జగన్ మనసు మార్చుకుంటారా... ఆగస్టులో అసెంబ్లీ !

మరో వైపు చూస్తే జగన్ ఈసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే బడ్జెట్ సెషన్ సమయంలోనే ఆయన వస్తారు అని అనుకున్నారు.

Update: 2026-07-28 07:17 GMT

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు మూడో వారంలో మొదలు కానున్నాయని తెలుస్తోంది. రెండు వారాల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం భావిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చాక కచ్చితంగా వర్షాకాల సమావేశాలను నిర్వహిస్తూ వస్తోంది. ప్రతీ ఏటా కనీసం మూడు సెషన్లు నిర్వహించేలా స్పీకర్ అయ్యన్నపాత్రుడు చర్యలు తీసుకుంటున్నారు. ఏడాదికి అరవై పని దినాలు అయినా అసెంబ్లీకి ఉండాలని ఆయన కచ్చితంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపధ్యంలో బడ్జెట్ సెషన్ ముప్పయి రోజులు వర్షాకాలం, శీతాకాలం సమావేశాలు చెరి పది రోజులు కలిపి యాభై రోజుల దాకా నడిచే విధంగా అయ్యన్నపాత్రుడు చర్యలు తీసుకుంటున్నారు.

కీలక బిల్లులతో :

వర్షాకాల సమావేశాలలో కీలక బిల్లులతో కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని అంటున్నారు. దాంతో పాటు ఏపీలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు ఎల్ నినో ప్రభావం వంటి వాటి మీద సమావేశాలలో చర్చిస్తారు అని అంటున్నారు. అలాగే అమరావతి పోలవరం పరి పూర్తి విషయం మీద అసెంబ్లీలో చర్చిస్తారు అని అంటున్నారు. ఏపీలో పెట్టుబడులు కొత్త ప్రాజెక్టుల గురించి కూడా సభలో కీలకంగా చర్చ సాగనుంది అని అంటున్నారు. ఈ సమావేశాలను ప్రభుత్వం ముఖ్యంగానే భావిస్తోంది.

వైసీపీ వైఖరితో :

ఇదిలా ఉంటే వైసీపీ వైఖరి ఏమిటి అన్నది కూడా ఇపుడు మరో చర్చ సాగుతోంది. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరు కావడం లేదు, బడ్జెట్ సెషన్ లో గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం చేసే కార్యక్రమానికి మాత్రమే జగన్ ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. అయితే ఈసారి వర్షాకాల సమావేశాల నాటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పై దాటుతుంది. దాంతో సమస్యలు అనేకం ఉన్నాయని ప్రజలకు సంబంధించిన విషయాల్లో చర్చించాలని కనుక వైసీపీ భావిస్తే మాత్రం సభకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. లా అండ్ ఆర్డర్ తో పాటు వైసీపీ ఆరోపిస్తున్న మెగా డీఎస్సీలో అవకతవకలు వంటి వాటి మీద కూడా సభలో చర్చించాలని వైసీపీ అనుకుంటే అసెంబ్లీకి రావచ్చు అని అంటున్నారు.

జగన్ వ్యూహం ప్రకారం :

మరో వైపు చూస్తే జగన్ ఈసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే బడ్జెట్ సెషన్ సమయంలోనే ఆయన వస్తారు అని అనుకున్నారు. కానీ అది జరగలేదు, కానీ ఈ సమావేశాలకు వైసీపీ అధినేత వస్తే అది రాష్ట్రంలో కూడా కీలకమైన అంశంగా మారుతుందని అంటున్నారు. అంతే కాదు అసెంబ్లీ మీద ఫోకస్ పెరుగుతుంది అని చెబుతున్నారు. మరో వైపు చూస్తే అసెంబ్లీలోనే ఏ సమస్య అయినా చర్చించాల్సి ఉంటుంది. వైసీపీ అసెంబ్లీకి దూరంగా ఉండడంతో గ్రాఫ్ తగ్గుతోంది అన్న విమర్శలు కూడా ఉన్నాయి. దీని మీద వైసీపీలో అంతర్గతంగా కూడా తర్జన భర్జన సాగుతోంది అని అంటున్నారు. అసెంబ్లీకి వైసీపీ వెళ్ళడం వల్ల లాభమే తప్ప నష్టం ఉండదని అంటున్నారు.

ముద్రగడ కోసమైనా :

ఇక ఈ సభలో మాజీ మంత్రి దివంగత ముద్రగడ పద్మనాభానికి సంతాపం వ్యక్తం చేసే తీర్మానం ఉంటుంది. ముద్రగడ అంటే కాపులకు ఐకాన్ లాంటి వారు. ఆయన వారసత్వం సానుభూతి కోసం అపుడే వైసీపీ టీడీపీల మధ్య పోటీ మొదలైంది. దాంతో టీడీపీ కూటమి ప్రభుత్వం ముద్రగడ సంతాప తీర్మానం ద్వారా సభలో పెద్దలంతా మాట్లే వీలుంది. అలా కాపులకు ఒక సందేశం ఇవ్వాలని చూస్తారు. మరి వైసీపీ ఈ విషయంలో సీరియస్ గా ఆలోచిస్తే మాత్రం కచ్చితంగా సభకు వెళ్తుందని అంటున్నారు. అలాగే లా అండ్ ఆర్డర్ తో పాటు ఇతర అంశాలు రైతుల సమస్యల మీద ఆక్వా రైతుల ఇష్యూల మీద వైసీపీ గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయాలని చూస్తోంది. మొత్తానికి చూస్తే ఆగస్టు 15 జెండా పండుగ తరువాత ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News