పవన్ తో బతికేద్దామనుకుంటున్నారా కామ్రేడ్?

Update: 2016-08-31 05:26 GMT
కొంత మంది రాజకీయ ప్రముఖుల తీరు భిన్నంగా ఉంటుంది. ప్రజా సమస్యలపై ఫోకస్ కంటే కూడా రాజకీయం మీదనే ఎక్కువ దృష్టి పెడుతుంటారు. నలుగురి నోళ్లలో నానే అంశాల మీదన దృష్టి సారిస్తుంటారు. ఘాటైన విమర్శలు చేస్తూ.. ప్రతిదీ రంధ్రాన్వేషణ చేసే ఈ తీరుకు మీడియాలోనూ ఎక్కువగా కనిపించే అవకాశం ఉండటంతో పోరాటాలు మానేసి.. ఎవరో ఒకరి మీద పడిపోవటం ఒక అలవాటుగా మారిన పరిస్థితి. ప్రజా ఉద్యమాలు చేస్తున్నట్లుగా తరచూ వ్యాఖ్యలు చేసే సీపీఐ నారాయణ ముచ్చటే చూస్తే.. ఆయన చేసిన ప్రజా ఉద్యమాల కంటే కూడా నోరు పారేసుకోవటమే ఎక్కువగా కనిపిస్తుంటుంది.

తిరుపతిలో పవన్ కల్యాణ్ నిర్వహించిన బహిరంగ సభపై ఘాటుగా విమర్శలు చేసి మీడియా దృష్టిని ఆకర్షించిన నారాయణ.. ఆ తర్వాత నుంచి క్రమం తప్పకుండా ఏదో ఒక అంశాన్ని ప్రస్తావించటం కనిపిస్తుంది. నిత్యం పవన్ మీద ఏదో ఒక వ్యాఖ్య చేసే ఆయన తీరును చూస్తే.. పవన్ కల్యాణ్ ను ప్రశాంతంగా ఉండనివ్వరా? అన్నసందేహం కలగక మానదు.

జనసేన అధినేతకు చేతనైతే పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావాలని సూచించారు. లేదంటే.. రజనీకాంత్ లా పరిమితం కావాలన్న ఆయన.. పవన్ కల్యాణ్ లో వామపక్ష భావాలున్నాయన్న విషయాన్ని ఒప్పుకుంటూనే.. అయితే నడకలో తడబడుతున్నట్లగా అభివర్ణించారు. పవన్ కల్యాణ్ సరైన దిశలోకి వెళ్తే.. మూడో ప్రత్యామ్నాయ దిశగా ఎదిగే అవకాశం ఉందన్న జోస్యం చెప్పిన నారాయణ.. ఈ అంశంపై అవసరమైతే చర్చలకుసిద్ధమని చెప్పటం గమనార్హం.

నిత్యం తీవ్రంగా విరుచుకుపడుతూనే.. తృతీయ పక్షానికి పవన్ ఓకే అంటే చర్చలు జరుపుతానని చెప్పటంలో అర్థం ఏమిటో నారాయణకే తెలియాలి. పవన్ మాట్లాడే ప్రతి మాటలోనూ తప్పులు వెతికే నారాయణ.. తమకు అనుకూలమైన తృతీయ పక్షంగా పవన్ పావులు కదిపితే తాము చేతులు కలిపే అంశాన్ని ఆలోచిస్తామన్నట్లుగా చెప్పటం చూస్తే.. నారాయణ వ్యూహం ఏమిటో ఇట్టే అర్థం కాక మానదు. గడిచిన కొన్నేళ్లుగా వామపక్ష పార్టీలకు ప్రజాదరణ ఎంతన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇలాంటి వేళ.. జాతీయ స్థాయి సంగతిని పక్కన పెడితే..తెలుగు రాష్ట్రాల్లో  పవన్ పుణ్యమా అని బతికేద్దామన్నట్లుగా నారాయణ మాటలు ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఓ రాజకీయ అజ్ఞాని అని నారాయ‌ణ  విమ‌ర్శించారు. జగన్‌ ను సైతం పార్టీలో చేర్చుకుంటానడం లోకేష్ అవివేకానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదానే 2019 ఎన్నికలకు ప్రధాన ఎజెండాగా ఉంటుందని జోస్యం చెప్పారు.

పవన్ ను ఫుల్ టైం రాజకీయ నాయకుడిగా మారాలంటూ నారాయణ చేస్తున్న వ్యాఖ్యలు చూసినప్పుడు.. పూర్తిస్థాయి రాజకీయాలు చేసి నారాయణ సాధించిందేమిటన్న ప్రశ్న తలెత్తక మానదు. రాష్ట్ర విభజన మొదలు.. ఏపీకిప్రత్యేక హోదా అంశం వరకూ ఒక్కటంటే ఒక్క  అంశంపై పోరాటం చేయని నారాయణ లాంటోళ్లు.. ఏదో ఒకటి చేద్దామన్న ఉత్సాహంతో ముందుకు వచ్చే పవన్ లాంటోళ్లపై విమర్శనాస్త్రాలు ఎక్కు పెడుతున్న వైనం చూస్తే.. అమ్మ పెట్టా పెట్టదు.. అడక్క తిననీయదన్న సామెత గుర్తుకు రావటం ఖాయం. పవన్ మీద నిత్యం ఏదో ఒకటి మాట్లాడే బదులు.. ఓపిగ్గా కొంతకాలం ఎదురు చూడొచ్చుగా నారాయణ అన్న కామెంట్ ను పలువురు వ్యక్తం చేయటం కనిపిస్తోంది.
Tags:    

Similar News