వైసీపీలో కొత్త అధికార కేంద్రం...జగన్ ప్లాన్ అదేనా ?

వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీలో సంస్థాగతంగా భారీ మార్పులు చేయాలని చూస్తున్నారు అని ప్రచారం సాగుతోంది.;

Update: 2026-01-21 10:30 GMT

వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీలో సంస్థాగతంగా భారీ మార్పులు చేయాలని చూస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. వైసీపీ అంటే ఇప్పటిదాకా వైఎస్ జగన్ మాత్రమే అన్న భావన ఉంది. దానిని మారి పార్టీలో కొత్త ముఖాలను పరిచయం చేయాలని ఆయన ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. అంతే కాదు వైసీపీలో కొత్త అధికార కేంద్రం. సృష్టించాలని కూడా జగన్ తీవ్రంగా చర్చిస్తున్నారు అని అంటున్నారు.

వర్కింగ్ ప్రెసిడెంట్ గా :

వైసీపీ ప్రాంతీయ పార్టీగా ఉంది. అయితే తెలంగాణాలో ఆ పార్టీ అభిమానులు ఉన్నా పోటీ చేయడం లేదు, 2014 తరువాత వైసీపీ ఆ వైపు చూడడం మానుకుంది. కానీ జగన్ ని జాతీయ అధ్యక్షుడిగానే పార్టీలో సంభోదిస్తారు. ఈ నేపధ్యంలో వైసీపీలో కొత్త పదవిని ఒకటి క్రియేట్ చేయాలని చూస్తున్నారుట. ఆ పదవి పేరు వర్కింగ్ ప్రెసిడెంట్. అంటే వైసీపీకి సర్వాధికారిగా జగన్ ఉంటారు. కానీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అన్న పదవిని ఏర్పాటు చేస్తే దైనందిన కార్యక్రమాలు అన్నీ ఆయన చేతుల మీద జరిపించాలని చూస్తున్నారు అని అంటున్నారు.

బీసీ ముద్ర కోసం :

వైసీపీకి 40 శాతం ఓటు బ్యాంక్ ఉంది. ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు ఆ పార్టీకి మద్దతుగా ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో గెలవాలి అంటే ఈ 40 శాతం సరిపోదు, మరో అయిదారు శాతం ఓటింగ్ కలవాల్సి ఉంది. బీసీల కోసం 2024 ఎన్నికల్లో వైసీపీ వేసిన ప్లాన్స్ అన్నీ బెడిసి కొట్టాయి. అత్యధిక శాతం వారు టీడీపీకి అండగా ఉంటున్నారు టీడీపీ కూడా బీసీలకు పెద్ద పీట వేస్తోంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉంటున్నారు. ఏపీకి సంబంధించి పల్లా శ్రీనివాస్ ని నియమించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి ఉత్తరాంధ్ర వారికే గతంలోనూ టీడీపీ ఈ విధంగా ఏపీ ప్రెసిడెంట్ పదవులు ఇస్తూ వచ్చింది. ఇపుడు ఇదే ఫార్ములాను వైసీపీ ఫాలో అవుతుందని అంటున్నారు. పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని క్రియేట్ చేసి ఉత్తరాంధ్ర కు చెందిన సీనియర్ బీసీ నాయకుడికి ఆ పదవి ఇవ్వాలని అనుకుంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది.

ధర్మానకు చాన్స్ :

వైసీపీలో సబ్జెక్ట్ మీద అనర్గళంగా మాట్లాడే నేర్పు ఉన్న వారిగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుని చెప్పుకుంటారు. ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయరు, ప్రభుత్వం చేసే తప్పులను ఆయన బాగా ఎత్తి చూపుతారు. అంతే కాదు సూటిగా సుత్తి లేకుండా ఏమి చేయాలో అదే చెబుతారు. ఎక్కడా డైవర్ట్ కాదు, ప్రతీదీ రికార్డులు చూసి మరీ చెబుతారు. దాంతో ఆయనను ఈ కీలక పదవికి ఎంపిక చేయడం ద్వారా టీడీపీ కూటమి మీద ప్రయోగించాలని జగన్ చూస్తున్నారు అని అంటున్నారు

రాజకీయ మైలేజ్ :

ఇక ఉత్తరాంధ్రా జిల్లాలు అన్నీ కూడా బీసీలతో ఎక్కువగా ఉన్నాయి. నూటికి ఎనభై శాతం వారే ఉంటారు. అంతే కాదు 34 అసెంబ్లీ సీట్లు ఇక్కడ ఉన్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఉత్తరాంధ్రా ఓట్లూ సీట్లే కీలకంగా మారుతున్నాయి. దాంతో జగన్ కూడా బీసీ నినాదంతో ఉత్తరాంధ్రా మీద ఫోకస్ చేశారు అని అంటున్నారు. ఈ క్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ధర్మాన ప్రసాదరావుని తొందరలో నియమిస్తారు అని అంటున్నారు. రేపటి రోజున జగన్ పాదయాత్ర చేసినా పార్టీ తరఫున గట్టిగా మాట్లాడేందుకు అందరినీ కో ఆర్డినేట్ చేసుకునేందుకు ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇక ఇప్పటికే ఉత్తరాంధ్రాకు చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడి పదవిని ఇచ్చి కేబినెట్ ర్యాంక్ హోదా అవకాశం కల్పించిన జగన్ మరో సీనియర్ బీసీ నేతకు కూడా పార్టీ తరఫున ఉన్నత స్థానం కల్పించడం ద్వారా బీసీల మద్దతు చూరగొనే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారం ఎపుడు వాస్తవ రూపం దాలుస్తుందో.

Tags:    

Similar News