హైదరాబాద్ లో దారుణం.. చంపేసి వాట్సప్ స్టేటస్ పెట్టుకున్న భర్త

భర్త రూపంలో ఉన్న ఉన్మాది.. భార్యపై అనుమానంతో దారుణంగా చంపేసిన ఉదంతం హైదరాబాద్ లోని బోరబండలో చోటు చేసుకుంది.;

Update: 2026-01-21 07:14 GMT

భర్త రూపంలో ఉన్న ఉన్మాది.. భార్యపై అనుమానంతో దారుణంగా చంపేసిన ఉదంతం హైదరాబాద్ లోని బోరబండలో చోటు చేసుకుంది. ఆపై తానే చేజేతులారా చంపేసుకున్నానని వాట్సప్ లో స్టేటస్ గా పెట్టుకున్న దుర్మార్గం షాకింగ్ గా మారింది. రోకలి బండతో బలంగా మోది.. ఆ చప్పుడుకు నిద్ర లేచిన పిల్లలతో అమ్మ పడుకుంది.. మీరు పడుకోండని చెప్పి.. ఇంట్లో నుంచి తాపీగా వెళ్లిపోయిన ఈ కసాయి ఉదంతం గురించి తెలిస్తే ఒళ్లు గగుర్పాటుకు గురి కావాల్సిందే.

హైదరాబాద్ లోని బోరబండ పోలీస్ స్టేషన్ పరిధి రాజీవ్ గాంధీ నగర్ లో చోటు చేసుకున్న ఈ దారుణ ఉదంతంలోకి వెళితే.. వనపర్తి జిల్లాలోని చింతకుంట గ్రామానికి చెందిన ఆంజనేయులు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ కు చెందిన సరస్వతిని 2013లో పెళ్లాడాడు. వీరికి పన్నెండేళ్ల కొడుకు.. తొమ్మిదేళ్ల కుమార్తె ఉన్నారు. ఆంజనేయులు కారు డ్రైవర్ గా.. సరస్వతి హైటెక్ సిటీలోని ఒక కంపెనీలో హౌస్ కీపింగ్ లో సూపర్ వైజర్ గా పని చేస్తున్నారు,

ఓవైపు ఆర్థిక సమస్యలు నెలకొని ఉండగా.. మరోవైపు భార్యను నిత్యం అనుమానించేవాడు. ఈ నేపథ్యంలో పని చేయటం మానేసి.. జులాయిగా తిరగటం మొదలు పెట్టాడు. భార్య ఎంత చెప్పినా ప్రయోజనం లేకపోయింది. డబ్బుల్లేకపోవటంతో పిల్లల్ని బడికి పంపటం మానేశారు. భర్త బుద్ది మారకపోవటంతో కలిసి ఉండలేనని చెప్పి.. ఇద్దరు పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. తాను మారానని.. మంచిగా ఉంటానని మాయమాటలు చెప్పి ఈ నెల పదిహేడున భార్యా.. పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చాడు.

జాబ్ కు వెళ్లి వచ్చిన సరస్వతి.. పిల్లలకు భోజనం పెట్టి పడుకుంది. అనంతరం ఇంటికి వచ్చిన ఆంజనేయులు.. నిద్రపోతున్న భార్య తలపై రోకలిబండతో పలుమార్లు బలంగా మోదటంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. చప్పుడుతో పాటు.. తలను రోకలిబండతో బలంగా మోదటంతో పక్కనే పడుకున్న పిల్లల దుస్తులన్నీ తల్లి రక్తంతో తడిచిపోయాయి. దీంతో వాళ్లు నిద్ర లేవటంతో.. అమ్మ పడుకుంది.. మీరు నిద్రపోండని చెప్పి బయటకు వెళ్లిపోయాడు. అనంతరం లైట్ వేసి చూసిన పిల్లలు తీవ్రమైన షాక్ కు గురయ్యారు.

వెంటనే దగ్గర్లో ఉన్న మేనమామకు ఫోన్ చేసి చెప్పారు. ఆయన అక్కడకు చేరుకొని డయల్ 100కు సమాచారం ఇవ్వటంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. భార్యను అత్యంత పాశవికంగా చంపేసిన నిందితుడు.. తన స్టేటస్ లో .. ‘‘నా జీవితంలో సగభాగమైన నిన్ను నా చేతులారా చంపుకున్నాను’’ అంటూ పెట్టుకోవటం గమనార్హం. గతంలో భార్య సరస్వతికి చెందిన ఒక సోదరుడిని కత్తితో గాయపర్చిన వైనంపై పోలీస్ కేసు ఉంది. భార్యను దారుణంగా చంపేసి.. స్టేటస్ పెట్టుకున్న నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Tags:    

Similar News