ఆకలి కేకలు vs అణచివేత.. పీఓకే స్వాతంత్ర్య ప్రకటన ఎటు దారితీస్తుంది?
జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జాక్) ఇచ్చిన పిలుపుతో ముజఫరాబాద్ వైపు సాగుతున్న వేలాది మంది జనం పాదయాత్ర చూస్తుంటే ఇస్లామాబాద్‌లోని పాలకులకు చెమటలు పడుతున్నాయి.
పరిపాలన చేతకాక.. అప్పుల ఊబిలో కూరుకుపోయి.. చేతిలో చిల్లిగవ్వ లేక అల్లాడుతున్న పాకిస్తాన్‌కు సొంత ఇంట్లోనే పెద్ద కుంపటి తయారైంది. "మా వల్ల కావడం లేదు మహాప్రభో మీతో కలిసి మేం బతకలేం" అంటూ పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ జనాలు తిరుగుబాటు జెండా ఎగరేశారు. నిన్నమొన్నటి వరకు గోధుమ పిండి ధరలు, కరెంట్ బిల్లుల తగ్గింపు కోసం గొంతు చించుకున్న ప్రజలు.. ఇప్పుడు ఏకంగా "టాటా, బై బై.. గుడ్ బై పాకిస్తాన్!" అంటూ స్వాతంత్ర్య నినాదాల పల్లవి అందుకున్నారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జాక్) ఇచ్చిన పిలుపుతో ముజఫరాబాద్ వైపు సాగుతున్న వేలాది మంది జనం పాదయాత్ర చూస్తుంటే ఇస్లామాబాద్‌లోని పాలకులకు చెమటలు పడుతున్నాయి.
ముజఫరాబాద్ బాట పట్టిన జనం.. గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న సైన్యం!
రావల్కోట్, పూంచ్, సుధనోటి వంటి ప్రాంతాల నుంచి పిల్లాపాపలతో సహా రోడ్లపైకి వచ్చేశారు. చేతిలో తెల్ల జెండాలు పట్టుకుని, పాక్ సైన్యానికి "నో ఎంట్రీ" బోర్డులు చూపిస్తున్నారు. పాక్ ప్రభుత్వం ఎప్పటిలాగే తన పాత అలవాటును బయటపెట్టింది. నిరసనకారులను అడ్డుకోవడానికి రోడ్లపై పెద్ద పెద్ద కంటైనర్లు, బారికేడ్లు పెట్టి, వేలాది మంది రేంజర్లను దిగ్బంధించింది. ఇంటర్నెట్, ఫోన్ కనెక్షన్లను కట్ చేసి "మా దేశంలో అంతా ప్రశాంతం" అని కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని అక్కడి హింస, బాష్పవాయువు ప్రయోగాలు, కాల్పుల దృశ్యాలు ప్రపంచమంతటా పాకాయి.
సోషల్ మీడియాలో 'స్వాతంత్ర్యం'.. వాస్తవంలో ఏం జరుగుతోంది?
ఇప్పటికే ట్విట్టర్ , ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో "పీఓకే స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.. పాక్ నుంచి విడిపోయింది" అనే వార్తలు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అయితే టెక్నికల్‌గా చూస్తే ఇంకా అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. కానీ, యూకేపీఎన్‌పీ లాంటి సంస్థలు ఇప్పటికే ఐక్యరాజ్యసమితి తలుపు తడుతూ.. "పాక్ సైన్యం మా గొంతు నొక్కుతోంది.. కాపాడండి బాబోయ్!" అంటూ అంతర్జాతీయ వేదికలపై మొరపెట్టుకుంటున్నాయి.
ఈ కథ ఎటు దారితీస్తుంది?
తన పౌరులకు రోజుకు మూడు పూటలా తిండి పెట్టలేని పాక్ పాలకులు, పీఓకే నిరసనకారుల డిమాండ్లను తీర్చడం కన్నా వారిపై తుపాకులు గురిపెట్టడమే సులువు అనుకుంటున్నారు. అయితే ఈసారి జనం కూడా వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. డిమాండ్లు తీర్చకపోతే పాక్ మ్యాప్ నుంచి పీఓకే విడిపోవడం ఖాయం అని గట్టిగానే హెచ్చరిస్తున్నారు.
మరి ఈ అణచివేత కాస్తా పీఓకేను పాకిస్తాన్ నుంచి శాశ్వతంగా విడదీస్తుందా? లేక పాక్ సైన్యం మరో రక్తపాతానికి తెరలేపుతుందా అనేది చూడాలి. ఏదేమైనా ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ పరువు మరోసారి గంగలో కలవడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.