మనీ లాండరింగ్ కేసులో కస్టడీకి మాజీ హోంమంత్రి

Update: 2021-11-16 01:30 GMT
మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ చిక్కుల్లో పడ్డారు. ఆయనను రెండు వారాల పాటు జ్యూడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు సంచలన ఉత్తర్వులు ఇచ్చింది. మనీ లాండరింగ్ కేసులో సోమవారం విచారణ చేపట్టిన స్పెషల్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్(పీఎంఎల్ఏ) కోర్టు జ్యూడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ తీర్పునిచ్చింది.

ఈ సందర్భంగా అనిల్ దేశ్ ముఖ్ తరుఫు న్యాయవాది ఆయనకు ఆహారం, బెడ్, మందుల కోసం అప్పీల్ చేశారు. తన క్లయింట్ వయసు,ఆరోగ్య సమస్యలను పరిగణలోకి తీసుకోవాలని.. ఆహారం, మందులు,బెడ్ కు అనుమతి ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

దీంతో కోర్టు ఆయనకు బెడ్, జైలు వైద్యుల కన్సల్టేషన్, మెడిసిన్ సమకూర్చాలని పీఎంఎల్ఏ కోర్టు ఆదేశించింది. ఇంటి నుంచి వండిన ఆహారాన్ని అనుమతించాలనే విజ్ఞప్తిని కోర్టు పెండింగ్ లో ఉంచింది.

మనీలాండరింగ్ కేసులో ఈడీ నవంబర్ 1న అనిల్ దేశ్ ముఖ్ ను అరెస్ట్ చేసింది. అనంతరం ఈడీ రిమాండ్ కు కోర్టు పంపగా.. ఆ రిమాండ్ ను పొడిగించాలంటూ ఈడీ చేసుకున్న విజ్ఞప్తికి ప్రత్యేక కోర్టు నవంబర్ 7న తోసిపుచ్చింది. అనంతరం ఆయన్ను జ్యూడిషియల్ కస్టడీకి పంపింది.

అనంతరం దిగువ కోర్టు తీర్పుపై ముంబై హైకోర్టు తోసిపుచ్చి నవంబర్ 12వరకూ ఈడీ రిమాండ్ కు పంపింది. అనిల్ రిమాండ్ ముగిసిన నేపథ్యంలో అతడిని కోర్టులో హాజరుపరుచగా.. కోర్టు జ్యూడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

అవినీతి, అధికారిక పదవి దుర్వినియోగం ఆరోపణలపై ఈ ఏడాది ఏప్రిల్ 21న ఎన్సీపీ నేత, హోంమంత్రి, అతడి అనుచరులపై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.అనంతరం ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. అనిల్ దేశ్ ముఖ్ రూ.100 కోట్లు లంచం తీసుకున్నారంటూ ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ చేసిన ఆరోపణల అనంతరం ఈడీ ఈ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.




Tags:    

Similar News