జనాల్లోకి జగన్.. కానీ, పాదయాత్ర ఉండదు..!

ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉండటం వల్ల ఇప్పుడే పాదయాత్ర చేయడం, లేదా పాదయాత్ర చేసేంతవరకు ప్రజల్లోకి వెళ్లకుండా ఉండటం కరెక్టు కాదన్న ఆలోచనతో వైసీపీ అధినేత ఉన్నట్లు చెబుతున్నారు.;

Update: 2026-01-21 07:15 GMT

వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహనరెడ్డి పాదయాత్రపై కీలక నిర్ణయం తీసుకున్నారు. 2029 ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ప్రజల్లోకి వస్తానని, మళ్లీ పాదయాత్ర చేస్తానని గత ఏడాది జులైలో జగన్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ నిర్ణయాన్ని జగన్ వెనక్కి తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికలకు ముందు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర వల్లే అఖండ విజయం దక్కింది. అయితే ఈ సారి అదే పద్ధతిలో ప్రజల్లోకి వెళ్లే బదులు మరో రూపంలో పర్యటించాలని జగన్ నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉండటం వల్ల ఇప్పుడే పాదయాత్ర చేయడం, లేదా పాదయాత్ర చేసేంతవరకు ప్రజల్లోకి వెళ్లకుండా ఉండటం కరెక్టు కాదన్న ఆలోచనతో వైసీపీ అధినేత ఉన్నట్లు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం తమ వైసీపీ పాలనలో అమలు చేసిన సంక్షేమాన్ని అమలు చేయడం లేదని, ఈ విషయంలో ప్రజలు ప్రభుత్వంపై వ్యతిరేకత చూపుతున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రజల్లోకి వెళ్లడం వల్ల పార్టీ గ్రాఫ్ పెరుగుతుందని విశ్లేషిస్తున్నారు. అయితే ఇందుకోసం పాదయాత్ర చేయడం మూడేళ్ల పాటు సుదీర్ఘంగా ప్రజల్లో ఉండటం సాధ్యమయ్యే పని కాదని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

దీంతో జగన్ రెడ్డి కూడా తన ప్లాన్ మార్చుకున్నట్లు చెబుతున్నారు. పాదయాత్రకు బదులుగా బస్సు యాత్ర చేపట్టి రాష్ట్రం అంతా ఒకసారి చుట్టేయాలని మాజీ సీఎం ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఈ ఏడాది అంతా బస్సు యాత్ర ద్వారా రాష్ట్రంలో ప్రతి మారుమూల గ్రామానికి కూడా వెళ్లాలని జగన్ రెడ్డి భావిస్తున్నారని చెబుతున్నారు. ఇందుకోసం తగిన రూట్ మ్యాప్ రెడీ చేయాలని పార్టీ సహచరులకు మాజీ సీఎం సూచించినట్లు కథనాలు వస్తున్నాయి.

నిజానికి ఈ ఏడాది ప్రారంభంలోనే జగన్ రెడ్డి జిల్లాల పర్యటనలు ఉంటాయని వైసీపీ గతంలో ప్రకటించింది. అయితే అధినేత స్వయంగా పాదయాత్ర చేస్తానని ప్రకటించడంతో జిల్లాల పర్యటనకు బదులు పాదయాత్రే ఉంటుందని కార్యకర్తలు ఊహించారు. కానీ, ఇప్పుడు కొత్తగా బస్సు యాత్ర చేయాలనే ప్రతిపాదన తెరపైకి రావడం విస్తృత చర్చకు దారితీస్తోంది. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ రెడ్డి పెద్దగా జనాల్లోకి రాలేదని అంటున్నారు. ఆయన అప్పుడప్పుడు చేసిన పర్యటనల వల్ల పార్టీకి పెద్ద ఉపయోగం లేకపోయిందన్న విశ్లేషణలను కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు.

అదేసమయంలో జగన్ ఎక్కువ సమయం బెంగళూరులో గడపడం, తాడేపల్లి వచ్చినప్పుడు సుదీర్ఘ పత్రికా సమావేశాలు నిర్వహించడం వల్ల కూడా పార్టీకి ఎలాంటి ఉపయోగం ఉండటం లేదని వైసీపీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నట్లు చర్చ జరుగుతోంది. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 19 నెలలు కావడం వల్ల కొంత సమయం ఇవ్వాలన్న ధోరణితోనే జగన్ రెడ్డి జిల్లాల పర్యటనను వాయిదా వేస్తూ వస్తున్నారని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉండటం, స్థానిక ఎన్నికలు కూడా దగ్గరపడుతుండటం వల్ల జిల్లాల పర్యటనకు రెడీ అవ్వాలని అధినేత జగన్ డిసైడ్ అయినట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News