ఇరాన్ మళ్లీ భీకర దాడి.. దుబాయ్ ఎయిర్ పోర్ట్ మూసివేత.. విమానాలన్నీ రిటర్న్

సంఘటనా స్థలికి చేరుకున్న దుబాయ్ సివిల్ డిఫెన్స్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు.;

Update: 2026-03-16 08:14 GMT

పశ్చిమాసియాలో ఇప్పటికే నెలకొన్న అశాంతి, యుద్ధ వాతావరణం తాజాగా మరింత ముదిరింది. సోమవారం తెల్లవారుజామున ఇరాన్ జరిపిన డ్రోన్ దాడులు, ప్రపంచ పర్యాటక, వాణిజ్య కేంద్రమైన దుబాయ్‌ను కుదిపేసాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా జరిగిన ఈ దాడి అంతర్జాతీయ విమానయాన రంగాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.

మీడిా సమాచారం మేరకు.. సోమవారం వేకువజామున గుర్తు తెలియని డ్రోన్లు దుబాయ్ విమానాశ్రయ పరిధిలోకి ప్రవేశించాయి. వీటిలో ఒక డ్రోన్, విమానాశ్రయానికి అత్యంత సమీపంలో ఉన్న కీలకమైన ఇంధన నిల్వ ట్యాంకును బలంగా ఢీకొట్టింది. దీని ఫలితంగా భారీ పేలుడు సంభవించి, మంటలు ఎగసిపడ్డాయి. మంటల తీవ్రత ఆకాశాన్ని తాకేలా ఉండటంతో భద్రతా కారణాల దృష్ట్యా దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ వెంటనే అప్రమత్తమైంది. విమానాశ్రయంలో విమానాల రాకపోకలను తక్షణమే నిలిపివేసి, విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

సహాయక చర్యలు.. భద్రతా వలయం

సంఘటనా స్థలికి చేరుకున్న దుబాయ్ సివిల్ డిఫెన్స్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇంధన ట్యాంక్ కావడంతో మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విమానాశ్రయం పరిసరాల్లో అదనపు భద్రతా బలగాలను మోహరించి.. అత్యున్నత స్థాయి నిఘాను ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు.

ప్రయాణికులపై తీవ్ర ప్రభావం

ఈ ఘటన వేలాది మంది ప్రయాణికుల ప్రయాణ ప్రణాళికలను తలకిందులు చేసింది. దుబాయ్ మీదుగా ప్రయాణించే అనేక అంతర్జాతీయ విమానాలను దారి మళ్లించారు. ముఖ్యంగా 'దుబాయ్ అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి' అత్యధిక విమానాలను మళ్లించగా మరికొన్ని విమానాలను పొరుగు దేశాల ఎయిర్‌పోర్టులకు పంపినట్లు తెలుస్తోంది. ఈ గందరగోళంలో భారత్ నుండి వెళ్లిన విమానాలు కూడా చిక్కుకున్నాయి. కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం నుండి దుబాయ్‌కు బయలుదేరిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం, గగనతలంలో ఉండగానే ఈ విషాదకర వార్త తెలియడంతో తిరిగి కొచ్చికి మళ్లించబడింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని విమానయాన సంస్థలు వివరణ ఇచ్చాయి.

ప్రపంచవ్యాప్త ఆందోళన

దుబాయ్ వంటి అంతర్జాతీయ కీలక రవాణా కేంద్రంపై దాడి జరగడం అనేది కేవలం ఒక ప్రాంతీయ ఘర్షణ మాత్రమే కాదు.. ఇది ప్రపంచ భద్రతకు, ఆర్థిక వ్యవస్థకు ప్రమాద హెచ్చరిక అని విశ్లేషకులు భావిస్తున్నారు. పశ్చిమాసియాలో ఇరాన్ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో గ్లోబల్ మార్కెట్లు కూడా అస్థిరతకు గురవుతున్నాయి. రానున్న గంటల్లో పరిస్థితి ఎలా మారుతుందనే దానిపై ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. అధికారులు నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నారని ప్రయాణికులు తమ విమానయాన సంస్థల నుండి వచ్చే అధికారిక అప్‌డేట్స్‌ను గమనించాలని కోరుతున్నారు.

Tags:    

Similar News