మందు బాబుల బంద్ బాగోతం..అదిరిపోయింది గురూ..!

Update: 2019-10-31 01:30 GMT
మేమె మ‌హారాజులం..! అని పాడుకునే వారి సంఖ్య రాష్ట్రంలో త‌గ్గిపోతోందట‌! రాష్ట్రంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం - ఎన్నిక‌లకు ముందు ఇచ్చిన హామీల అమ‌ల్లో భాగంగా రాష్ట్రంలో వైన్స్ దుకాణాల‌ను ప్ర‌భుత్వ‌మే నిర్వ‌హిస్తోంది. అదేస‌మ‌యంలో వీటి స‌మ‌యాన్ని కూడా బాగా కుదించింది. త‌ద్వారా రాష్ట్రంలో మ‌ద్య నిషేధానికి పునాదులు ప‌డ‌తాయ‌ని - క్ర‌మంగా మందుబాబులు త‌మ ప‌ద్ధ‌తులు మార్చుకుంటార‌ని భావించింది.

ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలో 22% వ‌ర‌కు మద్యం దుకాణాల‌ను కూడా ప్ర‌భుత్వం త‌గ్గించి ఉద‌యం 11 నుంచి రాత్రి 8 వ‌ర‌కే వైన్స్ తెరిచి ఉంచుతోంది. ఇక‌ - ఇంత‌కు ముందు ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. ఉద‌యం 10 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల‌ వ‌ర‌కు అల‌వాటు ప‌డిన మ‌ద్య‌పాన ప్రియులు ఈ టైం స్లాట్‌ తో తీవ్ర ఇబ్బందులు ప‌డిపోతున్నారు. అలవాటైన ప్రాణాన్ని ఆపుకోలేక‌ - పీకేస్తున్న నాలుక‌ను అదిమి పెట్టుకోలేక స‌త‌మ‌త‌మ‌యిపోతున్నారు. పోనీ.. 11 గంట‌ల వ‌ర‌కు ఉండే బార్ల‌కు వెళ్లి కూర్చుందామా? అంటే.. జేబు వెక్కిరిస్తోంది.!

దీంతో ఎన్ని ప‌నులున్నా.. ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా.. మందుబాబులు ఠంచ‌నుగా రాత్రి 8 గంట‌ల‌ లోపే వైన్స్ ముందు క్యూ క‌ట్టేస్తున్నారు. విజ‌య‌వాడ‌ - విశాఖ స‌హా ప్ర‌ధాన న‌గ‌రాల్లోని అన్ని వైన్స్ దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. ఒక‌వేళ ఏదైనా ఇబ్బంది అయి టైం మిస్స‌యిపోయారో.. ఇక అంతే సంగ‌తులు త‌ల ప‌ట్టేసి - చేతులు వ‌ణికేసి ఇలా వీళ్ల బాధ‌లు వ‌ర్ణ‌నాతీతం. అందుకే కుడి ఎడ‌మైతే.. పొర‌పాటు లేదోయ్‌!! అని పాడుకుంటూ.. ఉన్న ప‌నులు ప‌క్క‌న పెట్టి మ‌రీ బారు క‌న్నా వైన్స్ మేల‌ని క్యూ క‌ట్టి.. మ‌రీ బాటిళ్ల‌ను కొనేసుకుంటున్నారు.

గ‌తంలో చాటుమాటుగా ఎవ‌రినో ఒక‌రిని పంపి మందు తెప్పించుకునే వారు. ఇప్పుడు క్యూలో ఉండేందుకు ఎవ్వ‌రూ ఇష్ట‌ప‌డ‌డం లేదు. పోనీ తాము వెళ‌దామంటే అంత‌సేపు క్యూలో ఉండేందుకు ఇబ్బంది తప్ప‌డం లేదు.... ఇది కూడా ఓ చిక్కే. ఇక ప్ర‌భుత్వం తీసుకున్న కొత్త నిర్ణ‌యంతో సివిల్ పోలీసుల‌కు మందు మామూళ్లు వెళ్ల‌డం లేద‌ట‌. దీంతో వారు ఈ విధానంపై గుస్సాతో ఉన్నారు. షాపుల రేంజ్‌ ను బ‌ట్టి ప్ర‌తి నెలా స్టేష‌న్ల‌కు 20 వేల నుంచి ల‌క్ష వ‌ర‌కు మామూళ్లు అందేవి.

ఇప్పుడు అవ‌న్నీ బంద్ అయ్యాయి. అలాగే పోలీసుల‌కు షాపుల నుంచి ప్రీగా వెళ్లే మందు సీసాలు కూడా ఇవ్వ‌డం లేద‌ట‌. దీంతో వాళ్ల బాధ‌లు కూడా మామూలుగా లేవు. ఇటు ఎక్సైజ్ వాళ్ల‌కు మామూళ్లు లేక‌పోవ‌డంతో వారు కూడా బాధ‌ప‌డుతున్నారు. ఇక ఇవ‌న్నీ ఇలా ఉంటే అల‌వాటును త‌ప్పించాల‌నే చిన్న ప్ర‌య‌త్నం మందుబాబుల‌పై భారీగానే ప్ర‌భావం చూపుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News