వంశీ వర్సెస్ వెంకట్రావ్.. చంద్రబాబు దగ్గరకు పంచాయితీ!
అంతేకాదు.. తనకు.. ఈ వ్యవహారానికి సంబంధం లేదన్న వంశీ.. ఏదేమైనా ఎమ్మెల్యే యార్లగడ్డ చేసిన వ్యాఖ్యలు.. విమర్శలతో తన పరువుకు భంగం కలిగిందన్నారు.
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గం రాజకీయాలు కాక రేపుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు యార్లగడ్డ వెంకట్రావు ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గన్నవరం విమానాశ్రయం రెండో విడత విస్తరణలో చేయాల్సిన పనులను అధిక రేట్లకు ఓ కాంట్రాక్టర్‌కు కేటాయించారని, దీనిపై కనీసం తనను సంప్రదించలేదని.. పెద్ద స్థాయిలో ఇది జరిగిందని ఆరోపించారు. అంతేకాదు... తన ప్రత్యర్థికి చెందిన వారికే ఈ కాంట్రాక్టును కట్టబెట్టారని కూడా వ్యాఖ్యానించారు.
ఇక, తొలిదశ పనులకు 370 కోట్ల రూపాయలు అయితే.. రెండో విడతలో చేపట్టాల్సిన 20 శాతం పనులకు 200 కోట్ల రూపాయల కు పైగానే కాంట్రాక్టును కట్టబెట్టారని ఎమ్మెల్యే వెంకట్రావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారం స్థానికంగానే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత రెండు రోజులుగా కలకలం రేపింది. ఇక, ఇప్పుడు తాజాగా వైసీపీ నాయకుడు, టీడీపీ మాజీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. తనను ఉద్దేశించే యార్లగడ్డ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని.. తానే స్వయంగా ఈ కాంట్రాక్టు ను ఇప్పించానని వ్యాఖ్యానిస్తున్నారని పేర్కొంటూ సీఎం చంద్రబాబు సుదీర్ఘ లేఖ సంధించారు.
అంతేకాదు.. తనకు.. ఈ వ్యవహారానికి సంబంధం లేదన్న వంశీ.. ఏదేమైనా ఎమ్మెల్యే యార్లగడ్డ చేసిన వ్యాఖ్యలు.. విమర్శలతో తన పరువుకు భంగం కలిగిందన్నారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని వంశీ డిమాండ్ చేశారు. గన్నవరం విమానాశ్రయం రెండో విడత పనులు ఎవరికి ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? ఎంతకు కోట్ చేశారు? అనే విషయాలను ప్రజలకు కూడా చెప్పాల్సి ఉందని.. దీనిపై సమగ్ర వివరాలను ప్రజలకు అందించాలని కోరారు. "కేఎంవీ" సంస్థకు జరిగిన కేటాయింపులపైనా విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.
గత 2019 ఎన్నికలకు ముందు వరకు వంశీ టీడీపీలో ఉండగా, యార్లగడ్డ వైసీపీలో ఉన్నారు. అయితే.. వంశీని వైసీపీలోకి తీసుకున్న నేపథ్యంలో ఆయన వైసీపీతో విభేదించారు. ఈ క్రమంలోనే 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరి గన్నవరం టికెట్ సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో విజయం సాధించారు. మంచి నేతగా గుర్తింపు పొందుతున్న సమయంలో గన్నవరం విమానాశ్రయ కాంట్రాక్టు వ్యవహారంపై ఎమ్మెల్యే స్థాయిలో బహిరంగ వేదికపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా యార్లగడ్డకు .. ఇటు పార్టీకి కూడా ఇబ్బందిగా మారుతున్నాయి. దీనిపై చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.