తిరుచ్చి ఈస్ట్ బరిలో సింగం.. పక్కా క్లారిటీ ఇదే..!
క్షేత్రస్థాయిలో బలమైన పునాది, కేడర్ ను ముందుగా నిర్మించుకుంటానని, ఆ తర్వాతే ఎన్నికల బరిలో పోటీపై నిర్ణయం ఉంటుందని తేల్చిచెప్పారు. దీంతో తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నికపై అన్నామలై ఆలోచనపై క్లారిటీ వచ్చిందని అంటున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో సొంతంగా పార్టీ ఏర్పాటు చేసి 2031లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ శక్తిగా తలపడాలని భావిస్తున్న అన్నామలై.. అసెంబ్లీలో అడుగు పెట్టే విషయమై తనకు స్పష్టమైన ఆలోచన ఉన్నట్లు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో బలమైన పునాది, కేడర్ ను ముందుగా నిర్మించుకుంటానని, ఆ తర్వాతే ఎన్నికల బరిలో పోటీపై నిర్ణయం ఉంటుందని తేల్చిచెప్పారు. దీంతో తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నికపై అన్నామలై ఆలోచనపై క్లారిటీ వచ్చిందని అంటున్నారు.
తమిళనాడులో కొత్త పార్టీ పెట్టి రాజకీయ శక్తిగా ఎదగాలని భావిస్తున్న అన్నామలై ఇప్పట్లో ఎన్నికలలో తలపడే ఆలోచనలో లేనట్లు స్పష్టమైందని అంటున్నారు. బీజేపీకి రాజీనామా చేసిన తర్వాత ‘వి ద లీడర్స్’ అనే సామాజిక సంస్థను ఏర్పాటు చేసిన ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇటీవల పోల్లాచిలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో సుమారు 25 వేల మంది వరకు యువత తరలివచ్చారు. దీంతో తమిళనాడులో అన్నామలై నాయకత్వంపైనా యువత ఆసక్తి పెంచుకుంటున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక గత ఏప్రిల్ లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగగా కొత్తగా ఆవిర్భవించిన టీవీకే ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో యువకుడైన అన్నామలైకి కూడా నమ్మకం పెరిగిందని అంటున్నారు. ఆయన నాయకత్వంలో బీజేపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగినట్లు చెబుతున్నారు. అయితే తమిళనాట బీజేపీపై సహజంగా ఉన్న వ్యతిరేకత వల్ల ప్రధాన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు అవరోధాలు ఉన్నాయని ఆయన గ్రహించారని, అదే సమయంలో రాష్ట్రంలో ఏదో ఒక పార్టీపై పొత్తు పెట్టుకోవాలనే బీజేపీ పెద్దల ఆలోచనలు నచ్చక అన్నామలై బయటకి వచ్చారని అంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత క్లీన్ ఇమేజ్ కారణంగా టీవీకే అధినేత విజయ్ సునాయాశంగా గెలవగలిగారని అన్నామలై భావిస్తున్నారని అంటున్నారు. ఎన్నికలకు రెండేళ్ల ముందు పార్టీని పెట్టిన సీఎం విజయ్ వ్యూహాత్మకంగా పావులు కదిపి అధికారాన్ని కైవసం చేసుకున్నారని చెబుతున్నారు. విజయ్ పార్టీ ప్రకటించిన తర్వాత లోక్ సభ ఎన్నికలు జరిగినా పోటీ చేయలేదని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అన్నామలై సైతం అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. విజయ్ గత లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే ఆయన బలం ఏంటో తెలిసి అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రత్యర్థులు అప్రమత్తం అయ్యేవారని, దానివల్ల గట్టి పోటీ ఏర్పడేదని వ్యాఖ్యానిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల వరకు విజయ్ బలం, బలగంపై ప్రత్యర్థులకు అంచనాలు లేకపోవడం వల్లే టీవీకే రికార్డు క్రియేట్ చేసిందని అన్నామలై భావిస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు తాను కూడా తొందరపడి ఎన్నికలకు వెళ్లి తన బలం, బలహీనతలపై ప్రత్యర్థులకు సమాచారం ఇవ్వడం అనవసరంగా అన్నామలై లెక్కలేసుకుంటున్నారని అంటున్నారు. తిరుచ్చి ఈస్ట్ లో తాను ఒక్కడిని గెలిచినా పెద్దగా ఉపయోగం లేనందున ముందుగా పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టడమే మంచిది అన్న ఆలోచనకు అన్నామలై వచ్చారని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.