రాజ్యాంగ స్ఫూర్తితోనే పనిచేశా.. భూ కబ్జాదారులకే నా చర్యలు ఇబ్బంది: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

హైదరాబాద్‌లో భూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తనపై వస్తున్న విమర్శలు, కోర్టు ధిక్కార కేసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2026-07-28 04:57 GMT

హైదరాబాద్‌లో భూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తనపై వస్తున్న విమర్శలు, కోర్టు ధిక్కార కేసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత రెండేళ్లుగా తాను పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరిస్తూనే విధులు నిర్వర్తించానని స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, ఆర్టికల్ 48A ప్రకారం ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు, పర్యావరణాన్ని కాపాడటమే తన ప్రధాన బాధ్యతగా భావించి పనిచేసినట్లు వెల్లడించారు.

రూ.1.50 లక్షల కోట్ల ఆస్తుల పరిరక్షణ

ఈ రెండేళ్ల కాలంలో మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.1.50 లక్షల కోట్లుగా అంచనా వేసే ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులను ఆక్రమణల నుంచి విడిపించి తిరిగి ప్రభుత్వానికి అప్పగించినట్లు రంగనాథ్ తెలిపారు. ఇప్పటికే 6 చెరువులను పూర్తిస్థాయిలో పునరుద్ధరించగా.. మరో 20 చెరువుల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. చెరువులు, పర్యావరణాన్ని కాపాడేందుకు ఎలాంటి రాజకీయ లేదా ఇతరుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా చట్టబద్ధంగా చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.

లోతుకుంట భూముల వివాదంపై స్పష్టత

లోతుకుంట ప్రాంతంలోని రూ.10 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆక్రమించేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. ఎటువంటి అనుమతులు లేకుండా సుమారు రూ.2,500 కోట్ల విలువైన వారసత్వ శిలలను హెరిటేజ్ రాక్స్ పేల్చివేస్తూ వందలాది చెట్లను ధ్వంసం చేశారని వివరించారు. 'సేవ్ ది రాక్స్ సొసైటీ', పర్యావరణవేత్తలు, స్థానిక ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే హైడ్రా రంగంలోకి దిగి చర్యలు చేపట్టిందని తెలిపారు.

కోర్టు ధిక్కార కేసులపై సమాధానం

తనపై ప్రస్తుతం నమోదైన 63 కోర్టు ధిక్కార కేసులు కూడా భూ కబ్జాదారులు, ల్యాండ్ మాఫియా వేసినవేనని ఆయన స్పష్టం చేశారు. బతుకమ్మ కుంట, లోతుకుంట భూములు, సింగరేణి కార్మికుల భూములు, సామాన్యుల ప్లాట్లను కాపాడేందుకు తాను అడ్డుగా నిలవడమే ఈ కేసులకు కారణమని తెలిపారు. "నిజాయితీగా, నిర్భయంగా, నిబద్ధతతో పని చేస్తున్నందుకే హైడ్రాకు ఈ ధైర్యం ఉంది. ల్యాండ్ మాఫియా తప్పుడు సమాచారంతో కోర్టులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది. అయినప్పటికీ నాకు న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది" అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు.

ప్రభుత్వం ఏ బాధ్యత అప్పగించినా వంద శాతం ఫలితాలు అందించడమే తన లక్ష్యమని, ప్రజా ఆస్తులు, పర్యావరణ పరిరక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని రంగనాథ్ తేల్చిచెప్పారు.



Tags:    

Similar News