ప్రతి గడపకూ సీఎం చంద్రబాబు విజన్.. క్షేత్రస్థాయిలో ఎలా సాగుతుందంటే..
పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ పిలుపుతో పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నాయి.
కూటమి ప్రభుత్వం రెండేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా, అధికార తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి ప్రచార కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. 45 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ ఆయా ఎమ్మెల్యేలు, పార్టీ ఇంచార్జుల ఆధ్వర్యంలో ఇంటింటికి టీడీపీ అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి గడపకూ ప్రభుత్వాన్ని చేరువ చేయడమే ధ్యేయంగా సాగుతున్న ఈ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోందని కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు.
పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ పిలుపుతో పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా ప్రతి ఇంటికీ చేరుకుని ప్రజలతో మమేకమవుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులతోపాటు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నాయకులు స్వయంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తుండటంతో పార్టీ శ్రేణుల్లోనూ, స్థానిక ప్రజల్లోనూ విశేషమైన ఉత్సాహం కనిపిస్తోందని చెబుతున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన రెండేళ్ల కాలంలో సాధించిన అభివృద్ధి ప్రాజెక్టులు, పారదర్శక సంక్షేమ పథకాలను నాయకులు ప్రజలకు వివరిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్న తీరును, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణను, పారిశ్రామికాభివృద్ధిని కాపాడుతూ సాగిస్తున్న సుపరిపాలన విజయాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లు తెలియజేస్తున్నారు. కేవలం ప్రభుత్వ విజయాలను వివరించడమే కాకుండా, ప్రజల నుంచి పథకాల అమలుపై అభిప్రాయాలను, అమూల్యమైన సూచనలను సేకరిస్తున్నారు.
ఈ కార్యక్రమం కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా, ప్రజల స్థానిక సమస్యలను నేరుగా తెలుసుకునే వేదికగా మారుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని సమస్యలను అడిగి తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టేలా స్థానిక యంత్రాంగానికి పార్టీ శ్రేణులు నివేదిస్తున్నాయి. ప్రభుత్వం, ప్రజల మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడంలో ఈ ఇంటింటి ప్రచార కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతి ఇంటినీ చేరుకోవాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సంక్షేమ విధానాలు అట్టడుగు స్థాయి ప్రజలకు సైతం మరింత స్పష్టంగా చేరువవుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఊరూవాడా కొనసాగుతున్న ఈ 45 రోజుల ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్యమైన ఆదరణ లభిస్తోంది. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ పాలనపై ఆరా తీస్తుండటంతో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సేవలను అభినందిస్తున్నారు. ప్రజల ముఖంలో కనిపిస్తున్న సంతృప్తే ప్రభుత్వ విజయాకి నిదర్శనమని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. రాబోయే కాలంలో ప్రభుత్వాన్ని, పార్టీని మరింత ప్రజాభిముఖంగా నడిపేందుకు ఈ తరహా ప్రజాక్షేత్ర కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.