మంత్రి పదవి జీవిత కాలం లేటు !

అదే విధంగా మరో సీనియర్ నేత ఉన్నారు. ఆ కుటుంబానికి ఇంతవరకూ మంత్రి పదవి దక్కలేదు. ఆయనే విశాఖ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన గణబాబు.

Update: 2026-07-28 03:43 GMT

ఎమ్మెల్యేగా గెలవడం ఒక ఎత్తు అయితే మంత్రి పదవి దక్కడం మరో ఎత్తు. కానీ అందరికీ ఆ అదృష్టం లభించదు. దానికి కూడా జాతకం కలిసి రావాల్సి ఉంటుంది. అలా చూసుకుంటే ఎంతో మంది అమాత్య కిరీటం పెట్టుకోకుండానే తమ రాజకీయ జీవితానికి రిటైర్మెంట్ ప్రకటించేలా కనిపిస్తున్నారు. ఉత్తరాంధ్రాలో చూసుకుంటే అలాంటి వారు అనేక మంది కనిపిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వెలగపూడి రామక్రిష్ణబాబు 2009 నుంచి వరసబెట్టి గెలుస్తూ వస్తున్నారు. ప్రతీ ఎన్నికకూ ఆయన తన మెజారిటీని పెంచుకుంటూ పోతున్నారు. ప్రజలతో నిత్యం మమేకం అవుతారు. ఆయనకు పార్టీ క్యాడర్ తో మంచి రిలేషన్స్ ఉన్నాయి. అధినాయకత్వం వద్ద కూడా మంచి పేరు ఉంది. వివాదరహితుడిగా ఉంటారు. తన పనేంటో తానెంటో అన్నట్లుగా ఉంటారు. అలాంటి వెలగపూడికి మంత్రి పదవి ఇప్పటిదాకా రాలేదు అంటే ఆశ్చర్యం కలుగుతుంది.

అదే పెద్ద మైనస్ :

వెలగపూడికి అన్నీ ఉన్నాయి కానీ ఒక్కటే మైనస్ గా మారింది అని అంటున్నారు. అదే ఆయన సామాజిక వర్గం అని అంటున్నారు. ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. ఆ కోటాలో ఎక్కువగా గుంటూరు, క్రిష్ణా జిల్లాల వారికే అవకాశం దక్కుతుంది. ఈసారి మరింత ముందుకు వెళ్ళి రాయలసీమలో పయ్యావుల కేశవ్ కి కూడా మంత్రి యోగం పట్టింది. కానీ ఉత్తరాంధ్రాలో చూస్తే టీడీపీ నుంచి ఏకైక కమ్మ ఎమ్మెల్యేగా ఉన్న వెలగపూడికి మాత్రం చాన్స్ దక్కడం లేదు. దాంతో ఆయన అభిమానులు అంతా ఇదే విషయం మీద దిగాలు పడుతూ ఉంటారు. నాలుగు సార్లు ఎమ్మెల్యే అంటే మామూలు విషయం కాదు, ఇక అపజయం మాటే లేకుండా జగన్ ప్రభంజనంలో సైతం వెలగపూడి 2019లో గెలిచారు అని గుర్తు చేస్తున్నారు.

ఈయన సంగతి అంతే :

అదే విధంగా మరో సీనియర్ నేత ఉన్నారు. ఆ కుటుంబానికి ఇంతవరకూ మంత్రి పదవి దక్కలేదు. ఆయనే విశాఖ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన గణబాబు. ఆయన తన తండ్రి మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ అప్పల నరసింహం వారసుడిగా 1999లో ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు. ఆ తరువాత 2014, 2019, 2024 ఇలా చూస్తే నాలుగు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. కానీ మంత్రి ఊసే లేకుండా కాలం గడుస్తోంది అని అంటున్నారు. ఆయన తండ్రి కూడా టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా 1983లో ఉన్నారు. కానీ మంత్రి పదవి అయితే లభించలేదు అని గుర్తు చేస్తున్నారు. 2014 నుంచి 2019 మధ్యలో గణబాబు పేరు మంత్రి పదవికి కొన్ని సార్లు వినిపించింది. కానీ అది వర్కౌట్ కాలేదు. 2024 లో మాత్రం ఆ ఆశే లేదన్నట్లుగా సీన్ ఉంది. ఉత్తరాంధ్రాలో ప్రాధాన్యత కలిగిన బీసీ సామాజిక వర్గం అయిన గవర కేటగిరీకి చెందిన గణబాబు ఆ కోటాలో మంత్రి కావాల్సి ఉంది. అయితే మంత్రి వర్గ విస్తరణ అంటూ జరిగే అదే సామాజిక వర్గానికి చెందిన అనకాపల్లి ఎమ్మెల్యే జనసేన నుంచి గెలిచి గెలిచిన కొణతాల రామక్రిష్ణకు చాన్స్ ఉంటుందని ప్రచారం సాగుతోంది. ఇక చోడవరం నుంచి రెండు సార్లు గెలిచిన సీనియర్ ఎమ్మెల్యే రాజుకు కూడా సామాజిక అంశాలే మైనస్ గా మారుతున్నాయి.

ఆమెకు కూడా నిరాశే :

విజయనగరం జిల్లా నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారు ఎస్ కోటకు చెందిన కోళ్ళ లలిత కుమారి. ఆమె సీనియర్ ఎమ్మెల్యేగా విజయనగరం జిల్లాలో ఉన్నా కూడా తొలిసారి గెలిచిన వారికే మంత్రి పదవులు అక్కడ ఇచ్చారు. దాంతో ఆమె వర్గం సైతం నిరాశ చెందుతున్నారు. ఆమె మంత్రి పదవికి కూడా సామాజిక సమీకరణలే అడ్డంకిగా మారుతున్నాయని అంటున్నారు. ఆమె వెలమ సామాజిక వర్గం కావడంతో అచ్చెన్నాయుడుకు చాన్స్ ఇచ్చారు కాబట్టి ఆమెకు దక్కడం లేదని అంటున్నారు. ఇక వచ్చేసారి ఆమె ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చు అని అంటున్నారు. దాంతో ఎమ్మెల్యేగా సీనియర్ అయినా మంత్రి కాకుండానే ఇన్నింగ్స్ ముగించాల్సి వస్తోంది అన్నది ఆమె వరగంలో అసంతృప్తిగా ఉంది అని అంటున్నారు.

వీరి విషయంలో సైతం :

శ్రీకాకుళం జిల్లాలో కూడా ముగ్గురు సీనియర్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి దక్కకుండా ఊరిస్తోంది. ఆముదాలవలస నుంచి రెండు సార్లు గెలిచిన కూన రవికుమార్ కి మంత్రి యోగం ఉందా లేదా అన్న సందేహం ఆయన వర్గంలో ఉంది. అలాగే నరసన్నపేటకు చెందిన బగ్గు రమణమూర్తి రెండు సార్లు గెలిచిన సీనియర్ నేత. ఆయనకు మంత్రి పదవికి సామాజిక సమీకరణలు అడ్డు పడుతున్నాయి. ఇచ్చాపురం నియోజకవర్గానికి చెందిన హ్యాట్రిక్ ఎమ్మెల్యే బెందాళం అశోక్ కి మంత్రి పదవి అంటే దూరం అనే అంటున్నారు. ఆయన ఆశించినా దక్కడం లేదని అంటున్నారు.

Tags:    

Similar News