టీవీ స్క్రీన్‌పై తండ్రి ముద్రగడ చితి.. కూతురి గుండె కోత!

కన్నుమూసిన కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా చోటుచేసుకున్న ఒక అత్యంత బాధాకరమైన ఉదంతం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అందరినీ కలచివేస్తోంది.

Update: 2026-07-15 15:07 GMT

కన్నుమూసిన కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా చోటుచేసుకున్న ఒక అత్యంత బాధాకరమైన ఉదంతం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అందరినీ కలచివేస్తోంది. తన తండ్రికి చివరి వీడ్కోలు పలికేందుకు కూడా రాలేకపోయిన ఆయన కుమార్తె క్రాంతి, ఇంట్లోనే టీవీ స్క్రీన్ ముందు కూర్చుని తండ్రి చితిని చూస్తూ కన్నీరుమున్నీరుగా విలపించిన దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి హృదయాన్ని ద్రవింపజేస్తోంది.

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు గురువారం ఆయన స్వగ్రామమైన కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ముగిశాయి. వేలాది మంది అభిమానులు, రాజకీయ ప్రముఖులు, కాపు సామాజికవర్గ నేతల సమక్షంలో ఆయన అంతిమయాత్ర సాగింది. అయితే అందరూ అక్కడ భౌతికంగా హాజరై నివాళులర్పిస్తుంటే.. ఆయన కుమార్తె క్రాంతి మాత్రం ఆ మైదానంలో కనిపించలేదు.

ఆమె తన నివాసంలోనే టీవీ తెరిచి, తండ్రి అంత్యక్రియల ప్రత్యక్ష ప్రసారాన్ని చూశారు. స్క్రీన్‌పై తండ్రి పార్థివ దేహాన్ని, ఆయన చితికి నిప్పు పెడుతున్న దృశ్యాలను చూస్తూ క్రాంతి భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేకపోయారు. "నాన్నను చివరిసారిగా కళ్లారా చూసుకోలేకపోయాను.. కడసారి ముద్దు పెట్టుకోలేకపోయాను" అంటూ ఆమె గుండెలవిసేలా రోదించిన తీరు అక్కడ ఉన్న వారిని కన్నీళ్లు పెట్టించింది.

రాలేకపోవడానికి గల కారణాలేంటి?

ముద్రగడ పద్మనాభం మరణం తర్వాత ఆయన కుటుంబంలో చోటుచేసుకున్న కొన్ని అంతర్గత పరిణామాలు, కుటుంబ కలహాలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అంత్యక్రియల సమయంలో ఆమె తండ్రిని చూసేందుకు రాగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు ముద్రగడను చూసేందుకు ఒప్పుకోలేదు. పోలీసులు అతి కష్టం మీద తండ్రి వద్దకు చేర్చి నివాళులర్పింపచేసి పంపించారు. ఈ క్రమంలోనే అంతిమయాత్ర వేళ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని భావించిన నేపథ్యంలో క్రాంతి ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయినట్లు సమాచారం. ఒక కూతురిగా తండ్రి కడసారి చూపునకు కూడా నోచుకోలేకపోవడం, కేవలం ఒక టీవీ స్క్రీన్ ద్వారానే తండ్రికి వీడ్కోలు పలకాల్సి రావడం ఆమెను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. "రాజకీయాలు, సిద్ధాంతాలు, కుటుంబ కలహాలు ఏవైనా కావచ్చు.. కానీ కన్నతండ్రి అంత్యక్రియలకు ఒక కూతురు దూరం కావడం, ఆ దృశ్యాన్ని టీవీలో చూస్తూ రోదించడం కంటే పెద్ద విషాదం మరొకటి ఉండదు." అని స్థానిక ప్రత్యక్ష సాక్షులు వాపోతున్నారు.

క్రాంతి కన్నీరుమున్నీరవుతున్న ఈ దృశ్యాలు, దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రాజకీయాల కంటే, ప్రజా జీవితం కంటే కన్న కూతురి బంధం చాలా గొప్పదని, ఇలాంటి పరిస్థితి ఏ కూతురికీ రాకూడదంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముద్రగడ పద్మనాభం రాజకీయ నేతగానే కాకుండా కాపు ఉద్యమ సారథిగా ఒక శకాన్ని శాసించారు. ఆయన అంతిమయాత్రకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల నేతలు, వేలాది మంది ప్రజలు హాజరై నివాళులు అర్పించినప్పటికీ కన్న కూతురి ఆవేదన మాత్రం ఈ అంతిమయాత్రలో ఒక తీరని వెలితిగా మిగిలిపోయింది. కుటుంబ బంధాల విలువను, ఆత్మీయతల ప్రాధాన్యతను గుర్తుచేసే ఈ సంఘటన ఇప్పుడు అందరినీ తీవ్రంగా ఆలోచింపజేస్తోంది.

Tags:    

Similar News