కరెక్ట్ టైమ్ లో గుడివాడను కెలుకుతున్నారే...?

Update: 2022-04-09 03:30 GMT
ఆయన విశాఖ జిల్లాకు చెందిన యువ ఎమ్మెల్యే. అనకాపల్లి జిల్లా కేంద్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు మంత్రి పదవి ఖాయమైందని అంటున్నారు. మరో వైపు మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు నుంచి టఫ్ ఫైట్ ఉన్నా సామాజిక సమీకరణలు గుడివాడకే ఓటేసాయని తెలుస్తోంది. బలమైన తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన గుడివాడ జగన్ కి అత్యంత ఆప్తుడు. దాంతో ఆయనకు సీటు కన్ ఫర్మ్ అయిందని చెబుతున్నారు.

అయితే ఆయనకు పదవి రావడం పట్ల సొంత పార్టీలోనే కొంత అసమ్మతి ఉంది. అనకాపల్లి జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రికి ఆయనకు విభేధాలు ఉన్నాయని బాహాటంగానే ప్రచారంలో ఉన్న విషయం. అలాగే ఇదే పదవిని అదే సామాజికవర్గానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఒకరు ఆశిస్తున్నారు. ఈ నేపధ్యంలో గుడివాడకు వ్యతిరేకంగా కొందరు పావులు కదుపుతున్నారని తెలుస్తోంది.

ఏకంగా ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి నియోజకవర్గంలోని అనకాపల్లి మండలం మాకవరం గ్రామంలో 8.66 హెక్టార్ల క్వారీని పలుకుబడి ఉపయోగించి వైసీపీ పెద్దలు దక్కించుకున్నారని, దాని వెనక గుడివాడకు సన్నిహితుడు అయిన నాయకుడు  ఒకరు ఉన్నారని వార్తా కధనాలు బయటకు వస్తున్నాయి. ఈ క్వారీని అస్మదీయులకు  అప్పగించడం వెనక కూడా పెద్ద తతంగం నడించిందని కూడా చెబుతున్నారు.

ఇందులో నిజానిజాలు ఎంత ఉన్నాయన్నది తెలియదు కానీ గత ఏడాదిలో జరిగిన ఈ వ్యవహారం ఇపుడు హఠాత్తుగా బయటకు రావడం వెనక గుడివాడ వ్యతిరేకుల హస్తం ఉందని అనుమానిస్తున్నారు. వారే తమ నేతకు పదవి దక్కకూడదని సరైన టైమ్ లో ఈ వ్యవహారాన్ని బయటకు తీశారని అంటున్నారు. అది ఇదంతా ఒక పద్ధతి ప్రకారమే జరిగిందని, ఇందులో ఎటు చూసినా ఎమ్మెల్యే ప్రమేయం ఎక్కడా లేదని అంటున్నారు.

మొత్తానికి చూస్తే గుడివాడకు చేతిలో పదవి ప్రసాదం ఉంది. అది నోటికి అందేలోగా మధ్యలో ఈ వ్యతిరేక ప్రచారం సాగుతోందని వాపోతున్నారు. మరి దీని మీద వైసీపీ అధినాయకత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఒకవేళ ఏమైనా నిజాలు ఉన్నట్లుగా నమ్మితే మాత్రం యువ ఎమ్మెల్యే జాతకం తారు మారు అవుతుందని అంటున్నారు. సో చూడాలి మరి.
Tags:    

Similar News