ట్రైనింగ్ డేటా వివాదం: AI కంపెనీలు ఎక్కడ గీత దాటుతున్నాయి?
AI మోడల్ క్లాడ్ సృష్టికర్త అయిన ఆంత్రోపిక్ సంస్థ తాజాగా సంచలన విషయాలు వెల్లడించింది.;
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో ఇప్పుడు ఒకరి మీద ఒకరు నిప్పులు చెరుగుకుంటున్నారు. తమ మేధో సంపత్తిని ఇతరులు దొంగిలిస్తున్నారని ఆంత్రోపిక్ వంటి దిగ్గజ సంస్థలు ఆరోపిస్తుంటే, అదే సమయంలో ఆ కంపెనీలు కూడా ఇతరుల డేటాను కాపీ కొట్టాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. వేల సంఖ్యలో ఫేక్ అకౌంట్లు సృష్టించి, లక్షలాది సంభాషణల ద్వారా మోడల్స్‌ను కాపీ కొట్టే 'డిస్టిలేషన్ అటాక్స్' ఇప్పుడు టెక్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
దొంగలు పడ్డారు.. 16 మిలియన్ల సంభాషణలు మాయం:
AI మోడల్ క్లాడ్ సృష్టికర్త అయిన ఆంత్రోపిక్ సంస్థ తాజాగా సంచలన విషయాలు వెల్లడించింది. డీప్‌సీక్ మూన్‌షాట్ AI, మరియు మినిమాక్స్ వంటి ల్యాబ్‌లు తమ డేటాను దొంగిలించాయని ఆరోపించింది. ఇక వీరు సుమారు 24,000 ఫేక్ అకౌంట్లు సృష్టించి, క్లాడ్ మోడల్‌తో 16 మిలియన్లకు పైగా చాటింగ్ చేసి, ఆ సమాచారాన్ని తమ సొంత మోడల్స్‌ను ట్రైన్ చేయడానికి వాడుకున్నారని తెలిసింది. అంటే, ఒకరు ఎంతో కష్టపడి తయారు చేసిన 'మేధస్సు'ను ఇతరులు షార్ట్‌కట్ పద్ధతిలో కాపీ కొడుతున్నారన్నమాట.
మరోవైపు ఆంత్రోపిక్ మీద కూడా ఆరోపణల వర్షం:
అయితే, ఇతరులను వేలెత్తి చూపుతున్న ఆంత్రోపిక్ సంస్థ కూడా పక్కాగా ఏమీ లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజా 'కమ్యూనిటీ నోట్స్' ప్రకారం, ఆంత్రోపిక్ కూడా తన AI మోడల్స్‌ను ట్రైన్ చేయడానికి ఇతరుల డేటాను దొంగిలించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇక ఈ విషయంలో ఆ కంపెనీ భారీ జరిమానాలు మరియు బిలియన్ డాలర్ల సెటిల్మెంట్లు కూడా చెల్లించాల్సి వచ్చిందని కొందరు గుర్తు చేస్తున్నారు. "ఒకరు దొంగతనం చేస్తే తప్పు.. మరి మీరు చేసింది ఏంటి?" అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు.
ఎవరిది తప్పు? డేటా యుద్ధంలో గెలిచేది ఎవరు?:
AI కంపెనీల మధ్య సాగుతున్న ఈ యుద్ధం ఇప్పుడు "దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు" తయారైంది. ఇక ఒక పక్క తమ కంటెంట్‌ను కాపీ చేస్తున్నారని రైటర్లు, ఆర్టిస్టులు కోర్టుకెక్కుతుంటే, మరోపక్క AI కంపెనీలు ఒకరి డేటాను ఒకరు దొంగిలించుకుంటున్నాయి. ఈ గందరగోళంలో నైతిక విలువల గీత ఎక్కడ ఉందో ఎవరికీ అర్థం కావడం లేదు. డేటా ప్రైవసీ మరియు కాపీరైట్ చట్టాలు మరింత పటిష్టంగా ఉండకపోతే, భవిష్యత్తులో ఈ 'టెక్ వార్' మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది.
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఇలాంటి డేటా వివాదాలు రావడం సహజమే. అయితే, ఏ కంపెనీ అయినా వినియోగదారుల నమ్మకాన్ని, చట్టాలను గౌరవించినప్పుడే సుస్థిరమైన ఎదుగుదల సాధ్యమవుతుంది.