అమెరికా నుంచి కొత్త సవాల్.. భారత్ ఎలా ఎదుర్కొంటుంది?

భారత్‌తో పాటు చైనా, స్లోవేకియా, హంగేరీ, అజర్‌బైజాన్ వంటి దేశాల నుంచి అమెరికాకు జరిగే ఎగుమతులపై గరిష్టంగా 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే ప్రమాదం పొంచి ఉంది.

Update: 2026-07-15 12:30 GMT

రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై అమెరికా మరోసారి తన పంతాన్ని ప్రదర్శిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధానికి రష్యా వాడుతున్న ఆర్థిక వనరులను దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా కాంగ్రెస్‌లో సరికొత్త ఆంక్షల బిల్లు తెరపైకి వచ్చింది. ఒకవేళ ఈ బిల్లు చట్టంగా మారితే.. రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బ కానుంది. భారత్‌తో పాటు చైనా, స్లోవేకియా, హంగేరీ, అజర్‌బైజాన్ వంటి దేశాల నుంచి అమెరికాకు జరిగే ఎగుమతులపై గరిష్టంగా 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే ప్రమాదం పొంచి ఉంది.

ఏమిటీ కొత్త బిల్లు? అమెరికా ప్లాన్ ఏంటి?

వాషింగ్టన్‌లో జరిగిన ఒక మీడియా సమావేశంలో అమెరికా సెనేటర్ రిచర్డ్ బ్లూమెంతల్ ఈ బిల్లుకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు. రష్యా చమురును కొనుగోలు చేయడం ద్వారా మాస్కోకు భారీగా నిధులు అందుతున్నాయని.. అవే నిధులతో ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తోందని ఆయన ఆరోపించారు. అందుకే రష్యాతో వాణిజ్య సంబంధాలు పెట్టుకునే దేశాలపై కూడా ఒత్తిడి పెంచాలని అమెరికా భావిస్తోంది. ఈ బిల్లు రూపకల్పనలో సీనియర్ సెనేటర్ లిండ్సే గ్రాహం కీలక పాత్ర పోషించారు.

అయితే ఇందులో కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి.. రష్యా నుంచి గ్యాస్ దిగుమతులను 15 శాతం కంటే తక్కువకు పరిమితం చేసి.. వాటిని క్రమంగా తగ్గించే దేశాలకు కొంత వెసులుబాటు ఉంటుంది. కానీ రష్యా నుంచి అత్యధికంగా చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్ వంటి దేశాలపై ఈ నిబంధనలు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

గతంలో 500%.. ఇప్పుడు 100% టారిఫ్!

గత ఏడాది అమెరికా "సాంక్షనింగ్ రష్యా యాక్ట్" పేరుతో తీసుకొచ్చిన బిల్లులో ఏకంగా 500 శాతం టారిఫ్‌లు విధించాలని ప్రతిపాదించారు. అయితే ఆ ప్రతిపాదన అత్యంత కఠినంగా ఉండటం.. రాజకీయ మద్దతు లభించకపోవడంతో అది వీగిపోయింది. ఇప్పుడు అదే బిల్లును సవరించి, గరిష్ట టారిఫ్‌ను 100 శాతానికి పరిమితం చేస్తూ సరికొత్తగా ప్రవేశపెట్టారు. ఈసారి దీనికి వైట్ హౌస్ మద్దతు కూడా ఉండటంతో రాబోయే ఆగస్టు నెలకు ముందే ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశాలు ఉన్నాయని సెనేటర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ చట్టం అమల్లోకి వస్తే ఏ దేశంపై ఎంత శాతం టారిఫ్ విధించాలనేది అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ కార్యాలయం నిర్ణయిస్తుంది. రష్యా నుంచి చమురు కొనకుండా నిరుత్సాహపరిచేలా ఈ టారిఫ్‌లు ఉంటాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

భారత్‌కు ఎదురయ్యే సవాళ్లు ఏంటి?

ఈ బిల్లు గనుక చట్టరూపం దాలిస్తే భారత్-అమెరికా దౌత్య, వాణిజ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అమెరికాకు వివిధ వస్తువులను ఎగుమతి చేసే భారతీయ పరిశ్రమలపై అదనపు పన్నుల భారం పడుతుంది. 100% టారిఫ్ పడితే అమెరికా మార్కెట్లో భారతీయ ఉత్పత్తుల ధరలు పెరిగి, పోటీతత్వాన్ని కోల్పోతాయి. రష్యా నుంచి తక్కువ ధరకు వచ్చే చమురును ఆపేస్తే, దేశీయంగా ఇంధన ధరలు పెరిగే ప్రమాదం ఉంది.

రష్యాతో ఉన్న ఇంధన అవసరాలను కాపాడుకుంటూనే మరోవైపు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన అమెరికాతో సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోవడం ఇప్పుడు భారత్‌కు ఒక సవాల్. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత ప్రభుత్వం తన దౌత్య నైపుణ్యం, వ్యూహాత్మక చర్చల ద్వారా ఈ 'అమెరికా పిడుగు'ను ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News