ఏఐ ఇంపాక్ట్ : ఇండియా కూటమిలో కాంగ్రెస్ ఒంటరి
కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఆలోచనలు అలా ఉన్నాయా లేక పార్టీ మీద పట్టు జారుతోందా అన్నాది చర్చగా ఉంది.;
కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఆలోచనలు అలా ఉన్నాయా లేక పార్టీ మీద పట్టు జారుతోందా అన్నాది చర్చగా ఉంది. లేకపోతే ప్రపంచ దేశాలు అన్నీ 70 దాకా హాజరైన ఏఇ ఇంపాక్ట్ అంతర్జాతీయ సదస్సు ముందు యువజన కాంగ్రెస్ నేతలు అర్ధ నగ్న ప్రదర్శనలు ఇవ్వడమేంటి. సమస్యలు ఉంటే దానికి నిరసనలు తెలిపే కార్యక్రమం వేరేగా ఉంటుంది. అలాగే ఎన్నో వేదికలు ఉన్నాయి. కానీ దేశానికే ప్రతిష్టగా ప్రపంచమంతా అతిధిదులుగా వచ్చిన సమయంలో ఏఐ ఇంపాక్ట్ సదస్సు వద్ద కాంగ్రెస్ నేతలు నిరసన చేయడం పట్ల బీజేపీ అయితే గట్టిగానే విమర్శించింది. ఎన్డీయే మిత్ర పక్షాలు అయితే ఘాటుగానే కామెంట్స్ చేసాయి. ఇపుడు ఇండియా కూటమిలో కాంగ్రెస్ మిత్రుల వంతుగా ఉంది. ఆ పార్టీలు అయితే కాంగ్రెస్ ని ఏ మాత్రం వెనకేసుకుని రాలేదు. తప్పుని తప్పుగనే చెప్పి తన వైఖరి స్పష్టంగా చాటుకున్నాయి.
ఈ తీరు సరికాదు :
కాంగ్రెస్ పార్టీ నేతలు ఏఐ ఇంపాక్ట్ వేదిక వద్ద నిర్వహించిన నిరసన అన్నది సరికాదు అని ఇండియా కూటమి మిత్రులే విమర్శించడం ఇపుడు రాజకీయంగా చర్చగా మారింది. ప్రపంచ వేదికలను చూసుకోవాలి కదా అని అంటున్నారు. అలాంటి కార్యక్రమాలు జరిగినపుడు ఏ పార్టీ అయినా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మిత్ర పక్షాలు కాంగ్రెస్ కే సూచించడం విశేషం. అంతే కాదు నిరసన తెలిపే హక్కు ఉంది కదా అని ఏ వేదిక అయినా చేస్తామంటే కుదరదు అని కూడా మిత్రులు హితవు పలికారు.
ఇది మంచిది కాదు :
అంతర్జాతీయ కార్యక్రమాలు దేశంలో జరిగినపుడు అంతా ఒక్కటిగా కనిపించాలని అలాంటి చోట్ల రాజకీయాలు ప్రస్తావన రాకూడదని కాంగ్రెస్ కి చెందిన కేంద్ర మాజీ మంత్రి మార్గరేట్ అల్వా చెప్పడం విశేషం. నిరసన తెలిపే హక్కు ఉంది అని ఎక్కడ పడితే అక్కడ చేస్తారా అని అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో సీనియర్ నేత కూడా వ్యాఖ్యానించడం ద్వారా కాంగ్రెస్ తీరుని తప్పుపట్టారు.
అంగీకరించమంటూ :
ఇక అంతర్జాతీయ వేదికల వద్ద నిరసనలు ఎవరు చేపట్టినా తప్పు అని తాము అలాంటివి అంగీకరించేది ఉండదని యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అయిన అఖిలేష్ యాదవ్ అన్నారు. ఈ తరహా నిరసనలను తాము ఏ మాత్రం సమర్ధించమని ఆర్జేడీ నేత మనోజ్ ఝా అంటున్నారు. ఇలాంటి నిరసనలు చేసుకోవాలంటే వేరే వేదికలను చూసుకోవాలని ఆయన కాంగ్రెస్ పెద్దలకే చెప్పడం విశేషం.
అక్కడ కూడదంతే :
కాంగ్రెస్ కి మరో మిత్రపక్షం అయిన ఉద్ధవ్ తాక్రే శివసేన కూడా ఈ విషయంలో కాంగ్రెస్ ని తప్పుపట్టింది. రాజకీయ నిరసనలు వేరు అంతర్జాతీయ సదస్సు వంటి కార్యక్రమాలు వేరు అని ఆ పార్టీ సీనియర్ నాయకుడు అరవింద్ సావంత్ అన్నారు. ఈ తేడా తెలుసుకోవాలని ఏ వేదిక మీద ఏమి చేయాలన్నది కాంగ్రెస్ నేతలు అర్ధం చేసుకోవాలని చెప్పుకొచ్చారు. ఏఐ ఇంపాక్ట్ వంటి వేదికల వద్ద నిరసనలు చేసి ఉండాల్సింది కాదని ఆదిత్య థాక్రే అన్నారు.
దేశ గౌరవంగా :
అంతర్జాతీయ సదస్సులు అన్నవి దేశ గౌరవంగా చూడాలని పశ్చిమ బెంగాల్ ఐటీ శాఖ మంత్రి బాబుల్ సుప్రియో అన్నారు. రాజకీయ విభేదాలు వేరు అంతర్జాతీయ సదస్సులు వేరు అని చెప్పారు. నిరసనలు తెలపడం ప్రజాస్వామ్యంలో హక్కు అని తెలిసినా దానికి సమయం వేదిక సందర్భం చూసుకోవాలని అన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి మిత్రులే తలంటించేశారు. యువజన కాంగ్రెస్ నేతలు చేసిన పనికి ఇండియా కూటమిలోని కాంగ్రెస్ మిత్రులు కూడా ఎండగట్టడంతో కాంగ్రెస్ ఒంటరి అయింది. మరో వైపు ఎన్డీయే మిత్రులు తటస్థ పార్టీలు అయిన వైసీపీ బీఆర్ ఎస్ వంటివి కూడా ఖండించాయి. దాంతో కాంగ్రెస్ కక్కలేక మింగలేక అన్నట్లుగా ఈ ఇష్యూలో ఇరకాటంలో పడింది అని అంటున్నారు.