బీజేపీ అధ్యక్షులకు ప్రధాని యోగం లేదా ?
ఇదిలా ఉంటే క బీజేపీలో 12 మంది అధ్యక్షుడు అయ్యారు. నితిన్ నబీన్ కొత్త ప్రెసిడెంట్ గా ఉన్నారు.;
సాధారణంగా ఏ పార్టీకైనా అధ్యక్షుడు సర్వ సత్తాక అధికారిగా ఉంటారు. ఆ పార్టీ కనుక అధికారంలోకి వస్తే అధ్యక్షుడే ప్రధాని లేదా ముఖ్యమంత్రి వంటి అధికారిక హోదాలోకి సహజంగానే వెళ్తారు. కాంగ్రెస్ లో చూసుకుంటే అధ్యక్షుడుగా గాంధీ వంశీకులే ఉంటారు. వారే ప్రధాని పదవిలోకి వస్తారు. ఇక ఏ ఇతర పార్టీలలో అయినా అధ్యక్షులే పవర్ ఫుల్ గా ఉంటారు. బీజేపీలో చూసుకుంటే దిగువ స్థాయి కార్యకర్త అధ్యక్షుడు అవుతున్నారు. అంత వరకూ బాగానే ఉంది, కానీ అధ్యక్షులుగా పనిచేసి పార్టీ మొత్తం మీద నియంత్రణ సాధించి ఆ పార్టీని విజయపధంలో నడిపించిన వారు అనంతర కాలంలో ప్రధాని వంటి కీలక పదవిలోకి వెళ్తున్నారా అంటే జవాబు లేదు అని వస్తోంది.
వాజ్ పేయి తప్ప :
ఇదిలా ఉంటే క బీజేపీలో 12 మంది అధ్యక్షుడు అయ్యారు. నితిన్ నబీన్ కొత్త ప్రెసిడెంట్ గా ఉన్నారు. వీరిలో వాజ్ పేయి తప్పించి ఎవరూ ప్రధాని యోగాన్ని అందుకోలేదు. బీజేపీలో కానీ అంతకు ముందు జన సంఘ్ లో కానీ అటల్ బిహారీ వాజ్ పేయి అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. ఆయన ఒక్కరు మాత్రం తరువాత కాలంలో ప్రధాని పదవిని నిర్వహించారు. 1998 నుంచి 2004 దాకా ఆరేళ్ళ పాటు వాజ్ పేయి దేశానికి ప్రధానిగా సేవలు అందించారు. ఇక ఆయన తరువాత ఎల్ కే అద్వానీ బీజేపీకి ఎన్నో సార్లు అధ్యక్షుడిగా పనిచేసి పార్టీ గ్రాఫ్ పెంచినా కూడా ఉప ప్రధాని దగ్గరే ఆగిపోయారు. ప్రధాని పీఠం ఆయనను వరించలేదు, ఇక సమర్ధ నేతలుగా గుర్తింపు పొందిన రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, వెంకయ్యనాయుడు, మురళీ మనోహర్ జోషీ వంటి వారు ప్రధాని పీఠానికి బహు దూరంగానే ఉన్నారు. కేంద్ర మంత్రుల హోదాతోనే వారు సరిపుచ్చుకున్నారు. వీరిలో వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టి పదవీ విరమణ చేశారు.
అధ్యక్షుడు కాకుండానే :
ఇక నరేంద్ర మోడీ విషయం తీసుకుంటే ఆయన బీజేపీకి అధ్యక్షుడిగా పని చేయలేదు, ఆయన బీజేపీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా మాత్రమే ఉన్నారు. ఆయన గుజరాత్ లో కూడా పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఎపుడూ చేపట్టింది లేదు, కానీ ఆయన ఏకంగా పుష్కర కాలంగా దేశానికి ప్రధానిగా కొనసాగుతూ వస్తున్నారు. ఒక విధంగా చూస్తే అధ్యక్ష పదవికీ ప్రధాని సీటుకూ ఏ మాత్రం సంబంధం లేదు అని చెప్పడానికి మోడీని ఒక ఉదాహరణగా చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు. మోడీ అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ఉన్నారు. వాగ్దాటితో పాటు పదునైన వ్యూహాలు అన్నీ కలసి ఆయనను శక్తివంతమైన నేతగా బీజేపీలో నిలబెట్టాయని అంటున్నారు. అందుకే ఆయన బీజేపీలో ప్రత్యేకంగానే ఉన్నారని అంటున్నారు. ఆయన బీజేపీలో అధ్యక్ష స్థానం మాత్రం ఎపుడూ కోరుకోలేదా లేదా ఆయనకు ఆ అవకాశం రాలేదా అన్నది తెలియదు కానీ ఏకంగా ప్రధాని పీఠమే ఆయనను వరించింది.
జన సంఘ్ లో సైతం :
ఇక జన సంఘ్ ని స్థాపించిన డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ తో సహా అనేక మంది నాయకులు అధ్యక్ష స్థానాన్ని అధిరోహించినా ఎవరూ అధికార కేంద్రాలకు దూరంగానే ఉంటూ వచ్చారు కానీ పదవులు అందుకోలేదు, మొత్తం మీద చూస్తే బీజేపీ తేడా గలిగిన పార్టీగా చెప్పుకుంటారు. అధ్యక్షులకు ప్రధాని యోగం పట్టకపోవడం కూడా ఒక తేడాగా ప్రత్యేకతగా చూడాల్సి ఉంటుందేమో అన్నది కూడా చర్చగా ఉంది.