సౌండ్ చేయాలంటే గ్రౌండ్ లోకి జగన్ దిగాల్సిందే ?
కేంద్రంలో ప్రభుత్వాన్ని నిలదీయాలంటే రాహుల్ గాంధీ గ్రౌండ్ లోకి నేరుగా వస్తున్నారు అని గుర్తు చేస్తున్నారు.
వైసీపీ అధినాయకత్వం వరసగగా ఇష్యూని గుర్తిస్తోంది. వాటి మీద ఆందోళనలు చేపట్టాలని క్యాడర్ కి సూచిస్తోంది. ఈ విధంగా క్యాలెండర్ ని ఇవ్వడం వరకూ బాగానే ఉంది. ఈ మధ్య కాలంలో చూస్తే మహిళల చేత ఆందోళనలు చేయించారు, ఇపుడు విద్యార్థి ఉద్యమాలు అని పిలుపు ఇస్తున్నారు. దాని కంటే ముందు వెన్నుపోటుకు రెండేళ్ళు అని నిరసనలు జరిగాయి. అయితే వీటిలో వెన్నుపోటుకు రెండేళ్ళు పేరుతో చేపట్టిన కార్యక్రమమే వైసీపీలో ఊపు తెచ్చింది. మిగిలినవి అన్నీ తూతూ మంత్రంగానే సాగిపోతున్నాయి. పై నుంచి హై కమాండ్ ఫలానా ఇష్యూ అని పిలుపు ఇస్తే జిల్లాలలో నాయకులు మొక్కుబడిగా ఆందోళనలు చేపట్టి మమ అని పిస్తున్నారు. ఇవి అయితే జనాలలో ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోతున్నాయని అంటున్నారు.
ట్వీట్లతో సరి :
జగన్ అయితే ప్రతీ అంశం మీద దాదాపుగా స్పందిస్తున్నారు. అయితే అది ఎక్కడ అంటే ట్విట్టర్ ద్వారానే అని అంటున్నారు. ట్విట్టర్ ద్వారా ప్రభుత్వాన్ని నిలదీస్తే ఆ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది అన్నదే వైసీపీలో చర్చ సాగుతోంది. తాజాగా జగన్ విద్యా శాఖ మంత్రిగా నారా లోకేష్ ని రాజీనామా చేయమని కోరారు. అయితే అది కూడా ట్విట్టర్ డిమాండ్ గానే మిగిలిపోయింది. దాంతో జనంలో చర్చకు రావడం లేదు, పాలక పక్షం అయితే అసలు ఎందుకు పట్టించుకుంటుంది అన్నది అంతా అంటున్న మాట.
జనంలో ఉంటేనే మరి :
వైసీపీ తరఫున రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపు ఇచ్చినపుడు జగన్ కూడా ఎక్కడో ఒక చోట తాను కూడా జాయిన్ అయితేనే ఆ ఆందోళనకు గుర్తింపు వస్తుందని జగన్ ఫోకస్ కూడా ఆ వైపుగా ఉంటుందని ఆ ఇష్యూని ప్రభుత్వం కూడా అడ్రస్ చేసేందుకు వీలు అవుతుందని అంటున్నారు. అలా కాకుండా తమ పార్టీ వారితోనే చేయించాలనుకుంటే పెద్దగా సౌండ్ చేయదని అంటున్నారు. అంతే కాదు వారు సైతం నీరసించి పోయి ఉత్సాహం తగ్గిపోయి ఒక దశలో ఎందుకొచ్చిన ఆందోళనలు అనేసుకుంటారేమో అని కూడా చర్చిస్తున్నారు.
ప్రతిపక్ష నాయకుడిగా :
కేంద్రంలో ప్రభుత్వాన్ని నిలదీయాలంటే రాహుల్ గాంధీ గ్రౌండ్ లోకి నేరుగా వస్తున్నారు అని గుర్తు చేస్తున్నారు. ఆయన ఏకంగా ప్రధాని నివాసం వద్ద కూడా భారీ ధర్నాను నిర్వహించి పోలీసు వారి ద్వరా అరెస్టు అయ్యారని ఈ సందర్భంగా ఆయన ముక్కుకు కూడా గాయం అయింది అని గుర్తు చేస్తున్నారు. ఇక సీజేపీ ఆందోళనలో రాహుల్ ప్రతీ రోజూ పాలుపంచుకుని ఉద్యమానికి ఊపిరి ఇచ్చారని అంటున్నారు. పార్లమెంట్ లోపలా బయటా కూడా రాహుల్ గాంధీ ఇదే తీరున దూకుడు చేయడం వల్లనే మోడీ కూడా 56 ఏళ్ళ యువకుడు అని సెటైర్లు పేల్చారని అంటే అధికార పక్షానికి అంతలా రాహుల్ సవాల్ చేస్తున్నారు అని విశ్లేషిస్తున్నారు. జగన్ సైతం ప్రతిపక్ష నాయకుడిగా గ్రౌండ్ లో నిలిచి పోరాడితేనే ఫలితం ఉంటుందని సూచిస్తున్నారు.
బొద్దింకల మద్దతు కావాలా :
ఏపీలో జగన్ కి కూడా బొద్దింకల మద్దతు కావాలా అని సెటైర్లు పడుతున్నాయి. వారంతా ఆందోళన చేస్తే ఆయన కూడా వారితో కలసి పాల్గొంటారా అని ప్రశ్నిస్తున్న వారూ ఉన్నారు. అయితే జగన్ గతంలో భారీ పోరాటాలకు నాయకత్వం వహించారు అని గుర్తు చేస్తున్నారు. కానీ 2024 నుంచే ఆయన వేరే విధంగా వ్యూహాలను రూపొందిస్తున్నారు అని అంటున్నారు. అయితే ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ పార్టీ అయినా నాయకుడే ప్రధానం కాబట్టి జగన్ రంగంలోకి దిగితే వచ్చే ఊపే వేరు అని అంటున్నారు. జగన్ అలా రాకుండా క్యాడర్ తోనే చేయించాలనుకుంటే మాత్రం అవి ఆశించిన ఫలితాలను ఇవ్వవని రాజకీయ విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి.