గ్రౌండ్ రిపోర్ట్‌: 'ప‌నులు' పంచుకుంటున్నారు..!

ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని ప‌లు మండ‌లాల్లో ప‌నులు జోరుగా సాగుతున్నాయి. పంచాయ‌తీ నిధుల నుంచి పెద్ద ఎత్తున ఇక్క‌డ ర‌హ‌దారుల నిర్మాణం స‌హా.. ఇతర ప‌నులు కూడా సాగుతున్నాయి.;

Update: 2026-03-10 02:45 GMT

ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని ప‌లు మండ‌లాల్లో ప‌నులు జోరుగా సాగుతున్నాయి. పంచాయ‌తీ నిధుల నుంచి పెద్ద ఎత్తున ఇక్క‌డ ర‌హ‌దారుల నిర్మాణం స‌హా.. ఇతర ప‌నులు కూడా సాగుతున్నాయి. ప‌ల్లెల్లో ప‌నుల సంద‌డి కూడా క‌నిపిస్తోంది. అటు కేంద్రం నుంచి వ‌చ్చిన నిధుల‌తోపాటు.. ఇటు రాష్ట్ర స‌ర్కారు కూడా కేటాయిస్తున్న‌నిధుల‌తో ప‌నులు చేప‌డుతున్నారు. దీంతో పిఠాపురం, రాజ‌మండ్రి రూర‌ల్‌, సిటీ స‌హా.. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప‌నులు జ‌రుగుతున్నాయి.

అయితే.. ఆయా ప‌నుల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని కూట‌మి పార్టీల‌కు ఆయా పార్టీల అధినేత‌లు పిలు పునిచ్చారు. దీనిని స‌మ‌న్వ‌యం చేసుకుని ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని చెప్పారు. దీంతో తొలి ఒక‌టి రెండు రోజులు నాయ‌కులు సంయుక్తంగా గ్రామీణ ప్రాంతాల్లో స‌మావేశాలు నిర్వ‌హించి.. ప్ర‌భుత్వం చేప‌డుతున్న ప‌నుల‌ను వివ‌రించారు. ఈ స‌మ‌యంలోనే వైసీపీ నేత‌లు చేసిన అక్ర‌మాలు, అన్యాయాల‌ను కూడా వివ‌రించారు. ఇది మంచి ఫ‌లిత‌మే ఇస్తున్న త‌రుణంలో అనూహ్యంగా వాతావ‌ర‌ణం మారిపోయింది.

ఇటీవ‌లి వ‌ర‌కు అసెంబ్లీ స‌మావేశాలు న‌డిచిన‌ నేప‌థ్యంలో ఎమ్మెల్యేలు స‌భ‌ల‌కు హాజ‌ర‌య్యారు. దీంతో క్షేత్ర‌స్థాయిలో వారి వారి అనుచ‌రులు భిన్న‌మైన రాజ‌కీయాలు చేశారు. `ప‌నులు పంచుకుంటూ`.. ఇది త‌మ వ‌ల్లే జ‌రిగింద‌ని.. త‌మ నాయ‌కుడు తెచ్చాడ‌ని ప్ర‌చారం చేశారు. ఇది కూడా మంచిదే అయినా.. సంయుక్తంగా ప్ర‌చారం చేసుకుంటే బాగుంటుంద‌న్న స్ఫూర్తిని వ‌దిలేస్తున్నారు. కేవ‌లం నాయ‌కుల‌ను మాత్ర‌మే ల‌క్ష్యంగా చేసుకుని ప్ర‌చారం చేస్తున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున గ్రౌండ్ లెవిల్లో ప్ర‌చారం జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం.

వాస్త‌వానికి ఏమేలు జ‌రిగినా.. అది కూట‌మి ప్ర‌భుత్వం చేసింద‌న్న వాద‌న‌ను ప్ర‌జ‌ల‌కు వినిపించాల‌న్నది సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చెబుతున్నారు. బీజేపీ ఈ విష‌యంలో సైలెంట్ అయిపోయింది. స‌రే.. ఈ రెండు పార్టీల ఎమ్మెల్యేల మ‌ధ్య పెద్ద‌గా వైరుధ్యం లేక‌పోయినా.. క్షేత్ర‌స్థాయిలో మాత్రం కార్య‌క‌ర్త‌లు రెండుగా చీలిపోయి.. ప్ర‌చారం చేస్తున్నారు. ఆయా ప‌నుల‌ను ఎవ‌రికి వారు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఇది తూర్పుగోదావ‌రి జిల్లాలో పెద్ద ఎత్తున టాక్ అయింది. ముఖ్యంగా సామాజిక వ‌ర్గాల వారిగా కూడా ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఇది స‌రికాద‌న్న‌ది సీనియ‌ర్లు చెబుతున్న మాట‌. ఎందుకంటే.. కూట‌మి బ‌లంగా ఉంద‌న్న సంకేతాలు ఇవ్వాల‌ని చెబుతున్న స‌మ‌యంలో ఇలా విడివిడి వ్య‌వ‌హారాలు న‌డ‌ప‌డాన్ని త‌ట‌స్థులు త‌ప్పుబ‌డుతున్నారు.

Tags:    

Similar News