చలో దావోస్...దూరం కొండల మోజేనా ?

దావోస్ కి వెళ్ళడం ఇటీవల కాలంలో ఎక్కువ అయింది. దేశంలో ఒకరిని చూసి మరొకరు ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు దావోస్ టూర్లు చేస్తున్నారు.;

Update: 2026-01-21 07:24 GMT

దావోస్ కి వెళ్ళడం ఇటీవల కాలంలో ఎక్కువ అయింది. దేశంలో ఒకరిని చూసి మరొకరు ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు దావోస్ టూర్లు చేస్తున్నారు. ఏకంగా వారం పది రోజుల షెడ్యూల్ తో ఇది సాగుతోంది. దీని వల్ల ఎన్నో అధికారిక కార్యక్రమాలు నిలిచిపోతున్నాయి. పాలన ఆగుతోంది. ప్రజా ధనం వృధా అవుతోంది. తీరా చూస్తే పెట్టుబడులు ఆశించిన స్థాయిలో అయితే రావడం లేదు అన్న విమర్శలు ఉన్నాయి. ఇంతకీ దావోస్ దాకా ఎందుకు అన్న కొత్త చర్చ అయితే మొదలైంది. రాజ్యసభ ఎంపీ అయిన రాజీవ్ శుక్లా అయితే దావోస్ టూర్ల మీద పెదవి విరిచారు, కుండబద్దలు కొట్టారు.

అక్కడ కూడా మనవారితోనే :

ఎంతో కష్టపడి దావోస్ టూర్ చేస్తున్న ముఖ్యమంత్రులు అక్కడ భారతీయ పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఏ విదేశీ సంస్థలతో మాత్రం ఒప్పందాలు పెద్దగా కుదరడం లేదు, వారిని ఆకట్టుకోలేకపోతున్నారా లేక వారే దూరం జరుగుతున్నారా అన్నది పెద్ద చర్చగా ఉంది. దీని మీద రాజీవ్ శుక్లా ఎక్స్ వేదికగా తనదైన శైలిలో విమర్శలు అయితే సంధించారు. స్విట్జర్లాండ్‌ లోని దావోస్ వేదికగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కి ఇండియా నుంచి ఫ్లైట్స్ వేసుకుని వెళ్ళడం దండుగ మారి వ్యవహారమే అని ఆయన తేల్చేస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రజా ధానం కూడా వేస్ట్ అవుతోంది అని అసహనం వ్యక్తం చేశారు.

వేల కిలోమీటర్లు కొలుస్తూ :

నిజానికి దావోస్ పర్యటన కోసం వేల కిలోమీటర్లు గగన తలంలో కొలుస్తూ వెళ్తున్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు భారత్ నుంచి కేంద్ర మంత్రులు అలాగే, వివిధ రాష్ట్రాలకు చెందిన రాష్ట్ర మంత్రులతో పాటు ముఖ్యమంత్రులు సైతం అనేకమంది వెళ్తున్నారు. దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫారం లో పాల్గొనేందుకు వెళ్తున్నారు అని అంటున్నారు కానీ వీరంతా వెళ్ళి అక్కడ కలిసేది భారతీయ పారిశ్రామికవేత్తలనే అని ఆయన విమర్శించారు. ఇలా భారత్ కు చెందిన కీలక నేతలు అంతా చేసే ఈ పర్యటనల వల్ల ప్రజా ధనాన్ని పెద్ద ఎత్తున వృధా చేస్తున్నారు అని నిందించారు. భారతీయ నేతలు దావోస్‌కు వెళ్లి అక్కడ మళ్ళీ భారతీయులనే కలుస్తున్నారని లాజిక్ పాయింట్ నే లేవనెత్తారు అంత దూరం వెళ్ళి మరీ దేశీయ కంపెనీలతోనే ఒప్పందాలు చేసుకోవడం తమాషాగా ఉందని ఆయన కామెంట్స్ చెశారు.

ఇండియాలో సరిపోదా :

ఈ మాత్రం ఒప్పందాలకు ఇండియా సరిపోదా అని ఆయన అంటున్నారు. మన పారిశ్రామిక వేత్తలతో మన దగ్గరే ఒప్పందాలు కుదుర్చుకుంటే ఖర్చు తక్కువ ఫలితం ఎక్కువగా ఉంటుంది కదా అని ఆయన అంటున్నారు. దావోస్ దాకా వెళ్ళిన వారు విదేశీ కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకుంటే మేలు కానీ అది ఏ మాత్రం జరగడం లేదని విమర్శించారు. ఈ తీరున సాగుతున్న దావోస్ టూర్ చూస్తూంటే అక్కడ జరిగేది వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ గా లేదని ఇండియా ఎకనామిక్ ఫోరమ్ మాదిరిగానే రాజీవ్ శుక్లా ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు.

ఇంత మంది ఎందుకు :

ఇక దేశానికి చెందిన ఏడుగురు ముఖ్యమంత్రులు అక్కడికి వెళ్లి కేవలం ప్రదర్శన మాత్రమే చేస్తున్నారు అని రాజివ్ శుక్లా మండిపడ్డారు. దావోస్ టూర్ అన్నది ఒక స్టేటస్ సింబల్‌గా మారిందని ఆయన ఫైర్ అయ్యారు. విదేశీ పెట్టుబడులు ఆకర్షించకుండా చేసే ఈ టూర్లు దండుగ మారివని ఆయన కొట్టిపారేశారు. దేశీయ సంస్థలతో ఒప్పందాలు కోసం అంత దూరం వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు, ప్రజా ధనం ఇలా వృధా చేయడం బాధా కరం అని ఆయన అన్నరు. మొత్తానికి రాజీవ్ శుక్లా చేసిన ఈ వ్యాఖ్యలు అయితే చర్చకు తావిస్తున్నాయి. దావోస్ టూర్ అన్నది ఒక మోజుగా మారుతోందా అన్నది కూడా డిస్కషన్ గా ఉంది. ఎందుకంటే ఒప్పందాలు పెద్దగా కుదరడం లేదని అంటున్నారు. కుదిరినా ఆ తరువాత ఫాలో అప్ ఉండడం లేదు, మరి ఎందుకీ టూర్లు దండుగమారివి అన్న విమర్శలు అయితే ఉన్నాయి.

Tags:    

Similar News