కేసీఆర్ వివరణతో ఈసీ సేటిస్ఫై అవుతుందా?

Update: 2019-04-13 04:04 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలక్షన్ కమిషన్‌ కు వివరణ ఇచ్చుకున్నారు. ఇటీవల కరీంనగర్‌ లో నిర్వహించిన ఎన్నికల సభలో కేసీఆర్ మతపరమైన వ్యాఖ్యలు చేశారంటూ కొందరు ఎన్నికల కమిషన్‌ కు ఫిర్యాదు చేశారు. హిందువుల మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం కేసీఆర్‌ కు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులకు సంబంధించి శుక్రవారం కేసీఆర్ వివరణ ఇచ్చారు.
  
కాగా కేసీఆర్ తన వివరణ లేఖను ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి - రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ రాంచందర్ రావులతో రాష్ట్ర ఎన్నికల సంఘం చైర్మన్ జ్యోతిబుద్ధ ప్రకాష్‌ కు పంపించారు. మార్చి 17న కరీంనగర్‌ లో కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ సభలో కేసీఆర్ హిందువుల మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ వీహెచ్‌ పీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రామరాజు ఎన్నికల కమిషన్‌ కు ఫిర్యాదు చేశారు. ఓట్ల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎన్నికల కోడ్‌ ను ఉల్లంఘించడమేనని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ఎన్నికల కమిషన్‌ కు సమర్పించారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ అటు తెలంగాణ సీఈఓను ఎన్నికల కమిషన్ వివరణ కోరింది. అదే సమయంలో కేసీఆర్‌ కు కూడా వివరణ ఇవ్వాలంటూ నోటీసులు పంపింది.
      
కేసీఆర్ ఆ సభలో ‘‘ఈ హిందుగాళ్లు - బొందగాళ్లు..  బీజేపీ వాళ్లే దేవుడికి మొక్కుతారా ? మేం ఎవరం .. తిరుపతి - ఎములాడ వెళ్లమా .. దేవుడిని దర్శించుకోమా’’ అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన బీజేపీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ హిందుగాళ్లు బొందుగాళ్లు అని అనడంతో వీహెచ్‌పీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
  
అయితే.. కేసీఆర్ ఏమని వివరణ ఇచ్చారన్నది ఇంకా తెలియలేదు. ఆయన వివరణతో ఈసీ సంతృప్తి చెందుతుందా.. లేదో చూడాలి. సంతృప్తి చెందకుంటే ఏం చేస్తుందన్నదీ చూడాలి.
Tags:    

Similar News