కాక్రోచ్ జనతా పార్టీ మరో సంచలనం
ప్రజల నుంచి అందిన ప్రతి ఆధారాన్ని క్రమబద్ధంగా భద్రపరిచి.. జూలై 20న చోటుచేసుకున్న ఘటనల కాలక్రమాన్ని స్పష్టంగా రూపొందిస్తామని పార్టీ ప్రతినిధులు వెల్లడించారు.
జూలై 20న దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న భారీ నిరసన కార్యక్రమాలకు సంబంధించిన నిజాలను, ఆధారాలను ఒకే చోటకు చేర్చేందుకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఒక కీలక అడుగు వేసింది. ఆ నాటి ఘటనలకు సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని సేకరించేందుకు 'సాక్షి' పేరుతో ఒక కొత్త డిజిటల్ వేదికను అధికారికంగా అందుబాటులోకి తీసుకువచ్చింది.
పోర్టల్ ముఖ్య ఉద్దేశం..
జూలై 20న జరిగిన నిరసనల్లో వేలాది మంది ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అయితే ఆ సమయంలో జరిగిన వివిధ ఘటనల వివరాలు, ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం రకరకాల సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో.. వ్యక్తుల వ్యక్తిగత మొబైల్ ఫోన్లలో.. వార్తా కథనాల్లో విడివిడిగా ఉన్నాయి. వీటిని సమగ్రంగా ఒకే చోట సమీకరించి.. భవిష్యత్తు పరిశీలనకు ఉపయోగపడేలా ఒక ‘సమగ్ర ప్రజా రికార్డు’ ను రూపొందించడమే ఈ 'సాక్షి' పోర్టల్ ప్రధాన లక్ష్యమని సీజేపీ నాయకత్వం స్పష్టం చేసింది.
'సాక్షి' పోర్టల్ ద్వారా ప్రజలు సమర్పించదగిన ఆధారాలు..
ఈ డిజిటల్ వేదిక ద్వారా నిరసనల్లో పాల్గొన్న వారు, సంఘటనలను ప్రత్యక్షంగా చూసిన సాక్షులు లేదా ఆనాటి పరిణామాలపై సమాచారం ఉన్న ఎవరైనా సరే స్వచ్ఛందంగా తమ వద్ద ఉన్న ఆధారాలను పంచుకోవచ్చు. నిరసన ప్రదేశాల్లో తీసిన ప్రత్యక్ష చిత్రాలు, విజువల్స్ , సంఘటనలకు సంబంధించిన అధికారిక లేదా వ్యక్తిగత పత్రాలు... సాక్షుల వాంగ్మూలాలు.. ఆ రోజున క్షేత్రస్థాయిలో చోటుచేసుకున్న పరిణామాలపై ప్రత్యక్ష సాక్షుల లిఖితపూర్వక అనుభవాలు పంచుకోవచ్చు.
భవిష్యత్తు ప్రణాళిక - ప్రజా భాగస్వామ్యం
ప్రజల నుంచి అందిన ప్రతి ఆధారాన్ని క్రమబద్ధంగా భద్రపరిచి.. జూలై 20న చోటుచేసుకున్న ఘటనల కాలక్రమాన్ని స్పష్టంగా రూపొందిస్తామని పార్టీ ప్రతినిధులు వెల్లడించారు. "జూలై 20 నిరసనల సమయంలో క్షేత్రస్థాయిలో నిజంగా ఏం జరిగింది? వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అనే అంశాలపై స్పష్టతనిచ్చేందుకు ఈ 'సాక్షి' పోర్టల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రజల భాగస్వామ్యంతో ఒక పారదర్శకమైన, విస్తృతమైన ప్రజా డాక్యుమెంటేషన్‌ను తయారు చేయడమే మా లక్ష్యం" అని సీజేపీ నాయకత్వం ప్రకటించింది.
ప్రజల నుంచి ఎంత ఎక్కువ మొత్తంలో ఆధారాలు అందితే ఆ రోజు నాటి పరిణామాలను అంత పక్కాగా నమోదు చేయడం సాధ్యమవుతుందని పార్టీ భావిస్తోంది. నిజాలను వెలికితీసే ఈ ప్రక్రియలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని సీజేపీ పిలుపునిచ్చింది.