ప్రాణత్యాగానికి కూడా రెడీనట-మరి మిగిలిన వాళ్ళు కూడా ....

Update: 2020-12-18 06:00 GMT
అమరావతి రాజధానిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన ప్రకటన చేశారు. అమరావతిని రాజధానిగా ఉంచేందుకు అవసరమైతే తన ప్రాణాలను కూడా త్యాగం చేయటానికి రెడీ అంటు ప్రకటించారు. రైతుల పక్షాన పోరాటం చేసి ప్రాణాలు విడిచేయటానికి కూడా సిద్దంగా ఉన్నట్లు చెప్పటం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. ఆశ్చర్యం ఎందుకంటే  ప్రతి ఒక్కళ్ళు ప్రాణత్యాగానికి సిద్ధమని ప్రకటించేవాళ్ళే కానీ ఆపని మాత్రం ఇంతవరకు ఎవరు చేయలేదు.

అంటే అమరావతి కోసం ప్రాణాలు విడిచేయాలన్నది అభిమతం కాదు. కనీసం ఆ దిశగా ప్రభుత్వాన్ని లొంగదీసుకోవటానికి ప్రయత్నాలు కూడా జరగలేదే ? ప్రాణత్యాగం చేయటానికి రెడీగా ఉన్నామని ప్రకటించేవాళ్ళు కనీసం ఆమరణ నిరాహార దీక్షకైనా కూర్చోవచ్చు కదా ? ఒకళ్ళు కూర్చుంటే మిగిలిన వాళ్ళల్లో స్పూర్తి రగిలి వాళ్ళు కూడా దీక్షలకు దిగే అవకాశం ఉంది. ఎన్ని రోజులైనా రైతులు ఉద్యమం చేస్తుంటే ప్రభుత్వం దిగిరావటం లేదు.

రైతులు, స్ధానికుల ఉద్యమం అంటే ఏదో 10 రోజు 50 రోజు లేకపోతే 100వ రోజు అని చెప్పుకోవటానికి మాత్రమే పనికొచ్చింది. తాజాగా బహిరంగసభ జరిగిన సందర్భం కూడా 365 రోజులు పూర్తయ్యిందనే జరిగింది. ఇలాంటి బహిరంగసభలు ఎన్ని జరిగినా ప్రభుత్వం కనీసం తొంగికూడా అటువైపు చూడదు. ఎందుకంటే జరుగుతున్న ఉద్యమం అంతా పెయిడ్ ఉద్యమం అనే అభిప్రాయం ప్రభుత్వంలో ఉంది కాబట్టి.

జరుగుతున్నది పెయిడ్ ఉద్యమం కాదు నికార్సయిన ఉద్యమం అని ప్రభుత్వానికి తెలియాలంటే నారాయణ వెంటనే ఆమరణ నిరాహారదీక్ష మొదలుపెట్టాలి. నారాయణకు మద్దతుగా మిగిలిన పార్టీలు అంటే టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం నుండి కూడా కీలక నేతలు రంగంలోకి దిగాలి. అప్పుడే ప్రభుత్వానికి ఉద్యమసెగ తగులుతుంది. నూతన వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాలు ఢిల్లీ సరిహద్దుల్లో కేంద్రానికి ఎలా చెమటలు పట్టిస్తోందో చూస్తున్నారు కదా. అలాంటి ఉద్యమం జరిగినపుడే జగన్మోహన్ రెడ్డికి కూడా వేడి తగులుతుంది. ఆ వేడి ఎర్నన్న నారాయణ ఆమరణ నిరాహార దీక్షతోనే మొదలుకావాలి.
Tags:    

Similar News