మహా పరిణామం : బీజేపీ ఎన్సీపీల మధ్య సీబీఐ
ఇక దీని కంటే ముందు సునేత్ర పవార్ అజిత్ పవార్ ఎన్సీపీకి జాతీయ అధ్యక్షురాలిగా నియమితులు అయ్యారు.;
మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త పరిణామం చోటు చేసుకుంది. ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన బాధ్యతలు నిరహిస్తున్న అజిత్ పవార్ జనవరి 28న ఒక విమాన ప్రమాదంలో బారామతి సరిహద్దుల వద్ద దుర్మరణం పాలు అయ్యారు. దాంతో ఒక్కసారిగా మహా రాజకీయాల్లో విషాదం చోటు చేసుకుంది. అయితే అజిత్ పవార్ ఆకస్మిక మృతితో బీజేపీ వ్యూహాత్మకంగా ఆయన సతీమణి సునేత్ర పవార్ ని డిప్యూటీ సీఎం గా చేసింది. అజిత్ పవార్ మరణించిన మూడు రోజుల వ్యవధిలోనే ఈ పరిణామం జరిగింది. దీంతో శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీకి అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీకి మధ్య విలీనం ప్రతిపాదన ఉండే అవకాశాలు దాదాపుగా మూసుకునిపోయినట్లే అని అంతా అనుకున్నారు.
సీబీఐ డిమాండ్ :
అయితే అనూహ్యంగా ఉప ముఖ్యమంత్రి సునేత్ర పవార్ తన పెద్ద కుమారుడు పార్ధు పవార్ ఎన్సెపీఎ నేతలతో ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్ ని కలసి అజిత్ పవార్ మృతి మీద ఎన్నో అనుమానాలు ఉన్నాయని సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరారు. దానికి సీఎం ఫడ్నవీస్ హామీ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని కూడా చెప్పారు.
జాతీయ అధ్యక్షురాలుగా :
ఇక దీని కంటే ముందు సునేత్ర పవార్ అజిత్ పవార్ ఎన్సీపీకి జాతీయ అధ్యక్షురాలిగా నియమితులు అయ్యారు. పార్టీ అంతా కలసి కూర్చుని శరద్ పవార్ ఎన్సీపీ తో విలీనం గురించి ఆలోచిస్తుందని ఆ పార్టీ నేతలు చెప్పడం విశేషం. ఈ నేపధ్యంలోనే సీబీఐ విచారణ డిమాండ్ ని కూడా తెర మీదకు తీసుని వచ్చారు.
ఎన్నో ప్రశ్నలు అంటూ :
ఇక చూస్తే జనవరి 28న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రాణాంతకమైన ప్రమాదానికి కారణాలు ఏమిటి అంటే అనేక ప్రశ్నలు అయితే విన వస్తున్నాయి. ఈ సంఘటన వెనక నిజానిజాలు వెలికి తీయాల్సిన అవసరం ఉందని అజిత్ పవార్ పార్టీ నేతలు అంటున్నారు. ఈ విషయంలో తమ పార్టీతో పాటు అజిత్ పవార్ కుటుంబం కూడా పారదర్శకతను కోరుకుంటోందని చెప్పారు. ఏదైనా కుట్ర కోణం ఉందా అన్న దాని మీద ఉన్నత స్థాయిలో విచారణ అవసరం ఉందని కూడా పేర్కొంది.
రాజకీయంగా కలకలం :
అజిత్ పవార్ పార్టీ నుంచి ఈ తరహా డిమాండ్ రావడం మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ డిమాండ్ కి మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి ఒప్పిస్తే అంతా సవ్యంగానే ఉండొచ్చు. కానీ ఏమైనా తేడా పాడా వస్తే మాత్రం అజిత్ పవార్ ఎన్సీపీ మహారాష్ట్రలోని మహాయతి సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటకు వస్తుందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇప్పటికే రెండు ఎన్సీపీలు కలిస్తే బలమైన పార్టీగా ఉంటుందని అంతా అంటున్నారు. అయితే ఆ ఇబ్బంది లేకుండా బీజేపీ అజిత్ పవార్ సతీమణికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. కానీ అజిత్ పవార్ కుమారుడు పార్ధు పవార్ అయితే తన తాత శరద్ పవార్ ని ఈ మధ్యనే కలసి చర్చలు జరిపారు అని ప్రచారం సాగుతోంది. మొత్తానికి చూస్తే వారూ వీరూ ఒక్కటి అయ్యేందుకు సీబీఐని మధ్యలోకి తెచ్చారా అన్న చర్చ కూడా సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.