బాబు అన్యాయం చేశార‌ట‌.. జ‌గ‌న్ న్యాయం చేయాల‌ట‌

Update: 2019-06-06 07:24 GMT
ఏపీలో ఇప్పుడు కొత్త డిమాండ్ ఎంట్రీ ఇచ్చేసింది. టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు సీఎం హోదాలో అన్యాయం చేస్తే...దానికి బ‌దులుగా ఇప్పుడు కొత్త సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి న్యాయం చేయాల్సిందేన‌ట‌. స‌రే అధికారంలోకి వ‌చ్చాక... అంత‌కుముందున్న ప్ర‌భుత్వాలు అన్యాయం చేసినా, నిర్ల‌క్ష్యం చేసినా... కొత్తగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన వారు న్యాయం చేయాల్సిందే. ఇది కాద‌న‌లేని విష‌యమే. అయితే ఏకంగా బాబు హ‌యాంలో జ‌రిగిన అన్యాయానికి ఏమాత్రం సంబంధం లేని జ‌గ‌న్ ఇంటి ఎదుట ధ‌ర్నాకు దిగి మ‌రీ న్యాయం చేయాల‌ని కోర‌డ‌మే వింత‌గా ఉంద‌ని చెప్ప‌క త‌ప్పదు.

అంతేకాదండోయ్‌... బాబు జ‌మానాలో అన్యాయానికి గురైనట్లుగా గుర్తించినా గానీ... బాబు నివాసం ఎదుట ఏనాడూ నిర‌స‌న‌కు దిగని వీరంతా... ఇప్పుడు జ‌గ‌న్ సీఎం కాగానే ఆయ‌న ఇంటి ఎదుటే నిర‌స‌న‌కు దిగేశారన్న వాద‌న వినిపిస్తోంది. అయినా చంద్ర‌బాబు చేసిన అన్యాయానికి ఆయ‌న ఇంటి ఎదుట నిర‌స‌న‌కు దిగ‌ని వీరంతా ఇప్పుడు ఆ అన్యాయంతో ఏమాత్రం సంబంధం లేని జ‌గ‌న్ ఇంటి ఎదుట నిర‌స‌న‌కు దిగడం చూస్తుంటే నిజంగానే ఆశ్చ‌ర్యం అనిపించ‌క మాన‌దు. ఇక అస‌లు విష‌యానికివ వ‌స్తే... నేటి ఉద‌యం తాడేప‌ల్లిలోని జ‌గ‌న్ నివాసం ఎదుట డీఎస్సీ అభ్య‌ర్థులు, ఏఎన్ ఎంలు నిర‌స‌న‌కు దిగారు. త‌మ‌కు త‌క్ష‌ణ‌మే ఉద్యోగాలు ఇవ్వాల‌ని డీఎస్సీ అభ్య‌ర్థులు, త‌మ‌కు వేత‌నాలు ఇవ్వాల‌ని ఏఎన్ ఎంలు డిమాండ్ చేశారు.

నిర‌స‌న‌కు దిగిన వీరంతా... త‌మ‌ను చంద్ర‌బాబు న‌ట్టేట ముంచార‌ని, చంద్ర‌బాబు చేతిలో తాము అన్యాయానికి గుర‌య్యామ‌ని చెప్ప‌డం విశేషం. అంతేనా... బాబు చేతిలో అన్యాయానికి గురైన త‌మ‌కు మీరు మాత్రం న్యాయం చేయాల్సిందేన‌ని వారు జ‌గ‌న్ ఇంటి ఎదుట స‌రికొత్త డిమాండ్ ను వినిపించారు. స‌రే... మ‌రి సీఎంగా బాధ్య‌త‌లు చేపట్టాక జ‌గ‌న్ కు ఈ త‌రహా నిర‌స‌న‌లు త‌ప్ప‌వు క‌దా. చంద్ర‌బాబు చేసినా, త‌న‌కు ముందు రాష్ట్రాన్ని ఎవ‌రు పాలించినా.. వారు చేసిన త‌ప్పుల‌ను జ‌గ‌న్ స‌రిదిద్దాల్సిందే క‌దా. మ‌రి బాబు చేతిలో అన్యాయానికి గుర‌య్యామ‌ని చెబుతున్న డీఎస్సీ అభ్య‌ర్థులు, ఏఎన్ ఎంల మొర‌పై జ‌గ‌న్ ఏ త‌ర‌హాలో స్పందిస్తారో చూడాలి.
 
    

Tags:    

Similar News