డెలివరీ బాయ్ గా మారిన టీడీపీ ఎమ్మెల్యే.. స్పష్టమైన కారణం ఇదే!

ఎన్నికల సమయంలో దాదాపు చాలా మంది నేతలు చేసే పనులు, చెప్పే ఊకదంపుడు కబుర్ల గురించి తెలిసిందే.;

Update: 2026-01-21 06:44 GMT

ఎన్నికల సమయంలో దాదాపు చాలా మంది నేతలు చేసే పనులు, చెప్పే ఊకదంపుడు కబుర్ల గురించి తెలిసిందే. ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపిస్తూ.. తాను మీలో ఒకడినని చెప్పుకు తిరుగుతారు.. అనంతర తుపాకీ దెబ్బకు కూడా దొరకని స్థాయిలో నల్లపూస అయిపోతారు.. వారి అపాయింట్మెంట్ కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. ఈ క్రమంలో ఓ టీడీపీ ఎమ్మెల్యే మాత్రం ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి.. కొత్త అవతారం ఎత్తారు!

అవును... ఎన్నికల వరకూ ప్రజలను ఓడ మల్లన్న అంటూ పిలిచి.. ఫలితాల అనంతరం ఓడి మల్లన్న అని పిలిచే నేతలు పుష్కలంగా ఉన్న ఈ రోజుల్లో ఓ టీడీపీ ఎమ్మెల్యే చేసిన పని ప్రశంసలు అందుకుంటుంది. ఇందులో భాగంగా... ఏపీలో టీడీపీ ఎమ్మెల్యే డెలివరీ బాయ్‌ గా మారారు.. ఈ క్రమంలో కొన్ని ఇళ్లకు వెళ్లి ఆర్డర్లు డెలివరీ ఇచ్చారు.. దీనికి సబంధించి కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కొన్ని రోజులుగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్.. కానూరు, పోరంకి, యనమలకుదురు ప్రాంతాల్లో డెలివరీ బాయ్‌ గా సేవలందించారని చెబుతున్నారు. ఈ క్రమంలో... డెలివరీ బాయ్స్ యునిఫాం ధరించి మరీ ఆయన స్వయంగా వెళ్లి డెలివరీ పార్సిళ్లు అందించారు. దీంతో.. వాటిని అందుకున్నవారు ఎమ్మెల్యేను చూసి అవాక్కయ్యారు. ఈ సందర్భంగా స్పందించిన ఎమ్మెల్యే... ఈ అనుభవం ద్వారా డెలివరీ బాయ్స్ ఎదుర్కొనే కష్టాలను, పని ఒత్తిడిని తాను అర్థం చేసుకున్నానని తెలిపారు.

ఈ సందర్భంగా ప్రజలు డెలివరీ బాయ్స్ కి తగిన గౌరవం ఇవ్వాలని సూచించారు. ఈ క్రమంలో... ఎండ, వాన, చలి, ట్రాఫిక్ వంటి అడ్డంకులను లెక్కచేయకుండా వారు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా అనుభవించి, వారి సమస్యలను అర్థం చేసుకున్నట్లు తెలిపారు. కాగా... ఇటీవల గిగ్ వర్కర్స్ 10 నిమిషాల డెలివరీ వ్యవహారంపై పెద్ద రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. ఆ టెన్ మినిట్స్ టెన్షన్ వద్దంటూ ఏకంగా సుప్రీంకోర్టు చెప్పడంతో వ్యవహారం ముగిసింది!




Tags:    

Similar News