తైవాన్ పై తాడోపేడో..! ద్వీపాన్ని చుట్టుముట్టిన‌ చైనా!

ఇది చాల‌ద‌న్న‌ట్లు మిస్సైళ్ల ప్ర‌యోగంతో ఉత్త‌ర కొరియా దూకుడు.. అదీ స‌రిపోద‌న్న‌ట్లు తైవాన్ ను భ‌య‌పెడుతోంది చైనా. అస‌లు ఆ ద్వీపం జోళికెళ్తే తోక తొక్కిన తాచుపాములా లేస్తుంది డ్రాగ‌న్..! వ‌న్ చైనాలో భాగం అంటుంది.;

Update: 2026-03-16 10:30 GMT

ఓవైపు ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. మ‌రోవైపు ఇజ్రాయెల్-హ‌మాస్ యుద్ధం.. ఇంకోవైపు ఇజ్రాయెల్-అమెరికా వ‌ర్సెస్ ఇరాన్... ఇది చాల‌ద‌న్న‌ట్లు మిస్సైళ్ల ప్ర‌యోగంతో ఉత్త‌ర కొరియా దూకుడు.. అదీ స‌రిపోద‌న్న‌ట్లు తైవాన్ ను భ‌య‌పెడుతోంది చైనా. అస‌లు ఆ ద్వీపం జోళికెళ్తే తోక తొక్కిన తాచుపాములా లేస్తుంది డ్రాగ‌న్..! వ‌న్ చైనాలో భాగం అంటుంది. మ‌రి ఎందుక‌నో కానీ, కొన్నాళ్లుగా తైవాన్ విష‌యంలో చైనా కామ్ గా ఉంది. తాజాగా మాత్రం ఒక్క‌సారిగా జూలు విదిల్చింది. ప్ర‌పంచ ప‌రిణామాల కార‌ణంగానే ఏమో కానీ.. తైవాన్ మాది అని చాటి చెప్పేలా చేసింది. దాదాపు మూడేళ్ల కింద‌ట చైనా.. తైవాన్ ను దాదాపు క‌బ‌ళించినంత ప‌నిచేసింది. అంత‌కుమందు అమెరికా ప్ర‌తినిధుల స‌భ స్పీక‌ర్ నాన్సీ పెలోసీ తైవాన్ లో ప‌ర్య‌టించ‌డాన్ని చాలా సీరియ‌స్ గా తీసుకుంది. ఆ త‌ర్వాత తైవాన్ లో త‌మ వ్య‌తిరేకి సార‌థ్యంలో కొత్త ప్ర‌భుత్వం ఏర్పాట‌వ‌డం డ్రాగ‌న్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

ఎక్క‌డుందీ తైవాన్‌..?

తైవాన్ ఒక ద్వీపం. త‌మ దేశానికి స‌మీపంలో ఉండే దీనిని త‌మ‌దే అంటుంది చైనా. కానీ, త‌మ‌కు స్వ‌తంత్ర‌త ఉంద‌ని అంటుంది తైవాన్. ఈ ద్వీపం గురించి ఎవ‌రైనా మాట్లాడితే స‌హించేది లేద‌ని హెచ్చ‌రిస్తుంటుంది. అయితే, తైవాన్ కు అమెరికా పూర్తి మ‌ద్ద‌తు ఉంది. అందుకే, ఏమాత్రం తేడా వ‌చ్చినా తైవాన్ ను క‌లిపేసుకుంటాం అని చైనా హెచ్చ‌రిస్తుంటుంది.

అక్క‌డ నిత్యం విమానాల‌ మోత‌నే...

తైవాన్ ను త‌ర‌చూ భ‌య‌ప‌పెట్ట‌డం చైనాకు అల‌వాటు. గ‌తంలో ఆ ద్వీపం చుట్టూ అనేక‌సార్లు యుద్ధ విన్యాసాలు కూడా చేసింది. తాజాగా తైవాన్ ఎయిర్ స్పేస్ లోకి యుద్ధ విమానాల‌ను పంపింది. ఇరాన్ యుద్ధం ప్రారంభానికి ముందు తైవాన్ విష‌యంలో చ‌ప్పిడి చేయ‌ని చైనా.. అక‌స్మాత్తుగా తాజా చ‌ర్య‌కు దిగ‌డం గ‌మ‌నార్హం. దీనికి కార‌ణం ఏమిటా? అని ర‌క్ష‌ణ రంగ నిపుణులు విశ్లేష‌ణ చేస్తున్నారు. శ‌నివారం 26 చైనా యుద్ధ విమానాలు త‌మ ద్వీపం చుట్టూ చ‌క్క‌ర్లు కొట్టిన‌ట్లు తైవాన్ ర‌క్ష‌ణ మంత్రి వెల్లింగ్ట‌న్ కూ చెప్పారు. జ‌ల‌సంధిలో ఏడు నౌక‌లనూ గుర్తించామ‌న్నారు.

చుట్టుముట్టిన‌ట్లేనా?

తైవాన్ ను చైనా చుట్టుముట్టింద‌నే క‌థ‌నాలు వ‌స్తున్నాయి. సంద‌ట్లో స‌డేమియాలాగా ఈ ద్వీపాన్ని క‌లిసేకుంటుందా? అనే ప్ర‌శ్న‌లు కూడా వ‌స్తున్నాయి. ఎందుకంటే, ఇరాన్ తో యుద్ధంలో త‌ల‌మున‌క‌లైన అమెరికా.. తైవాన్ విష‌యంలో జోక్యం చేసుకోదు. ర‌ష్యా మ‌ద్ద‌తు ఎలాగూ చైనాకే. కాబ‌ట్టి, త‌న విష‌యంలో ఎవ‌రూ వేలు పెట్ట‌ర‌ని డ్రాగ‌న్ అంచ‌నా వేస్తుందా? అనే అనుమానాలు వ‌స్తున్నాయి.

Tags:    

Similar News