నెతన్యాహు బతికే ఉన్నాడు.. అసలు ఈ గ్యాప్ లో ఏం జరిగింది? వైరల్ వీడియో..

ఇటీవల మరో వివాదం కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. నెతన్యాహు వారం కింద విడుదల చేసిన వీడియో అసలైనది కాదని, అది ఏఐతో రూపొందించినదని కొందరు నెటిజన్లు ఆరోపించారు.;

Update: 2026-03-16 07:48 GMT

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చనిపోయారనే పుకార్లు అంతర్జాతీయంగా సంచలనం సృష్టించాయి. అయితే ఈ వదంతులకు స్వయంగా నెతన్యాహు ముగింపు పలికారు. జెరూసలేం శివార్లలోని ఓ చిన్న కేఫ్‌లో కాఫీ తాగుతూ కనిపించిన వీడియోను విడుదల చేస్తూ తాను బతికే ఉన్నానని ప్రపంచానికి స్పష్టంగా తెలిపారు.

ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య గత మూడు వారాలుగా తీవ్రమైన యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఇరు దేశాలు పరస్పరం క్షిపణి దాడులు చేసుకుంటూ ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గత కొన్ని రోజులుగా బహిరంగంగా ఎక్కడా కనిపించకపోవడం అనేక అనుమానాలకు దారి తీసింది. దీనిని ఆసరాగా చేసుకున్న ఇరాన్‌కు అనుకూలమైన సోషల్ మీడియా వర్గాలు నెతన్యాహు ఇరాన్ దాడుల్లో మరణించారని ప్రచారం మొదలుపెట్టాయి.

యుద్ధం 17వ రోజుకు చేరినా ప్రధాని బయటకు రాకపోవడంతో ఇజ్రాయెల్ ప్రజల్లో కూడా ఆందోళన మొదలైంది. అంతర్జాతీయ వర్గాల్లోనూ ఆయన భద్రతపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇదే సమయంలో ఈ పుకార్లకు చెక్ పెడుతూ నెతన్యాహు స్వయంగా వీడియో విడుదల చేయడం పెద్ద చర్చకు దారి తీసింది.

జెరూసలేం పరిసర ప్రాంతంలోని ఒక కేఫ్‌లో కాఫీ కప్పుతో కనిపించిన నెతన్యాహు తన మరణంపై వచ్చిన వార్తలను చమత్కారంగా తిప్పికొట్టారు. హీబ్రూ స్లాంగ్‌లో మాట్లాడుతూ “నేను చనిపోలేదు… కానీ కాఫీ అంటే నాకు ప్రాణం. కాఫీ కోసం చనిపోతా అనడమే తప్ప” అని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇటీవల మరో వివాదం కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. నెతన్యాహు వారం కింద విడుదల చేసిన వీడియో అసలైనది కాదని, అది ఏఐతో రూపొందించినదని కొందరు నెటిజన్లు ఆరోపించారు. ఆ వీడియోలో ఆయన చేతికి ఆరు వేళ్లు కనిపిస్తున్నాయంటూ స్క్రీన్‌షాట్లు కూడా షేర్ చేశారు. ఈ ఆరోపణలపై కూడా నెతన్యాహు నేరుగా స్పందించారు. కెమెరా ముందు తన రెండు చేతులను పైకెత్తి చూపిస్తూ “నా వేళ్లను లెక్కించాలనుకుంటున్నారా? ఇదిగోండి… లెక్కించుకోండి” అంటూ ఎద్దేవా చేశారు.

అదే సమయంలో యుద్ధ పరిస్థితులపై కూడా ఆయన కీలక సందేశం ఇచ్చారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ “బయటకు వెళ్లి స్వచ్ఛమైన గాలి పీల్చుకోండి. కానీ జాగ్రత్తగా ఉండండి. మీ మద్దతు నాకు, మా సైన్యానికి, మొసాద్‌కు ఎంతో బలం ఇస్తుంది. మేము ఇరాన్‌ను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాం” అని ధీమా వ్యక్తం చేశారు.

ఇటీవల ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన తరువాత ప్రతీకార దాడులతో ఇరాన్ మరింత దూకుడు చూపుతున్న నేపథ్యంలో నెతన్యాహు విడుదల చేసిన ఈ వీడియో ఇజ్రాయెల్ ప్రజల్లో ధైర్యాన్ని నింపింది. ఆయన మరణంపై వ్యాపించిన పుకార్లకు కూడా ఈ వీడియోతో తెరపడినట్లైంది.

అయితే మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మాత్రం తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇరాన్ అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తుండగా ప్రపంచ దేశాలు ఈ పరిస్థితిని ఆందోళనతో గమనిస్తున్నాయి. ఒకవైపు క్షిపణి దాడులు, మరోవైపు సోషల్ మీడియాలో ఏఐ పుకార్లు ఈ రెండు మధ్య ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కేఫ్‌లో కనిపించడం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది.

Full View
Tags:    

Similar News