భారత్ 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'... ట్రంప్, చైనాలకు ఉమ్మడి దెబ్బ ఇలా..!
దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో భారత్ పాత్ర కీలకంగా మారుతుందనే చర్చ జరుగుతుంది.;
దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో భారత్ పాత్ర కీలకంగా మారుతుందనే చర్చ జరుగుతుంది. ఓ పక్క అంతులేని సుంకాలు, నియంతృత్వ పోకడలతో అన్నట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడుతున్న పరిస్థితి. మరోవైపు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని యూరోపియన్ యూనియన్ దేశాలు బలంగా భావిస్తున్న స్థితి.. ఈ నేపథ్యంలో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ కీలక ప్రతిపాదన తెరపైకి తెచ్చారు.
అవును... దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు యూరోపియన్ యూనియన్ కమ్యూనికేషన్ లో అత్యంత ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... భారతదేశంతో వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి వచ్చే వారాంతంలో భారతదేశానికి వెళ్తున్నట్లు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ తెలిపారు. 'మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్' గా చెప్పబడుతున్న ఈ వాణిజ్య ఒప్పందం ఇప్పటివరకు ఉన్నవాటిలో అతిపెద్దది అవుతుందని అన్నారు!
ఈ సందర్భంగా స్పందించిన ఉర్సులా... 'మనం ఒక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం అంచున ఉన్నాము.. కొందరు దీనిని 'మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్' అని పిలుస్తారు. ఇది 2 బిలియన్ల మార్కెట్ ను సృష్టిస్తుంది. ఇది ప్రపంచ జీడీపీలో దాదాపు పావు వంతు వాటాను కలిగి ఉంటుంది' అని అన్నారు. అదేవిధంగా... ఇది రెండు ఆర్థిక వ్యవస్థలకు గడిన చాలా సంవత్సరాలలో అత్యంత పర్యవసానమైన వాణిజ్య పురోగతిలో ఒకటిగా మారవచ్చని తెలిపారు!
ఈ ఒప్పందం ఇటు భారత్ కు అటు ఈయూకు అతి ముఖ్యమైనదని చెప్పొచ్చు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకదానిని (భారత్).. ప్రపంచ వాణిజ్యానికి కేంద్ర స్తంభంగా మిగిలి ఉన్న ఒక కూటమి (యూరోపియన్ యూనియన్)తో అనుసంధానించడం ద్వారా ఇది ప్రభుత్వాల మధ్య ఒప్పందం సప్లై చైన్ ప్రవాహాలను పునర్నిర్మిస్తుందని.. ఈయూకి చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడంలో భారత్ పాత్రను కీలకంగా మారుస్తుందని అంటున్నారు.
వాస్తవానికి.. భారత్ - ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం 2007 నుండి కొనసాగుతున్నప్పటికీ.. చర్చలు మాత్రం దాదాపు ఒక దశాబ్దం పాటు నిలిచిపోయాయి. ఆ తర్వాత 2022లో పునరుద్ధరించబడ్డాయి. అప్పటి నుండి భారత్ - ఈయూ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ తో కలిసి చర్చలు ముందుకు సాగాయి. ఈ నేపథ్యంలో అన్నీ అనుకూలంగా జరిగితే మరికొన్ని రోజుల్లో అటు ట్రంప్, ఇటు చైనాలకు ఒకేసారి షాకిచ్చే స్థాయిలో అన్నట్లుగా... 'మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్' సెట్ అవుతుంది!
ఈ ఒప్పందంపై సంతకం చేస్తే భారతదేశం తన వస్త్ర పరిశ్రమను అభివృద్ధి చేసుకోవడానికి.. చైనా ఆధిపత్య వస్త్ర పరిశ్రమతో పోటీ పడటానికి వీలు కల్పిస్తుందని చెబుతున్నారు. అదే సమయంలో యూరోపియన్ కంపెనీలు భారతదేశంలో సులభంగా పనిచేయడానికి వీలు కల్పిస్తుంది. అంటే ఈయూ నుండి భారతదేశానికి ఆటోమొబైల్స్, వైన్లు, స్పిరిట్, ఆహార ఎగుమతులకు సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అదేవిధంగా... భారతదేశం నైపుణ్యం కలిగిన నిపుణుల తరలింపుకు మరింత అనుకూలమైన పరిస్థితులు నెలకొంటాయని అంటున్నారు.