పార్లమెంటు కొత్తభవన నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ....

Update: 2019-10-26 09:02 GMT
దేశ రాజధాని ఢిల్లీ వెళ్లిన ప్రతి ఒక్కరూ ఎర్రకోట - కుతుబ్ మినార్  - పార్లమెంటు లని ఎలాగైనా చూడాలని అనుకుంటారు.బ్రిటీషు కాలంలో నిర్మితమైన ఆ పార్లమెంటు భవనంలో ఎన్నో కీలక చట్టాలు చేశారు. ఎన్నో శాసనాలు లిఖించారు. పార్లమెంటు  భవనం అందాలను చూసేందుకు ఎక్కడెక్కడినుండో పర్యాటకులు వస్తుంటారు. ఢిల్లీలోని  ల్యూటెన్స్ కి వెళ్లిన ప్రతి ఒక్కరూ పార్లమెంటు వద్ద ఒక్క ఫోటో అయినా దిగాల్సిందే. అంతటి ఘనమైన చరిత్ర ఉన్న  పార్లమెంటు భవనంలో కొన్ని మార్పులు చేర్పులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్  ఇచ్చింది. 

ప్రస్తుతం ఉన్న పార్లమెంటు భవనాన్ని కూల్చకుండానే అందులో మార్పులు చేయబోతుంది. దీనికోసం గుజరాత్‌ కు చెందిన హెచ్‌ సీపీ డిజైన్ - ప్లానింగ్ మరియు మేనేజ్‌ మెంట్ కంపెనీకి బాధ్యతలు అప్పగించింది. పార్లమెంటు భవనం బాహ్య ముందు భాగంలో  ఎలాంటి మార్పులు చేయకుండా  - కేవలం లోపలి డిజైన్‌ ను మాత్రమే మార్చబోతున్నారు. ప్రస్తుతం ఎంపీలు కూర్చునేందుకు పార్లమెంటు లో కావాల్సినంత  చోటు లేకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర గృహనిర్మాణ పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు.

ఇక డిజైన్ కోసం హెచ్‌ సీపీ సంస్థకు రూ.229.75 కోట్లు కేంద్రం చెల్లించనుంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.12,450 కోట్లు కానుండగా అందులో 3శాతం కన్సల్టేషన్ ఫీజు కింద హెచ్‌సీపీ సంస్థకు చెల్లిస్తున్నట్లు మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. హెచ్‌ సీపీ సంస్థకు ఇప్పటికే ఎన్నో భారీ ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత ఉంది. కొత్త పార్లమెంటు భవనం 2022 కల్లా పూర్తవుతుందని చెప్పిన మంత్రి... 2024 నాటికీ కొత్త  సెక్రటేరియట్ నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు.ఇక ఈ నిర్మాణాలన్నీ భూకంపం సంభవించిన తట్టుకునేలా ఉంటాయని అత్యాధునిక సాంకేతికతతో నిర్మాణం చేపడుతామని మంత్రి వెల్లడించారు. 200 ఏళ్ల వరకు స్టాండర్డ్‌ గా ఉండాలన్న తపనతో పార్లమెంటు భవనం - సచివాలయం నిర్మాణాలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. పార్లమెంటు లోపల కూడా ఇంటీరియర్స్‌ ను మాత్రమే మార్చబోతున్నట్టు తెలిపారు.
Tags:    

Similar News