ఐపీఎల్లో షాక్.. దినేష్ కార్తీక్ సంచలన నిర్ణయం

Update: 2020-10-16 14:10 GMT
కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేష్ కార్తీక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని అతను నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నైట్ రైడర్స్ యాజమాన్యం కూడా అతడి స్థానంలో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కు బాధ్యతలు అప్పగించాలని చూస్తోందని తెలుస్తోంది. కోల్ కతా జట్టుకు అంతకు ముందు కెప్టెన్ గా ఉన్న గౌతం గంభీర్ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. రెండు ట్రోఫీలు కూడా గెలిచాడు. అతడి నుంచి సారథ్య బాధ్యతలు తీసుకున్న దినేష్ కార్తీక్ కెప్టెన్ గానే కాకుండా ఆటగాడిగా కూడా విఫలం అవుతున్నాడు. ఈ సీజన్లో కోల్ కతా అనుకున్నంత స్థాయిలో రాణించడం లేదు. ఇప్పటి వరకూ ఏడు మ్యాచ్ లు ఆడి నాలుగు మాత్రమే గెలిచింది. అందుకు దినేష్ కార్తీకే కారణం అని మాజీ ఆటగాళ్లు, క్రికెట్ అభిమానులు విమర్శిస్తున్నారు.ఈ సీజన్లో ఇప్పటి వరకు 7 మ్యాచ్ లు ఆడిన కార్తీక్ 108 పరుగులు మాత్రమే చేశాడు.

కెప్టెన్ గా ముందుండి నడిపించాల్సిన కీలక సమయంలో దినేష్ 1, 2 పరుగులు చేసి అవుట్ అవుతున్నాడు. అటు కెప్టెన్ గా కూడా విఫలమవుతున్నాడు. పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోలేక పోతున్నాడు. జట్టు కూర్పు అసలు ఏమాత్రం బాగుండటం లేదు. నరైన్ వరుసగా విఫలమవుతున్నా అతడిని ఓపెనర్ గా పంపుతున్నాడు. ఇంగ్లాండ్ కు వరల్డ్ కప్ అందించిన ఇయాన్ మోర్గాన్ వంటి సీనియర్ బ్యాట్స్ మెన్ జట్టులో ఉన్నా అతడిని ఆరు లేదా ఏడో స్థానంలో బ్యాటింగ్ కు పంపుతూ తను మాత్రం ముందే వస్తున్నాడు. రాహుల్ త్రిపాఠి వంటి స్పెషలిస్ట్ బ్యాట్స్ మెన్ ఉన్నా అతడిని కూడా చివర్లో పంపడం పై విమర్శలు వచ్చాయి. కోల్ కతా జట్టు కెప్టెన్ మార్చాలని క్రికెట్ అభిమానులు చాన్నాళ్లుగా కోరుతూ వస్తున్నారు. దినేష్ నిర్ణయంతో కోల్ కతా యాజమాన్యం మోర్గాన్ కు సారధ్య బాధ్యతలు అప్పగించేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. మరి కొత్త కెప్టెన్ హయాంలో అయినా కోల్ కతా నైట్ రైడర్స్ తలరాత మారి ప్లే ఆప్స్ కు చేరుతుందేమో చూడాలి.
Tags:    

Similar News