాన్యులైనా గుళ్లల్లో కులాన్ని అడగటం తప్పే. కానీ.. అప్పుడెప్పుడో కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అన్యాయాన్ని.. అవమానాన్ని పదవి పోయాక.. మాజీ అయ్యాక రాజ్యసభలో ప్రస్తావించి విమర్శలు చేయటం ఏమిటి?

సెల్జా కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ రాష్ట్రంలో మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒకవేళ.. తనకు తీరని అవమానమే జరిగి ఉంటే.. కేంద్రంలో ఉన్నది తమ సర్కారే అయినప్పుడు.. ఈ విషయాన్ని బయట పెడితే.. జరగాల్సింది జరిగేది. కానీ.. అప్పుడంతా మౌనంగా ఉన్న ఆమె.. ఇప్పుడు రాజ్యసభలో ప్రస్తావించటం.. దాన్ని మత అసహనం ఖాతాలోకి మళ్లించేందుకు కొన్ని వర్గాలు ప్రయత్నించటం చూసినప్పుడు కాస్తంత విస్మయం కలగక మానదు. కేంద్రమంత్రిగా పవర్ లో ఉన్నప్పుడు కామ్ గా ఉన్న సెల్జా.. ఇప్పుడు మాత్రం తనకు జరిగిన అవమానం గురించి ఆక్రోశించటంలో మర్మం ఏమిటో.. ఒక పట్టాన అర్థం కాదనే చెప్పాలి.
Tags:    

Similar News