హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. కరోనాను 5 రోజుల్లో ఖతం చేసే ట్యాబ్లెట్ తొలుత ఇక్కడే

Update: 2021-12-31 23:30 GMT
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా.. ఇప్పుడు వేర్వేరు రూపాల్లో విరుచుకుపడటం తెలిసిందే. గడిచిన కొద్ది నెలలుగా ఎదురుచూస్తున్న మూడో వేవ్ వచ్చేసిందన్న మాట వినిపిస్తున్న వేళ.. కరోనాను ఐదంటే ఐదు రోజుల్లో ఖతం పట్టించే కీలక ఔషధం ఒకటి మార్కెట్లోకి వచ్చేయనుంది. దేశంలో మరే నగరంలోనూ లేని విధంగా.. ఈ ట్యాబ్లెట్ ఫార్మాట్ ను తొలుత హైదరాబాద్ లోనే అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఈ యాంటీ వైరల్ డ్రగ్ కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇవ్వటం తెలిసిందే. దేశంలో ఈ ట్యాబ్లెట్లను తయారు చేసేందుకు 13 కంపెనీలు అనుమతి పొందగా.. అందులో ఆరు ఫార్మా కంపెనీలు హైదరాబాద్ కు చెందినవే కావటం గమనార్హం. ఈ ట్యాబ్లెట్లను హైదరాబాద్ లో అందుబాటులోకి తీసుకొచ్చేశారు. మోల్నుపిరావిర్‌ని ఇండియాలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అనుమతి పొందిన సంస్థల్లో ఒకటి ఆప్టిమస్.

ఈ సంస్థ మోల్నుపిరావిర్‌ ట్యాబ్లెట్ ను ''మోల్ కోవిర్'' పేరుతో ట్యాబ్లెట్లను తయారు చేసింది. వీటిని గురువారం హైదరాబాద్ మార్కెట్లోకి రిలీజ్ చేశారు. ఈ ట్యాబ్లెట్లు దేశంలో మరెక్కడా లభించవు. తొలుత హైదరాబాద్ మహానగరంలోనే అందుబాటులోకి తీసుకొచ్చారు. జనవరి 3 నుంచి మిగిలిన నగరాల్లో క్రమంగా విడుదల చేస్తామని కంపెనీ ప్రకటించింది. ఇదిలా ఉంటే.. మోల్నుపిరావిర్‌ ట్యాబ్లెట్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు మిగిలిన కంపెనీలు సైతం యుద్ద ప్రాతిపదికన పని చేస్తున్నాయి.

కీలకమైన థర్డ్ వేవ్ వచ్చేసిందన్న వేళ.. దానికి విరుగుడుగా పని చేసే మోల్నుపిరావిర్‌ ట్యాబ్లెట్లు అందుబాటులోకి రావటం రిలీఫ్ కలిగించే అంశంగా చెబుతున్నారు. ఈ ట్యాబ్లెట్ తో కొవిడ్ లో అత్యంత ప్రమాదకరమైన వేరియంట్ గా చెబుతున్న ఒమిక్రాన్ కు సైతం చెక్ పెట్టేస్తుందని చెబుతున్నారు. థర్డ్ వేవ్ వేళ.. అందుబాటులోకి వచ్చిన మోల్నుపిరావిర్‌ భాగ్యనగర వాసులకు వరంగా మారిందని చెప్పక తప్పదు. ఆ మాటకు వస్తే.. దేశ ప్రజలకు కూడా మేలు కలిగిస్తుందనే చెప్పాలి. కాకుంటే.. కాస్తంత ఆలస్యంగా.
Tags:    

Similar News