మోదీకి షాకిచ్చిన ఫేస్ బుక్.. క్షమాపణలు చెప్పిన మెటా.. కేంద్రప్రభుత్వం సీరియస్ యాక్షన్

భారత ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వీడియోను తాత్కాలికంగా బ్లాక్ చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

Update: 2026-07-28 06:50 GMT

భారత ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వీడియోను తాత్కాలికంగా బ్లాక్ చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ అనూహ్య పరిణామంపై ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి, వినియోగదారులకు క్షమాపణలు తెలిపింది. సాంకేతిక లోపం వల్లే ఈ పొరపాటు జరిగిందని.. విషయాన్ని గుర్తించిన వెంటనే సదరు వీడియోను తిరిగి అందుబాటులోకి తెచ్చామని స్పష్టం చేసింది.

అసలేం జరిగింది?

మంగళవారం తెల్లవారుజామున సుమారు 1.25 గంటల సమయంలో ప్రధాని మోదీ ఫేస్‌బుక్ పేజీలోని ఆ వీడియో కింద "See Why" అనే ఆప్షన్‌లో ఒక సందేశం ప్రత్యక్షమైంది. భారతదేశంలో చట్టపరమైన అభ్యర్థన మేరకు ఈ వీడియోను పరిమితం చేసినట్లు అందులో కనిపించింది. అయితే ఏ చట్టం కింద, ఏ శాఖ నుంచి ఈ అభ్యర్థన వచ్చిందనే విషయాన్ని మెటా వెల్లడించలేదు. కొద్దిసేపటికే ఆ పరిమితిని ఎత్తివేసి వీడియోను పునరుద్ధరించినప్పటికీ, వివాదం మాత్రం సమసిపోలేదు.

మెటా వివరణపై అసంతృప్తితో కేంద్రం

మెటా "పొరపాటున జరిగింది" అని క్షమాపణలు చెప్పినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకుంది. మెటా ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ అంశంపై పూర్తిస్థాయి వివరణ కోరేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా మెటా గ్లోబల్ హెడ్స్, గ్లోబల్ హెడ్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అధికారులకు సమన్లు జారీ చేసినట్లు సమాచారం.

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రధాని మోదీ ఆల్‌టైమ్ రికార్డు

ఒకవైపు ఫేస్‌బుక్‌లో ఈ వివాదం నడుస్తుండగానే ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించారు. 303 మిలియన్ల వ్యూస్ సాధించారు. పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టడం, ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ద్వారా దోషులకు శిక్షలు ఖరారు చేయడంపై జూలై 23న ఆయన పోస్ట్ చేసిన రీల్ కేవలం 24 గంటల్లోనే 303 మిలియన్ల వ్యూస్ సాధించింది. ప్రపంచంలోనే ఒక రోజులో అత్యధికంగా వీక్షించబడిన ఇన్‌స్టాగ్రామ్ రీల్‌గా ఇది చరిత్రకెక్కింది. ఈ వీడియోకు 16 మిలియన్లకు పైగా లైక్స్, 15 లక్షలకు పైగా కామెంట్లు రాగా.. ఒక్క రాత్రిలోనే ప్రధానికి 10 లక్షల మంది కొత్త ఫాలోవర్లు చేరారు.

ధన్యవాదాల వీడియో..

యువత నుంచి వచ్చిన స్పందనకు నిదర్శనంగా జూలై 24న "థ్యాంక్యూ ఫ్రెండ్స్..." అంటూ ప్రధాని విడుదల చేసిన రెండో వీడియో కూడా 24 గంటల్లో 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఈ రెండు వీడియోల ప్రభావితంతో ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 103 మిలియన్లకు చేరుకుంది.

ప్రధాని వీడియోకు సోషల్ మీడియాలో కోట్ల సంఖ్యలో లైక్స్, వ్యూస్ వస్తున్న తరుణంలో.. ఉన్నట్లుండి ఫేస్‌బుక్‌లో అది బ్లాక్ కావడం పెద్ద చర్చకు దారితీసింది. డిజిటల్ వేదికలపై బిగ్ టెక్ కంపెనీల కంటెంట్ మోడరేషన్ విధానాలు, స్వతంత్ర నిర్ణయాలపై ఈ ఘటన మరోసారి అనేక ప్రశ్నలను లేవనెత్తింది. కేంద్ర ప్రభుత్వం-మెటా మధ్య జరగబోయే తదుపరి భేటీలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయోనని టెక్, రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

Tags:    

Similar News