విమానాల మంత్రి మనోడే.. విశాఖకు ఫ్లైట్ సర్వీసుల్లో మహా కోత
పేరుకు ఆరు ఎయిర్ పోర్టులు ఆంధ్రప్రదేశ్ కు ఉన్నాయి. వీటిల్లో రెండు (విశాఖ, విజయవాడ) ఎయిర్ పోర్టులు మాత్రమే అంతర్జాతీయ విమానాశ్రయాలు.;
పేరుకు ఆరు ఎయిర్ పోర్టులు ఆంధ్రప్రదేశ్ కు ఉన్నాయి. వీటిల్లో రెండు (విశాఖ, విజయవాడ) ఎయిర్ పోర్టులు మాత్రమే అంతర్జాతీయ విమానాశ్రయాలు. మిగిలినవి దేశీయ విమానాశ్రయాలు. ఇవి కాక నెల్లూరు.. భోగాపురం ప్రాంతాల్లో కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణం సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మొత్తం విమానాశ్రయాల్లో ఐటీ పరంగా.. పారిశ్రామికంగా.. వాణిజ్యపరంగా డెవలప్ అవుతూ.. వివిధ నగరాలతో రాకపోకలు సాగించే నెట్ వర్కు ఉన్న ఎయిర్ పోర్టు విశాఖ. గణాంకాల్ని గమనిస్తే.. ప్రయాణికుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో డిమాండ్ కు తగ్గట్లు విమాన సర్వీసుల సంఖ్య పెంచాల్సి ఉంది. కొత్త విమానాలు రావాల్సి ఉంది.
సిత్రంగా కొత్త విమాన సర్వీసులు రావటం తర్వాత.. ఉన్న విమాన సర్వీసుల్లో కోత పెడుతున్న వైనం ఇప్పుడు షాకిచ్చేలా మారింది. కేంద్ర పౌర విమానాయాన శాఖా మంత్రి రామ్మోహన్ నాయుడు ఏపీకి చెందిన వ్యక్తే. అందునా ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తి. అయినప్పటికీ విశాఖకు జరుగుతున్న నష్టం జరుగుతూనే ఉంది తప్పించి..కించిత్ లాభం జరగటం లేదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
రద్దీ ఉన్నప్పటికీ ఫుణె.. గోవా.. కౌలాలంపూర్.. బ్యాంకాక్ సర్వీసులు విశాఖ నుంచి నిలిచిపోయాయి. తాజాగా అండమాన్ నికోబార్ ప్రాంతంలోని పోర్టుబ్లెయిర్ (శ్రీ విజయపురం) విమాన సర్వీసును నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది. పోర్టుబ్లెయిర్ కు దాదాపు పదమూడేళ్ల నుంచి ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ సర్వీసుల్ని నడుపుతోంది. ప్రస్తుతం వారానికి రెండు రోజులు (మంగళ, గురు) విశాఖ నుంచి నేరుగా సర్వీసులు నడుస్తున్నాయి. వేసవి సెలవులు అనంతరం అంటే ‘మే’ నుంచి టికెట్లు అందుబాటులో లేవు. అంటే.. ఇక్కడకు సదరు విమాన సర్వీసు నిలిపేయనున్నట్లుగా చెబుతున్నారు.
గతంలో విశాఖ - ముంబయి మధ్య రోజుకు రెండు సర్వీసులు నడిచేవి. కొద్ది నెలల క్రితం ఆ సర్వీసును నిలిపేశారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి ఒక సర్వీసు మాత్రమే నడుస్తోంది. గతంలో విశాఖ నుంచి గోవా.. ఫుణెలకు సర్వీసులు నడిచేవి. ఆ రెండు సర్వీసులకు సంబంధించి బుకింగ్ ఆక్యుపెన్సీ 80-90 శాతం వరకు ఉండేది. 2024 జనవరిలో గోవా.. అదే ఏడాది అక్టోబరులో ఫుణె సర్వీసు నిలిచిపోయాయి. గతంలో మలేషియా రాజధాని కౌలాలంపూర్, థాయిలాండ్ లోని బ్యాంకాక్ కు డైరెక్ట్ ఫ్లైట్లు ఉండేవి. గత ఏడాది మే నుంచి వాటికి మంగళం పాడేశారు. డీజీసీఏ గణాంకాల ప్రకారం చూసినప్పుడు ఆక్యుపెన్సీ బాగానే ఉన్నా.. సర్వీసుల్లో మాత్రం ఒకటి తర్వాత ఒకటి చొప్పున తగ్గిస్తున్న వైనం విశాఖకు పెను ముప్పుగా మారింది. రానున్న రోజుల్లో భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి కార్యకలాపాలు సాగించాలని ప్లాన్ చేస్తున్న వేళ.. విశాఖతో పోలిస్తే ఎంతో పెద్దదైన ఎయిర్ పోర్టు అందుబాటులోకి వచ్చే వీలున్నా.. సర్వీసులు తగ్గిపోతే ప్రయోజనం ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు ఈ అంశంపై కాస్తంత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.