నవాజ్ షరీఫ్ మంచోడైపోయాడా?

Update: 2015-12-19 10:06 GMT
భారత్ పేరెత్తితే చాలు నోరెత్తే పాకిస్థాన్ నేతలు ఇప్పుడు నోరు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్వయంగా  ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫే భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు వద్దని సూచించడంతో అంతా నోళ్లు కట్టుకుంటున్నారట.  ఇండియాను చూసి పాకిస్థాన్ ఇప్పుడు భయపడుతోందని... అందుకే జాగ్రత్త పడుతోందని అంటున్నారు.

భారత్‌ కు వ్యతిరేకంగా ఎటువంటి విమర్శలు చేయవద్దని పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ తన మంత్రి వర్గానికి సూచించినట్లు తెలియవచ్చింది. భారత్‌- పాక్‌ మధ్య శాంతి సంబంధాలు నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని, జాగ్రత్తగా వ్యవహరించాలని నవాజ్‌ షరీఫ్‌ శుక్రవారం సూచించినట్లు తెలిసింది. ఇరుదేశాల మధ్య వైరాన్ని తగ్గించి, సంబంధాలు పెంపొందేలా వ్యాఖ్యలు చేయాలని కోరినట్లు సమాచారం.

కాగా భారత్-పాక్ ల మధ్య శాంతి ఒప్పందాలపై ముందడుగు వేస్తామని షరీఫ్ ధీమాగా ఉన్నారు. అందుకే ఇరుదేశాల మధ్య వైరాన్ని తగ్గించి, సంబంధాలు పెంపొందేలా వ్యాఖ్యలు చేయాలని, సలహాలు ఇవ్వాలని మంత్రులకు, సన్నిహితులను ఆయన కోరినట్లు సమాచారం. దీనికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. పారిస్ అంతర్జాతీయ వాతావరణ సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్ కలుసుకున్న అనంతరం ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించేందుకు బ్యాంకాక్ లో సమావేశమైన విషయం అందరికీ విదితమే. ఈ నెల 8న జరిగిన హార్ట్ ఆఫ్ ఆసియా సదస్సు కోసం వెళ్లిన విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పాక్ - అఫ్ఘానిస్తాన్ లలో పర్యటించారు. పాక్ మంత్రి సర్తాజ్ అజీజ్ - ప్రధాని షరీఫ్ లతో సమావేశం ఫలితంగా వచ్చే ఏడాది జనవరిలో ఏదైనా తటస్థ వేదికలో చర్చలు జరిగే సూచనలూ ఉన్నాయి. భారత్ - పాక్ దేశాల నేతలు తరచూ భేటీ అవుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటే ఉద్రిక్తతలు తగ్గుతాయని భావించిన షరీప్ ఆ దిశగా సంయమనం పాటించాలని కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

మరోవైపు అంతర్జాతీయంగా భారత్ పరపతి రోజురోజుకూ రెట్టింపవుతోంది. పారిస్ సదస్సులోనూ ఇండియాకు అమెరికా - చైనాలతో సమానంగా ప్రాధాన్యం దక్కింది. అమెరికా - చైనా - జపాన్ వంటి భిన్న ధ్రువాలతో మోడీ ఏకకాలంటో బ్యాలన్సు చేసుకుంటూ అందరితోనూ మంచి సంబంధాలు నెరుపుతుండడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే అమెరికాతో చైనాకు, చైనాతో జపాన్ కు తీవ్ర వైరం ఉంది. కానీ, ఇండియా ఈ మూడు దేశాలతోనూ ఇటీవల కాలంలో మంచి సంబంధాలు ఏర్పరుచుకుంది. మరోవైపు భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వమూ దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అదేసమయంలో ఉగ్రవాద కారణాలతో అమెరికా కూడా పాక్ తో ఇంతకుముందున్నట్లుగా లేదు. వీటన్నిటి నేపథ్యంలో తాను ఏకాకి అవుతున్నట్లుగా పాక్ కు అర్థం కావడంతో పాటు భారత్ లో ఎన్నికలు సమీపించడానికి ముందు రెండు దేశాల మధ్య పరిస్థితులు మారకపోతే పాలక బీజేపీ తమపై యుద్ధానికి దిగి ఎన్నికల్లో లాభపడే ప్రమాదముందని కూడా షరీఫ్ ఆందోళన చెందుతున్నట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. యుద్ధమే వస్తే ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియాను గెలవడం పాక్ తరం కాదు... పైగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఆ దేశానికి అది మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లే. దాంతో వీటన్నిటినీ నివారించడానికి ఇండియాతో సఖ్యత కోరుకుంటుందని చెప్తున్నారు.

అంతేకాకుండా భారత్ బలీయమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది. ఈ క్రమంలో అంతర్జాతీయంగా పరపతి పెంచుకోవడానికి మోడీ చిన్నచిన్నదేశాలకు కూడా లక్షల కోట్లు సాయం చేస్తున్నారు. ఇండియాతో సఖ్యంగా ఉండి అభివృద్ధి విషయంలో సహకారం సంపాదించుకోగలిగే పాకిస్థాన్ బాగుపడుతుందన్న ప్రొగ్రెసివ్ ఆలోచనలు కూడా షరీఫ్ లో కనిపిస్తున్నాయని అంటున్నారు. కారణాలేవైనా సరే.. ఇండియాపై మాటలు విసరొద్దని ఆయన చెప్పడం మాత్రం మంచి పరిణామమే.
Tags:    

Similar News