ఆ కేసులో నేను దర్శకుడిని కాను

Update: 2015-06-30 11:04 GMT
    బొగ్గుపులి... కేంద్ర మాజీ మంత్రి, తెలుగు సినీ దర్శకనిర్మాత దాసరి నారాయణ రావు ఢిల్లీలోని సిబిఐ కోర్టులో తన అమాయకత్వాన్ని ప్రదర్శించుకునే ప్రయత్నం చేశారు. బొగ్గు కేసులో కోర్టుకు హాజరైన ఆయన .. ఈ కుంభకోణంలో తన ప్రమేయం ఏమీ లేదని కోర్టుకు తెలిపారు. తాను కేవలం సహాయ మంత్రిగా మాత్రమే ఉన్నానని, అప్పటి నిర్ణయాలన్నీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగే తీసుకున్నారని ఆయన చెప్పారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ బొగ్గు మంత్రిత్వ శాఖ ఇంచార్జీగా ఉన్నారని, అందువల్ల ఆయనే నిర్ణయాలు తీసుకున్నారని దాసరి చెప్పారు.

 బ్లాక్‌లను కేటాయించే అధికారమంతా బొగ్గు శాఖ మంత్రిగా మన్మోహన్ కే ఉండేదని... తాను ఒక్క కేటాయింపూ చేయలేదని చెప్పుకొచ్చారు. జార్ఖండ్‌లోని అమరుకొండ ముర్గా దుంగల్‌ బొగ్గు క్షేత్రాల కేటాయింపు కేసులో దాసరితో పాటు మొత్తం 14 మందిపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. జార్ఖండ్‌ మాజీ సీఎం మధుకోడా, పారిశ్రామిక వేత్త నవీన్‌ జిందాల్‌, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి ఎస్సీ గుప్తాల్‌పై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. దాసరి నారాయణరావుతో పాటు 14 మందికి కూడా సిబిఐ ప్రత్యేక కోర్టు ఇది వరకే బెయిల్ మంజూరు చేసింది. అయితే... ఈ కేసులో ఒకరకంగా ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉన్న దాసరి కొద్దికాలంగా దీనిలోని మాజీ ప్రధాని మన్మోహన్ ను పూర్తిస్థాయిలో లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిసారీ ఆయన మన్మోహనే బాధ్యుడంటూ బలంగా వాదిస్తున్నారు. మన్మోహన్ ను పూర్తిగా ఇరికిస్తే ఆయనతో పాటు తానూ బయటపడే అవకాశాలు ఎక్కువవుతాయన్న ఉద్దేశంతో ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని పలువురు అంటున్నారు.

Tags:    

Similar News