ట్రంప్ కు వినపడదా..వినపడనట్లు ఉంటారా?

Update: 2017-03-20 04:50 GMT
చిత్ర విచిత్రంగా వ్యవహరించే విషయంలోఅమెరికా అధ్యక్షుడు ట్రంప్ తర్వాతే ఎవరైనా. ఆయన తీరు..చాలా విలక్షణంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. మర్యాదకు కూడా కొన్నింటిని పాటించకపోవటం కనిపిస్తుంది. అతిధిగా వచ్చిన ఒక దేశాధ్యక్షురాలి విషయంలో ట్రంప్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ..ఎప్పటి మాదిరే కూల్ గా..తనకేం పట్టనట్లుగా వ్యవహరించటం ట్రంప్ కు మాత్రమే చెల్లుతుందేమో. ఈ మధ్యన జర్మనీ చాన్స్ లర్ ఎంజెలా మెర్కెల్ అమెరికా పర్యటనకు వెళ్లారు.

తన పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కలిశారు. వైట్ హౌస్ కు వచ్చిన సందర్భంగా.. ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చిన ట్రంప్..తర్వాత మాత్రం ఇవ్వకుండా ఉండటం వార్తగా మారింది.  వైట్ హౌస్ ఎంట్రీ వద్ద మెర్కెల్ తో కరచాలనం చేసిన ట్రంప్.. ఓవెల్ కార్యాలయంలో మీడియా ముందు మాత్రం కరచాలనం చేసే విషయంలో భిన్నంగా వ్యవహరించటం చర్చనీయాంశమైంది.

షేక్ హ్యాండ్ కోసం మెర్కెల్ సూచనను ట్రంప్ పట్టించుకోవటంపై తాజాగా వైట్ హౌస్ స్పందించింది. అధ్యక్షుల వారు.. మోర్కెల్ మాటను విని ఉండకపోవచ్చని అభిప్రాయపడింది.ఇంటికి వచ్చిన అతిధిని ఆదరించే విషయంలో ప్రతిది జాగ్రత్తగా చూసుకోవటం మామూలే.

దీనికి భిన్నంగా ట్రంప్ తీరు ఉండటం చూస్తే.. జర్మనీ ఛాన్స్ లర్ సూచనను నిజంగానే వినలేదా? వినిపించనట్లు ఉండిపోయారా? అన్న డౌట్ రాకమానదు. ఇదిలా ఉంటే..ట్రంప్.. మెర్కెల్ మధ్య 30 నిమిషాల పాటు చర్చలు జరిగినా.. ట్రంప్ ఒక్కసారి కూడా తమ అధ్యక్షురాలి కళ్లల్లోకి చూసి మాట్లాడలేదన్న విషయాన్ని జర్మనీమీడియా సంస్థ ఒకటి ప్రస్తావించటం గమనార్హం. ఇంతకీ.. మెర్కెల్ కు ట్రంప్ కరచాలనం ఎందుకు చేయలేదన్న విషయంపై మాత్రం వైట్ హౌస్ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News